భారతీయ నటులకు గుర్తింపు రావాలంటే ఇదే మార్గం.. నోలన్ సలహా
క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) ఇండియన్ సినిమాపై చేసిన తాజా కామెంట్స్ మరోసారి ప్రపంచ సినీ వర్గాల్లో డిస్కషన్‌కు దారి తీశాయి. ఇండియన్ నటులకు టాలెంట్, ఎక్స్‌పీరియెన్స్ ఉన్నప్పటికీ ఇంటర్నేషనల్ లెవెల్ లో వారికి తగిన గుర్తింపు రావడం లేదనే ప్రశ్నకు స్పందించిన నోలన్, దీనికి ప్రధాన కారణం గతంలో అనుసరించిన పంపిణీ విధానమేనని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ విడివిడిగా పనిచేయడం వల్ల ప్రపంచ మార్కెట్‌ను టార్గెట్ గా చేసుకునే ప్రయత్నాలు పరిమితంగానే జరిగాయని ఆయన పేర్కొన్నారు. సరైన అంతర్జాతీయ వ్యూహం లేకపోవడం వల్ల భారతీయ నటుల ప్రతిభ ప్రపంచ ప్రేక్షకులకు పెద్ద ఎత్తున చేరలేదని ఆయన విశ్లేషించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాను నోలన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికాలో ఆ సినిమా సాధించిన సక్సెస్ ను ఎగ్జాంపుల్ గా చూపిస్తూ, మంచి కథతో పాటు సరైన ప్రమోషన్ ఉంటే భాష ఎప్పుడూ అడ్డంకి కాదని అన్నారు. ముఖ్యంగా అమెరికా వంటి అతిపెద్ద మార్కెట్లో సినిమాలను సమర్థవంతంగా ప్రమోట్ చేస్తే ఇండియన్ సినిమాలకు మరింత విస్తృత ఆదరణ లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలను పరిచయం చేయడంలో మార్కెటింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని నోలన్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్లను సొంతం చేసుకుంటున్న సమయంలో నోలన్ కామెంట్స్ కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఆదరిస్తారనే విషయాన్ని ఇటీవల పాన్ ఇండియా సినిమాలు మరోసారి నిరూపించాయి. ఇదిలా ఉండగా నోలన్ తాజా సినిమా ది ఒడిస్సీ(The Odyssey) ఇండియాలో కూడా మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని A సెంటర్లలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం విశేషంగా మారింది.








