‘ది ఒడిస్సీ’ని ఎదిరించి నిలబడ్డ చిన్న సినిమాలు! హాలీవుడ్ కొత్త ఫార్ములా ఇదే
–సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక సినిమా భాక్సాఫీస్ దగ్గర చనిపోవడానికి… చెడ్డ రివ్యూలు అవసరం లేదు. చాలా సార్లు చెడ్డ కథ కూడా అవసరం లేదు. ప్రక్కనే ఒక్క పెద్ద సినిమా విడుదలైతే చాలు.ఆ సినిమా థియేటర్స్ నుంచి ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. అందుకే పెద్ద సినిమా థియేటర్స్ లోకి వస్తోందంటే చాలా మంది చిన్న సినిమావాళ్లు ఆలోచిస్తారు. ప్రక్కకు తప్పుకుంటారు. చాలా కాలం రిలీజ్ కు డేట్స్, థియేటర్స్ దొరికని వాళ్లే..సర్లే వారం అయినా ఖాళీ దొరుకుతోంది అనుకుంటూ థియేటర్స్ లో దూకేస్తారు. ఇది మన ఒక్క తెలుగులోనే కాదు. పంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో ఏళ్లుగా నడుస్తున్న లెక్క ఇదే. కానీ, ఈసారి ఆ లెక్క తప్పింది.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం మాట్లాడుతున్న సినిమా క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’. ఈ సినిమా గ్రాండ్ రిలీజ్, దానికి పోటీగా వరల్డ్ కప్ ఫైనల్స్ హడావుడి గురించే అందరూ మాట్లాడుతున్నారు. వేలాది స్క్రీన్లు, రికార్డు స్థాయి కలెక్షన్లు నడుస్తున్న ఇలాంటి టైమ్‌లో చిన్న సినిమాలు థియేటర్ల నుంచి అడ్రస్ లేకుండా మాయమైపోవటం రివాజు. కానీ అలా జరగలేదు.అందుకే అదే విశేషం అయ్యింది.
నిశ్శబ్దంగా వచ్చిన కొన్ని చిన్న సినిమాలు… ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, వారానికో షో చొప్పున పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడుతున్నాయి. నమ్మబుద్ది కావటం లేదా… హాలీవుడ్ తన చిన్న సినిమాలను బతికించుకునేందుకు అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి!
పెద్ద సినిమా వచ్చినా… చిన్న సినిమా ఎందుకు చనిపోవడం లేదు?
అమెరికా బాక్సాఫీస్ తాజా రిపోర్ట్ (జూలై 20) చూస్తే ఒక ఆసక్తికరమైన నిజం కనిపిస్తుంది. ఒకవైపు ‘ది ఒడిస్సీ’ థియేటర్లను ఆక్రమించినా, మరోవైపు ‘మ్యాడీస్ సీక్రెట్’, ‘యంగ్ వాషింగ్టన్’, ‘అబ్సెషన్’, ‘ది ఇన్వైట్’ వంటి సినిమాలు తమ ప్రయాణాన్ని ఆపలేదు.
కొన్ని ఐదో వారంలో, కొన్ని పదో వారంలో… మరికొన్ని ఇప్పుడిప్పుడే థియేటర్ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. అంటే, పెద్ద సినిమా తుఫాను వచ్చినా ఈ చిన్న పడవలు మునిగిపోలేదు.
కేవలం 84 థియేటర్లు… అయినా $1 మిలియన్!
ఈ ట్రెండ్‌కు నిలువెత్తు సాక్ష్యం మ్యాగ్నోలియా పిక్చర్స్ వారి ‘మ్యాడీస్ సీక్రెట్’ (Maddie’s Secret). జాన్ ఆర్లీ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రదర్శితమవుతోంది కేవలం 84 థియేటర్లలోనే!
ఈ వారం కేవలం $80.5k మాత్రమే వచ్చినా, ఐదో వారం ముగిసేసరికి ఇది మొత్తం $1 మిలియన్ (సుమారు ₹8.3 కోట్లు) వసూళ్లను సాధించింది. వేల స్క్రీన్లు లేకపోయినా, ఉన్న 84 థియేటర్లు మాగ్జిమం ఫుల్స్ అవ్వటం వల్లే ఇది సాధ్యమైంది. హాలీవుడ్లో దీనినే Screen Average స్ట్రెంత్ అంటారు.
10వ వారంలోనూ టాప్-10లో ‘అబ్సెషన్’
మరో విచిత్రమైన వండర్… Focus Features వారి ‘అబ్సెషన్’ (Obsession). కర్రీ బార్కర్ తీసిన ఈ చిన్న సినిమా మొదట్లో ఒక ఇండిపెండెంట్ ప్రయత్నంగానే మొదలైంది. కానీ పక్కా వర్డ్ ఆఫ్ మౌత్‌తో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $258 మిలియన్లు (సుమారు ₹2,150 కోట్లు) కొల్లగొట్టింది.
విడుదలైన 10వ వారంలో కూడా ఈ వారం 1,500 స్క్రీన్లలో $2.5 మిలియన్లు రాబట్టి టాప్-10 చార్ట్‌లో కొనసాగుతోంది. మొదటి వీకెండ్ మాత్రమే కాదు, ‘లాంగ్ రన్’ కూడా ఒక సినిమా రేంజ్‌ని మార్చేస్తుందని ఇది నిరూపించింది.
మూడో వారంలోనే సీక్వెల్ అనౌన్స్మెంట్!
