నవ్వించిందా?: “ధమాల్ 4” రివ్యూ
—సూర్య ప్రకాష్ జోశ్యుల
వందేళ్ల క్రితం సైతాన్ సింగ్ అనే ఓ సముద్రపు దొంగ (పైరేట్) ఉండేవాడు. వాడు దోచటం, దాచటం తప్పించి అనుభవించింది లేదు. లైఫ్ చివర్లో ఆ సంపదంతా ఓ నిధిగా మార్చి ఓ రహస్య ద్వీపంలో దాచిపెడతాడు.ఎవరు తీసుకుంటారని వాడు దాటి పెట్టాడో కానీ అది అలా చాలా కాలం అనామకంగా అలాగే ఉండిపోయింది. ఇదిగో ఇంతకాలానికి ఆ నిధి కోసం జనాలు బయిలుదేరారు.
అయితే నిధి దక్కాలంటే అది ఫలానా చోట ఉందంటే చాలదు కదా..దాన్ని తీసుకుని వచ్చే మ్యాప్, ఆ మ్యాప్ ని డీకోడ్ చేసే బ్యాచ్ ఉండాలి కదా. అలాగే ఈ కాలంలో ఆ నిధి ఎక్కడుందో తెలిపే దారి మాత్రం పృథ్వీ దేశ్‌పాండే (ఉపేంద్ర లిమాయే)కి మాత్రమే తెలుసు. వాడే డీకోడర్ కూడా. అయితే నిథి రహస్యం ఒక్కడితే తెలిస్తే కథేముంటుంది..కిక్కేముంటుంది?
కాబట్టి ఈ నిథి గురించి అధూరా (రవి కిషన్) అనే పైరేట్ లీడర్ తెలుసుకుంటాడు. వాడు దాన్ని సొంతం చేసుకుందామనే ఆశతో బయిలుదేరతాడు. అందుకోసం పృథ్వీ దగ్గర ఉన్న మ్యాప్‌ను దొంగిలిస్తాడు. అయితే అది అతని చేతిలో నుంచి పోతుంది. అప్పుడు నిధికి వెళ్లే మార్గం మొత్తం గుర్తున్న పృథ్వీనే కీలకంగా మారిపోతాడు. అంటే ఓరకంగా ఇప్పుడు పృథ్వి అనేవాడు నడిచే గూగల్ మ్యాప్ అన్నమాట. అక్కడితో ఈ ట్రెజర్ హంట్ ప్రారంభం కాదు…
ఈ నిథి గురించి గుడ్డూ (అజయ్ దేవగన్), తన స్నేహితుడు జానీ (సంజయ్ మిశ్రా)కి లీక్ అవ్వటంతో వాళ్లూ బయిలుదేరతారు. వీళ్లతో పాటు ఫ్యామిలీ ప్యాక్ అతని గర్ల్‌ఫ్రెండ్ ఆలియా (ఈషా గుప్తా), ఆమె ఇద్దరు పిల్లలు కూడా ప్రయాణంలో చేరతారు.
వీళ్లు చాలదన్నట్లు ఆది (అర్షద్ వార్సి), అతని సోదరుడు మానవ్ (జావేద్ జాఫేరి), ఆది భార్య రోజీ (సంజీద షేక్)లకు కూడా ఆ నిధి తెలుస్తుంది. వాళ్లు రెడీ. మరోవైపు, కోటీశ్వరుడు కూతురని పొరపాటున నమ్మి పారో (అంజలి ఆనంద్)ను పెళ్లి చేసుకున్న లల్లన్ (రితేష్ దేశ్‌ముఖ్) కూడా ఆ నిధిని దక్కించుకుని జీవితాన్ని మార్చుకోవాలనే ఆశతో ఈ ట్రెజర్ హంట్ లో చేరతాడు.
ఇలా ఆధార్ క్యూలా పెరిగిపోయిన వీళ్లందరినీ పైరేట్ లీడర్ అధూరా తల పట్టుకుంటాడు. అయినా తప్పదుకదా. తన అనుచరుడు జీంగా (విజయ్ పాట్కర్)తో కలిసి ఎలాగైనా ఆ నిధిని ముందుగా సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. పరుగు ప్రారంభిస్తాడు. కానీ వీడొక్కడికే పరుగు రాదు కదా..మిగతావాళ్లు ఆ రేస్ ని ముందుకు తీసుకెళ్ితారు.
