పిల్ కాదు… కండోమ్ కాదు… సైలెంట్‌గా పనిచేస్తున్న కొత్త ‘బర్త్ కంట్రోల్’
–సూర్య ప్రకాష్ జోశ్యుల
హైదరాబాద్‌లోని ఒక కేఫే.
ఎదురెదురుగా ఒక యువజంట కూర్చుంది.
చిత్రం ఏమిటంటే వాళ్లు ఒకరినొకరు దొంగ చూపులు కాదు కదా..మామూలుగా కూడా చూడటం లేదు.
వారి ఎదురుగా ఉన్న కాఫీ చల్లారిపోయింది. కానీ ఇద్దరి చేతుల్లోనూ ఫోన్లు మాత్రం వేడిగా ఉన్నాయి.
అలాగే పది నిమిషాల్లో వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది ఐదు వాక్యాలు కూడా కాదు. కానీ అదే సమయంలో సోషల్ మీడియాలో డజన్ల కొద్దీ పోస్టులు చూశారు, మెసేజ్‌లకు రిప్లై ఇచ్చారు, రీల్స్ స్క్రోల్ చేశారు.
ఇది మనకు రోజూ కనిపించే సాధారణ సన్నివేశమే. కానీ… ఇదే సన్నివేశానికి ప్రపంచ జనాభా తగ్గుదలతో సంబంధం ఉందని ఎవరైనా చెబితే? నమ్ముతారా…
వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది కదూ.
అమెరికాలో తాజాగా వెలువడిన రెండు పరిశోధనలు ఇప్పుడు అదే సిట్యువేషన్ ను ప్రపంచం ముందుంచుతున్నాయి.
—-
ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ‘Birth Control’ ఏది?
బర్త్ కంట్రోల్ పిల్ కాదు.
కండోమ్ కాదు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా కాదు.
రోజుకు వందల సార్లు మనం చేతిలోకి తీసుకునే ఒక పరికరం…
ఇవి కూడా చదవండి
అవును ..మన స్మార్ట్‌ఫోన్.
ఇది స్మార్ట్ఫోన్లపై యుద్ధం ప్రకటించే కథనం కాదు. స్మార్ట్‌ఫోన్ ఒక్కటే కారణమని పిల్లల పుట్టకపోవటానికి కారణం అంటూ నిర్ధారించే కథ కూడా కాదు. కానీ గత ఇరవై ఏళ్లలో మనుషుల జీవనశైలి ఎలా మారిందో, ఆ మార్పు కుటుంబాలపై, చివరికి జననాల రేటుపై కూడా ప్రభావం చూపుతోంది అని చెప్పే కథ.
అప్పట్లో అనుమానం డబ్బు
2008లో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసినప్పుడు, జననాల రేటు తగ్గడానికి అదే కారణమని చాలామంది భావించారు. ఉద్యోగాలు పోయాయి. ఇళ్ల రుణాలు భారమయ్యాయి. కుటుంబాలు భవిష్యత్తుపై ఆందోళన చెందాయి. ఆ వివరణ అప్పుడు సరైనదే అనిపించింది.
కానీ ఒక సమస్య వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకుంది. ఉద్యోగాలు తిరిగి వచ్చాయి. మార్కెట్లు నిలబడ్డాయి. జననాల రేటు మాత్రం నిలబడలేదు.
అక్కడే పరిశోధకులు మరో ప్రశ్న అడగడం ప్రారంభించారు. డబ్బు కాకుండా… మనుషుల జీవన విధానంలో ఇంకేదైనా పెద్ద మార్పు జరిగిందా?
అక్కడే కథలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చింది
2007లో మొదటి ఐఫోన్ విడుదలైంది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే స్మార్ట్ఫోన్లు ప్రపంచ జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. మనకు తెలియకుండానే రోజు ఎలా గడుస్తుందో మారిపోయింది.
ప్రయాణంలో ఫోన్. భోజనం చేస్తున్నప్పుడు ఫోన్. పడుకునే ముందు ఫోన్. లేచిన వెంటనే ఫోన్.
ఒకప్పుడు స్నేహితులను కలవడానికి బయటకు వెళ్లే సమయం, కుటుంబంతో మాట్లాడే సమయం, భాగస్వామితో గడిపే సమయం… ఇవన్నీ నెమ్మదిగా స్క్రీన్ టైమ్‌కు చోటు ఇచ్చాయి.
ఈ మార్పు జననాల రేటుతో సంబంధం ఉందా?
అదే ప్రశ్నతో అమెరికాలోని మిడిల్బరీ కాలేజ్ పరిశోధకులు తమ అధ్యయనం ప్రారంభించారు. ఆ సమయంలో ఐఫోన్ ఒకే మొబైల్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉండటం వల్ల, స్మార్ట్‌ఫోన్ విస్తరణ ఎక్కువగా జరిగిన ప్రాంతాలను, తక్కువగా జరిగిన ప్రాంతాలతో పోల్చే అవకాశం వారికి లభించింది.
