అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒకటిగా టీటీఏ కన్వెన్షన్ నిలిచిపోతుంది: మేయర్ రాబ్ హారింగ్టన్
చార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్ 2026కు చార్లెట్ నగరం వేదిక కావడం గొప్ప విషయమని ఆ నగర మేయర్ రాబ్ హారింగ్టన్ పేర్కొన్నారు. కన్వెన్షన్ సందర్భంగా ఆయన హాజరై, టీటీఏ సంస్థకు మద్దతుగా ఒక అధికారిక ప్రకటనను చదివి వినిపించారు. చార్లెట్ నగరానికి విచ్చేసిన ప్రతినిధులందరికీ ఆయన ఘనస్వాగతం పలకడంతో పాటు, నగరం ఇంత శక్తివంతమైన, సాంస్కృతిక సమాజంతో నిండి ఉండటం చూసి చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
టీటీఏ సంస్థ సాంస్కృతిక సంరక్షణ, సమాజ సేవ, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న సంస్థ అని మేయర్ కొనియాడారు. ఈ కన్వెన్షన్ ఉత్తర అమెరికాలో తెలుగువారి అతిపెద్ద సాంస్కృతిక , సామాజిక సభలలో ఒకటిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రోజుల్లో సుమారు 20 వేల మంది హాజరవుతున్న ఈ వేడుక, 2026 సంవత్సరంలో చార్లెట్లో జరిగిన అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
టీటీఏ మెగా కన్వెన్షన్ కోసం చార్లెట్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు తమ నగరం భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటుందో తెలియజేస్తాయని మేయర్ హారింగ్టన్ తన ప్రసంగంలో వెల్లడించారు.








