రియల్ ఎస్టేట్‌లో అత్యంత ఖరీదైన తప్పు ఇదే… మీరు చేస్తున్నారా?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
“ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు మనం రోజులు… నెలలు… కొన్నిసార్లు సంవత్సరాలు కూడా టైమ్ తీసుకుంటాం. ఎందుకంటే మనందరికీ లోపల తప్పు నిర్ణయం తీసుకుంటామేమోనన్న భయం ఉంటుంది.ఆ భయం కొంతవరకూ మనని కాపాడుతుందేమో కానీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నిర్ణయం ఆలస్యం చేయడమే అత్యంత ఖరీదైన తప్పుగా మారుతుంది.
ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో ఆ ఖరీదు…కొన్నిసార్లు లక్షలు కాదు కోట్లలో కూడా ఉండవచ్చు. అయ్యో…అప్పుడు కొనాల్సింది అనే ఒక్క వాక్యం తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే తరచూ వినిపించే ఒక మాట.
కోకాపేట్లో చూసిన ప్లాట్… నర్సింగిలో నచ్చిన వెంచర్…కొల్లూరులో కనిపించిన గేటెడ్ కమ్యూనిటీ… శంషాబాద్ వైపు ఉన్న భూమి… ప్రతి చోటా ఒకే కథ. “కొంచెం వెయిట్ చేద్దాం…”, “ధర తగ్గితే కొనుక్కుందాం…” , “ఇంకో ప్రాజెక్ట్ కూడా చూద్దాం…” అని నిర్ణయాన్ని వాయిదా వేసిన వాళ్లు… కొన్నేళ్ల తర్వాత అదే ప్రదేశాన్ని చూసి ఇప్పటికీ పశ్చాత్తాపపడుతుంటారు. ఎందుకంటే మార్కెట్ ఎవరి కోసం ఆగదు.
రియల్ ఎస్టేట్‌లో అతిపెద్ద విలన్ ఎవరు?
చాలామంది అనుకునేది రియల్ ఎస్టేట్ లో జరిగే మోసాలు. అలాగే నకిలీ డాక్యుమెంట్లు. మోసం చేసే ప్రాజెక్టులు ఇవన్నీ మనకు ఈ ఫీల్డ్ లో అతి పెద్ద విలన్స్ గా కనిపిస్తాయి. కానీ అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లు చెప్పే మరో నిజం ఉంది. రియల్ ఎస్టేట్‌లో చాలామందిని దెబ్బతీసేది మార్కెట్ కాదు… వారి సొంత సందేహాలే. దీనినే సైకాలజీలో Analysis Paralysis అంటారు.
అంటే… అతిగా విశ్లేషించడం. ప్రతి అంశాన్ని పదే పదే పరిశీలించడం. ప్రతి ఒక్కరిని అభిప్రాయం అడగడం. చివరకు ఏ నిర్ణయమూ తీసుకోకపోవడం. మీరు కూడా ఈ ఉచ్చులో చిక్కుకున్నారా? . ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి.
రోజూ యూట్యూబ్‌లో రియల్ ఎస్టేట్ వీడియోలు చూస్తున్నారా?. ప్రతి వారం కొత్త ప్రాజెక్ట్‌కి వెళ్తున్నారా…నలుగురైదుగురు బ్రోకర్లతో మాట్లాడుతున్నారా?, పది మంది ఫ్రెండ్స్ సలహాలు తీసుకుంటున్నారా? “ధరలు తగ్గొచ్చు” అని ఎదురు చూస్తున్నారా? “ఇంకో నెల తర్వాత చూద్దాం” అని వాయిదా వేస్తున్నారా?
ఇవన్నీ చేస్తూ…చివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోతే…అది సమాచారం ఎక్కువ కావడం వల్ల కాదు.నిర్ణయం తీసుకునే ధైర్యం తగ్గిపోవడం వల్ల.
హైదరాబాద్ ఎందుకు ఇంకా హాట్ ప్రాపర్టీగానే ఉందా?
గత పదేళ్లలో హైదరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఐటీ ఉద్యోగాలు, ఫార్మా పరిశ్రమ, డేటా సెంటర్లు, మెట్రో విస్తరణ, ORR, ప్రతిపాదిత RRR, కొత్త కనెక్టివిటీ ప్రాజెక్టులు నగర విస్తరణకు ఊతమిచ్చాయి. దీని ప్రభావం రియల్ ఎస్టేట్‌పైనా కనిపించింది. కోకాపేట్, నర్సింగి, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్చెరు, ఆదిబట్ల వంటి ప్రాంతాల్లో గత కొన్నేళ్లలో ధరలు గణనీయంగా పెరిగాయి.
అదే సమయంలో… ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు తక్కువ ధరల పరిధిలో దొరికే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే చాలామంది దీనిని “అవకాశం ఇంకా పూర్తిగా ముగిసిపోని మార్కెట్” గా చూస్తున్నారు.
అయితే వెంటనే కొనేయాలా?
అసలు కాదు. రియల్ ఎస్టేట్‌లో తొందరపాటు కూడా ప్రమాదమే. కానీ… కంటిన్యూగా ఆగకుండా వచ్చే అంతులేని సందేహాలు కూడా అంతే ప్రమాదం. ఈ రెండింటి మధ్య సమతుల్యం అవసరం.
మూడు నుంచి ఆరు నెలలు… అంతే
ఎక్కడైనా సరే మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే… ముందుగా మీ బడ్జెట్ నిర్ణయించుకోండి. మీకు కావాల్సిన లొకేషన్ నిర్ణయించుకోండి. లీగల్ డాక్యుమెంట్లు పరిశీలించండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. ఆ తర్వాత… మూడు నుంచి ఆరు నెలల్లో ఒక నిర్ణయం తీసుకునే లక్ష్యం పెట్టుకోండి. ఎందుకంటే…ఏళ్ల తరబడి వెతికినా… 100 శాతం పర్ఫెక్ట్ ప్రాపర్టీ దొరకదు. కానీ మంచి అవకాశాలు మాత్రం మీ కోసం ఆగవు.
అందుకే రాజా…
బిట్‌కాయిన్ కొనకపోతే…అది ఒక మిస్ అయిన పెట్టుబడిగా మిగిలిపోతుంది.
షేర్లు కొనకపోతే…అది ఒక కోల్పోయిన అవకాశంగా గుర్తుంటుంది.
కానీ…రియల్ ఎస్టేట్‌లో కొనకుండా వదిలేసిన ప్లాట్ మాత్రం…ప్రతి సారి ఆ రోడ్డుమీద వెళ్లినప్పుడల్లా కళ్ల ముందు కనిపిస్తూ ఉంటుంది.
అందుకే రియల్ ఎస్టేట్‌లో పశ్చాత్తాపం… కేవలం లెక్కల్లో కాదు, జ్ఞాపకాలలో కూడా జీవిస్తుంది.