వారి విశ్లేషణలో యువతలో జననాల రేటు మరింత వేగంగా తగ్గిన ధోరణి కనిపించింది. అయితే వారు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేశారు. “స్మార్ట్‌ఫోన్ ఒక్కటే కారణం” అని ఈ అధ్యయనం చెప్పడం లేదు. కానీ, ఆ మార్పును పూర్తిగా విస్మరించలేమని మాత్రం సూచిస్తోంది.
ఈ విశ్లేషణ కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. మరో అధ్యయనం ప్రపంచ బ్యాంక్ గణాంకాలను ఉపయోగించి 128 దేశాల డేటాను విశ్లేషించింది. సంస్కృతులు వేరు. ప్రభుత్వాలు వేరు. ఆర్థిక పరిస్థితులు వేరు. అయినా, స్మార్ట్ఫోన్లు విస్తరించిన కాలంలోనే జననాల తగ్గుదల వేగం పెరిగిన ఒకే తరహా నమూనా అనేక దేశాల్లో కనిపించింది. దాన్నే పరిశోధకులు “గ్లోబల్ టెక్నాలజీ షాక్”గా అభివర్ణించారు.
పరిశోధన ఫలితాలు:
నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం, 2007 నుండి అమెరికాలో సంతానోత్పత్తి రేటు 22 శాతం తగ్గింది. 2007లో ఐఫోన్ పరిచయం అయిన నాటి నుండి 15-19 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో జననాలు 4.5% నుండి 8.0% వరకు, 20-24 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో 3.2% నుండి 6.6% వరకు తగ్గాయి.
అసలు మారింది ఏమిటి?
ఈ అధ్యయనాలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని సూచిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ మనిషి శరీరాన్ని మార్చదు. కానీ మనిషి రోజును మార్చగలదు.దాంతో రూజువారి అలవాట్లు మారుతాయి. అలవాట్లు మారితే సంబంధాలు మారతాయి.
పరిశోధకులు గమనించిన దాని ప్రకారం, స్మార్ట్ఫోన్లు విస్తరించిన తర్వాత ప్రత్యక్షంగా స్నేహితులను కలవడం తగ్గింది. అదే సమయంలో లైంగిక కార్యకలాపాలు కూడా తగ్గినట్లు అమెరికా అధ్యయనం పేర్కొంది. పోర్నోగ్రఫీ వినియోగం పెరగడం కూడా ఒక సాధ్యమైన అంశంగా పరిశోధకులు ప్రస్తావించారు.ఇదే సరైన కారణమని వారు తేల్చలేదు. కానీ ఈ మార్పులన్నింటి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
భారత్ లో కూడా…
భారత్ ఈ చర్చకు దూరంలో లేదు ఒకప్పుడు భారత్ ప్రపంచ జనాభా పెరుగుదల గురించి మాట్లాడేది.ఇప్పుడు పరిస్థితి మారుతోంది. భారత్‌లో కూడా ఫెర్టిలిటీ రేటు గత రెండు దశాబ్దాల్లో గణనీయంగా తగ్గింది. దీనికి ఆలస్యమైన వివాహాలు, పట్టణ జీవనం, పిల్లల పెంపకం ఖర్చు, మహిళల విద్య, ఉద్యోగ ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉన్నాయి.
ఇప్పుడు మరో విషయం కూడా జాబితాలో చేరుతోంది.
డిజిటల్ జీవనశైలి కూడా ఈ మార్పులో ఒక పాత్ర పోషిస్తోందా? ఈ ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. కానీ దాన్ని అడగడానికి మాత్రం సరిపడా ఆధారాలు కనిపించడం ప్రారంభమైంది.
ఏదైమైనా…
ఈ కథ స్మార్ట్‌ఫోన్ గురించి కాదు.
ఒకరినొకరు చూడాల్సిన సమయంలో… స్క్రీన్‌ను చూడడం మొదలుపెట్టిన మన గురించి. మాట్లాడాల్సిన సమయంలో… స్క్రోల్ చేయడం మొదలుపెట్టిన మన గురించి.
ప్రేమించాల్సిన సమయంలో…నోటిఫికేషన్లకు స్పందించడం మొదలుపెట్టిన మన గురించి.
అందుకే ఈ పరిశోధనలు కేవలం జననాల రేటును కొలవడం లేదు. మనిషి జీవనశైలిలో జరిగిన అత్యంత నిశ్శబ్దమైన విప్లవాన్ని కొలవడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఒకవేళ ఆ విప్లవం నిజమే అయితే… ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ‘Birth Control’ ఒక మందు కాదు… మన చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ కాదు…ఆ స్మార్ట్‌ఫోన్ నెమ్మదిగా మార్చేసిన మన జీవన విధానం అని మర్చిపోకూడదు.








