జాగ్రత్త!! డేటింగ్ యాప్ లలో ‘చాట్ఫిషింగ్’ మోసం! ?
–సూర్య ప్రకాష్ జోశ్యుల
“అమ్మా… అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడే.”
కొన్ని రోజుల చాటింగ్ తర్వాత… ఆ అమ్మాయి ఇంట్లో చెప్పిన మొదటి మాట అదే.
అంత ధైర్యంగా ఆ మాట ఇంట్లో చెప్పటానికి కారణం…డేటింగ్ యాప్ లో పరిచయం అయిన ఆ కుర్రాడు పంపే ప్రతి మెసేజ్‌లో మర్యాద…ప్రతి రిప్లైలో మెచ్యూరిటీ… ప్రతి మాటలో తన మనసు చదివినట్టే అనిపించేది. పదే పదే అదే గుర్తుకు వచ్చేది. చాలా మురిసిపోయేది. చివరకి ఒకరోజు “ఇతనే కావాలి…ఇతను లేకుండా బ్రతకలేను” అని ఫిక్సైపోయింది. అతన్ని కలవటానికి టైమ్ ,డేట్, వెన్యూ ఫిక్స్ చేసుకుంది. అయితే అక్కడే ట్విస్ట్ పడింది.
మొదటిసారి ఎదురెదురుగా కలిసిన క్షణంలో అన్నీ మారిపోయాయి. చాటింగ్‌లో గంటల తరబడి మాట్లాడిన వ్యక్తి… ఎదురుగా మాత్రం రెండు నిమిషాలు కూడా సహజంగా మాట్లాడలేకపోతున్నాడు. మెలికలు తిరిగిపోతున్నాడు. మెసేజ్‌ల్లో కనిపించిన ఆత్మవిశ్వాసం లేదు. చాటింగ్‌లో కనిపించిన జోక్స్, ఫన్ అసలే లేదు. ఇదేంటిది నేను పొరబడ్డానా…అసలు నేను “ఇన్ని రోజులు నాతో మాట్లాడింది నిజంగా ఇతనేనా… ?” అని. అప్పుడు ఆమె బుర్రకి తట్టింది. ఓ సారి తనతో చేసిన ఛాటింగ్ అంతా చూస్తే అతను AI సాయింతో అంత అద్బుతంగా మాట్లాడాడు అని అర్దమైపోయింది.
ఇది సినిమా కథ కాదు… పచ్చి నిజం! అమెరికాలోని వర్జీనియాకు చెందిన బ్రీయానా డాబ్సన్ అనే యువతికి డేటింగ్ యాప్‌లో సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒక వ్యక్తి పంపిన ఓవర్-పర్ఫెక్ట్ మెసేజ్‌లపై అనుమానం వచ్చి, “నువ్వు ChatGPT వాడుతున్నావా?” అని అడిగితే… అతడు “ChatGPT కాదు, నేను Claude వాడతాను” అని తేల్చేశాడు.
ఈ ఒక్క సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా “చాట్ఫిషింగ్” (Chatfishing) అనే కొత్త డిజిటల్ ప్రమాదం చర్చల్లోకి వచ్చింది.
ఫేక్ ఫోటోలు కాదు… ఇప్పుడు ఫేక్ వ్యక్తిత్వాలు!
ఇంతకాలం ఆన్లైన్ మోసమంటే ఎవరిదో ఫోటో పెట్టుకుని మరెవరో మాట్లాడటం (Catfishing) అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సరికొత్త మోసం మొదలైంది.
ఇందులో ఫోటో నిజమే, పేరు నిజమే, ఎదురుగా వచ్చి కలిసే వ్యక్తి కూడా నిజమే! కానీ… మీతో ప్రేమగా మాట్లాడిన ‘వ్యక్తిత్వం’ మాత్రం నూటికి నూరుపాళ్లు ఫేక్! ఎందుకంటే ఆ మాటలు అతని మనసులోంచి కాకుండా, ఒక AI చాట్‌బాట్ నుంచి వస్తున్నాయి.
ఇంతకాలం ఫేక్ ఫోటోలు భయపెడితే… ఇప్పుడు ఫేక్ వ్యక్తిత్వాలు భయపెడుతున్నాయి!
ప్రేమను కాదు… వ్యక్తిత్వాన్నే అద్దెకు ఇస్తున్న AI
ఒకప్పుడు ప్రేమలో పడాలంటే మనిషి తన సొంత ఆలోచనలు చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక స్క్రీన్‌షాట్ తీసి ChatGPT లేదా Claudeలో పేస్ట్ చేస్తే చాలు. “ఆమెకు ఎలా రిప్లై ఇవ్వాలి?”, “ఇంప్రెస్ చేయడానికి ఏం చెప్పాలి?”, “ఈ గొడవను ఎలా సర్దేయాలి?” – అన్నింటికీ AI క్షణాల్లో సమాధానాలు ఇచ్చేస్తోంది.
AI ఇప్పుడు మీ ప్రేమను గెలిపించడం లేదు… మీ వ్యక్తిత్వాన్నే అద్దెకు ఇస్తోంది!