Angel Studios నిర్మించిన చారిత్రక చిత్రం ‘యంగ్ వాషింగ్టన్’ (Young Washington) 3వ వారంలో 2,200 కేంద్రాల నుండి $3.7 మిలియన్లు సాధించి, మొత్తం $41 మిలియన్ల వసూళ్లకు చేరింది. విలియం ఫ్రాంక్లిన్-మిల్లర్ జార్జ్ వాషింగ్టన్గా నటించిన ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు చూసి, స్టూడియో ఏకంగా దీనికి ‘1776’ పేరుతో సీక్వెల్‌ను కూడా ప్రకటించేసింది.
అలాగే ఆలివియా వైల్డ్ తీసిన కామెడీ చిత్రం ‘ది ఇన్వైట్’ (The Invite) 4వ వారంలో 2,100 స్క్రీన్ల నుండి $3.9 మిలియన్లు వసూలు చేసి, మొత్తం $15 మిలియన్ల మార్కును తాకింది.
అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది!
హాలీవుడ్లో ఒక చిన్న సినిమాను మొదటి రోజే 1,000 థియేటర్లలో రుద్దటం లేదు.ఓ స్ట్రాటజీగా రిలీజ్ ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నారు.
స్టెప్ 1: మొదట కొన్ని నగరాల్లో, కేవలం 5 లేదా 10 థియేటర్లు.
స్టెప్ 2: అక్కడ స్క్రీన్ యావరేజ్, ప్రేక్షకుల రెస్పాన్స్ చూడటం.
స్టెప్ 3: టాక్ బాగుంటే 50… ఆపై 100… ఆ తర్వాతే 1,000 స్క్రీన్లకు విస్తరణ.
(ఉదాహరణకు ఈ వారమే Oscilloscope వారి ‘ది కిడ్నాపింగ్ ఆఫ్ అరబెల్లా’ న్యూయార్క్‌లోని ఒకే ఒక్క IFC సెంటర్ థియేటర్లో విడుదలై $11k వసూలు చేసి హౌస్‌ఫుల్ అయింది. వచ్చే వారం నుండి దీని స్క్రీన్లు పెంచుతున్నారు. అలాగే ‘రీడింగ్ లోలిటా ఇన్ టెహ్రాన్’ సినిమా కూడా $24k వసూలు చేయడంతో వచ్చే వారం 100 థియేటర్లకు విస్తరిస్తున్నారు).
ఈ మొత్తం ప్రయాణాన్ని నిర్ణయించేది కోట్ల రూపాయల ప్రకటనలు కాదు… కేవలం ప్రేక్షకుల పాజిటివ్ టాక్ మాత్రమే! అని హాలీవుడ్ ఇప్పుడు నమ్ముతోంది.
ఇదే ‘స్పెషాలిటీ బాక్సాఫీస్’
హాలీవుడ్లో ఈ తరహా సినిమాల కోసం ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఎకోసిస్టమ్ ఉంది. దాన్నే Specialty Box Office అంటారు. ఇవి అందరినీ మెప్పించే మాస్ సినిమాలు కావు. ఒక నిర్దిష్టమైన ఆడియన్స్ టేస్ట్ కోసం తీసే సినిమాలు. వీటి సక్సెస్ మొదటి రోజు కలెక్షన్లతో కొలవరు… ఎంతకాలం థియేటర్లో నిలబడ్డాయి (Long Run) అనేదాన్ని బట్టే కొలుస్తారు.
మరి మన దగ్గర?
తెలుగులో కూడా జాతిరత్నాలు, ‘బలగం’, ‘కమిటీ కుర్రోళ్ళు’, ‘కోర్ట్’, బేబి వంటి చాలా సినిమాలు మంచి టాక్‌తో పెద్ద విజయాలుగా నిలిచాయి. అంటే మన ప్రేక్షకులు చిన్న సినిమాలను తిరస్కరించడం లేదు. మంచి కథ,కథనం ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తున్నారు.
అయితే భారతీయ మార్కెట్, అమెరికా మార్కెట్ నిర్మాణం పూర్తిగా వేర్వేరు. రెండింటినీ నేరుగా పోల్చలేం. కానీ, మన దగ్గర మొదటి మూడు రోజుల్లోనే సినిమా జాతకాన్ని తేల్చేసి థియేటర్ల నుంచి తీసేసే ‘హడావుడి డిస్ట్రిబ్యూషన్’ వ్యవస్థపై పరిశ్రమలో ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఎంతోమంది నూతన దర్శకుల మంచి సినిమాలు ప్రేక్షకులకు కనీసం రీచ్ అయ్యేలోపే థియేటర్ల నుంచి మాయమైపోతున్నాయన్నది నిజం.
ఏదైమైనా
హాలీవుడ్ స్పెషాలిటీ బాక్సాఫీస్ ఈ వారం ఒక నిజాన్ని మరోసారి గుర్తుచేసింది: ఒక చిన్న సినిమా గెలవడానికి మంచి కథ ఒక్కటే ఉంటే సరిపోదు… దానికి ప్రేక్షకుల దాకా వెళ్లే ‘సమయం’, ‘అవకాశం’ కూడా దక్కాలి.
అదే అవకాశం దొరికితే… బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారతాయో ఈ చిన్న సినిమాలే నిరూపిస్తున్నాయి.
ఇప్పుడు మన భాక్సాఫీస్ ముందూ ఇదే ప్రశ్న నిలుస్తోంది..చిన్న సినిమాలకు మన దగ్గర ప్రేక్షకులు లేరా? లేక, ప్రేక్షకులను చేరుకునేంత సమయమే ఆ సినిమాలకు దొరకడం లేదా?