ప్రేమలో మనం ఒక మనిషిని కాదు, ఆ వ్యక్తిలోని ఆలోచనలను, హాస్యాన్ని, భావోద్వేగాలను చూసి ప్రేమలో పడతాం. కానీ ఆ మాటలన్నీ AI రాసి ఇస్తే… మీరు ప్రేమించింది ఆ వ్యక్తినా? లేక అతని ఫోన్లో ఉన్న అల్గారిథమ్నా?
తెలుగు రాష్ట్రాలకు కూడా వస్తున్న ముప్పు!
“ఇదంతా అమెరికా కథేలే…” అని అనుకుంటే పొరపాటే! మన దగ్గర కూడా ఇప్పటికే చాలామంది యువకులు ప్రొఫైల్స్ బిల్డ్ చేయడానికి, చాటింగ్లకు AI సాయం తీసుకుంటున్నారు.
రేపు WhatsAppలోనో, Instagramలోనో, లేదంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పరిచయమైన వ్యక్తి కూడా ఇలాగే AI సాయంతో మాట్లాడితే? పెళ్లికి ముందు చాటింగ్‌లో ఎంతో మెచ్యూర్డ్‌గా కనిపించిన వ్యక్తి… పెళ్లయ్యాక అసలు మాట్లాడటమే రాక పూర్తిగా వేరేలా ఉంటే? దెబ్బతినేది ఒక చాట్ కాదు… ఒక నిండు జీవితం!
ప్రేమను హ్యాక్ చేస్తున్న AI… తెలుసుకోవాల్సిన 5 ప్రమాదాలు:
నచ్చేది మనిషి కాదు… AI తయారు చేసిన భ్రమ: మీరు ప్రేమిస్తున్నది నిజమైన మనిషిని కాదు, AI పాలిష్ చేసిన కమ్యూనికేషన్‌ను మాత్రమే!
సైకలాజికల్ ట్రాప్: AI మీ సైకాలజీని బట్టి మీకు ఏ మాటలు వింటే నచ్చుతుందో సరిగ్గా అదే రాసిస్తుంది. దీంతో చాలా వేగంగా ఆ వ్యక్తి బుట్టలో పడిపోతారు.
ప్రైవేట్ చాట్స్ రోడ్డున పడే ప్రమాదం: మీ వ్యక్తిగత చాట్లను, గొడవలను తీసుకెళ్లి థర్డ్-పార్టీ AI యాప్స్‌లో పేస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రైవసీకి తీవ్ర ముప్పు ఉంది.
రియల్ లైఫ్ షాక్: చాట్‌లో పంచ్‌లు వేసిన వ్యక్తి… ఎదురుగా కలిసినప్పుడు కనీసం ఐ-కాంటాక్ట్ కూడా ఇవ్వలేక తెల్లమొహం వేస్తాడు.
మనుషులపై నమ్మకమే పోతుంది: ఇకపై “ఇతను మంచివాడా కాదా?” అనే డౌట్‌తో పాటు… “అసలు ఈ మెసేజ్ నిజంగా ఇతనే రాశాడా?” అనే అనుమానంతో బతకాల్సి వస్తుంది.
AIని వాడటం తప్పా?
గ్రామర్ సరిచేసుకోవడానికో, పంపే మెసేజ్ కాస్త స్పష్టంగా ఉండటానికో AI సాయం తీసుకోవడం తప్పు కాదు. కానీ మీ భావోద్వేగాలను, మీ పర్సనాలిటీనే AI చేత రాయించడం మొదలైతేనే అసలు ప్రమాదం! రిలేషన్స్‌లో నిజాయితీ తగ్గి, డ్రామా ఎక్కువైతే అదే ‘చాట్ఫిషింగ్’.
చివరగా…
కొన్ని నెలల తర్వాత, ఆ అమ్మాయి మళ్లీ ఒక డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్ ఓపెన్ చేసింది. కొత్తగా ఒక మెసేజ్ వచ్చింది. ఫోన్ తీసి మెసేజ్ చదివాక కొద్దిసేపు స్క్రీన్‌నే చూస్తూ ఉండిపోయింది.
ఈసారి రిప్లై ఇవ్వడానికి తొందరపడలేదు. ఒక్క క్షణం ఆగి, తనలో తానే నవ్వుకుంటూ అనుకుంది…
“ఈ మాటలు… నిజంగా అతని మనసులోంచి వచ్చాయా?”
బహుశా ఇకపై ప్రేమలో పడగానే అడిగే మొదటి ప్రశ్న “నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా?” అని కాదేమో… “ఈ మెసేజ్ నిజంగా నువ్వే టైప్ చేశావా?” అనేదే అవుతుందేమో!
ఎందుకంటే AI ఎంత తెలివిగా మాట్లాడటం నేర్చుకున్నా… ఒక మనిషిలా నిజంగా ప్రేమించడం మాత్రం దానికి ఎప్పటికీ రాదు!