ఇలా అందరూ ఒకే లక్ష్యంతో ప్రమాదకరమైన ప్రయాణం ప్రారంభిస్తారు. ఒకరిని మించి మరొకరు ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తూ, రహస్య ద్వీపంలోని ‘M’ ఆకారంలో ఉన్న కొండలను చేరుకోవడానికి పోటీ పడతారు. ఈ ప్రయాణంలో అపార్థాలు, మోసాలు, చేజింగ్‌లు, గందరగోళ పరిస్థితులు వరుసగా చోటుచేసుకుంటాయి.
చివరికి సైతాన్ సింగ్ దాచిన ఆ గుప్త నిధి ఎవరికి దక్కింది? అంతటి ప్రమాదకరమైన ప్రయాణం తర్వాత వారంతా సురక్షితంగా బయటపడ్డారా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
కథ చాలా సింపుల్. “ఒక నిధి… దాన్ని వెంబడించే చాలా మంది.” ఇది కొత్త ఐడియా కాదు. ‘ధమాల్’, ‘రేస్ టు విచ్ మౌంటెన్’, ‘ఇట్స్ ఏ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్’ తరహా ట్రెజర్ హంట్ ఫార్ములానే. ఈ కథలో హీరో లక్ష్యం, విలన్ లక్ష్యం, మిగతా పాత్రల లక్ష్యం మూడూ ఒకటే. Treasure. అంటే ఇక్కడ కథలో ట్విస్టులు కాదు… ప్రయాణమే కథ.కానీ ఆ ప్రయాణమే సరిగ్గా సాగలేదు.అలసట తెప్పించింది.
ఇలాంటి కామెడీ లకు వచ్చేటప్పుడు ప్రేక్షకుడు తన బుర్రని మాగ్జిమం ఇంట్లోనే పెట్టేసి వస్తాడు. లాజిక్ ని థియేటర్ బయిటే వదిలేస్తాడు. కేవలం మమ్మల్ని నవ్వచండి అని రిక్వెస్ట్ చేస్తూ లోపలకి అడుగుపెడతాడు. అందుకే కామెడీ స్క్రీన్‌ప్లేలో “ఏం జరిగింది?” కంటే “ఎలా చూపించారు?” అనేదే కీలకం. ‘ధమాల్ 4’ కూడా అదే దారిలో నడిచింది. కానీ ఆ ప్రయాణంలో కొన్ని చోట్ల గేర్ మారలేదు. దాంతో మొదట బాగానే ఉంది, నవ్విస్తోంది అని భరోసా ఇచ్చింది కానీ రాను రాను ఆ నమ్మకం సడిలిపోయింది. నవ్వులు తగ్గిపోయి, బోర్ పెరిగిపోయింది. Comedy Escalation అంటే ప్రతి కామెడీ, ముందు కామెడీ కంటే పెద్దది అవ్వలేదు. ప్లాట్ గా నడిచిపోయింది.
మంచి కామెడీలో పాత్రలు వల్ల Situation మారాలి. ఇక్కడ Situation వల్ల Character పరిగెత్తాడు. ఇది పెద్ద తేడా. ఉదాహరణ లల్లన్ చాలా అత్యాశపరుడు. ఆ అత్యాశ ప్రతి Sceneలో కొత్త సమస్య సృష్టించాలి. కానీ ఇక్కడ అందరూ ఒకేలా పరిగెత్తారు.చాలామంది ఒకే రకం Slapstick చేస్తున్నారు. అందుకే Characters కలిసిపోయాయి.కలగాపులగం అయ్యిపోయాయి.
సినిమా మొదలయ్యాక అందరూ నిధి కోసం పరిగెత్తడం మొదలుపెడతారు.అదే సమయంలో ప్రేక్షకుడు మాత్రం ‘ఈ నవ్వు ఎక్కడ దాగి ఉంది?’ అని సీరియస్ గా సినిమాలో వెతకడం మొదలుపెడతాడు. ఇంతకు మించిన ట్రెజర్ హంట్ ఇంకేముంటుంది?. నిజానికి ఈ సినిమాలో వచ్చే గందరగోళం ప్లాన్ చేసినది కాదు… అదే కథ.
సినిమాలో ప్రతి పాత్రకు ఒకటే ఆలోచన—ఎప్పుడు నిధి దొరుకుతుంది అని. చూసే ప్రేక్షకుడి ఆలోచన మాత్రం చాలా సింపుల్… “ఇంకెంత సేపట్లో క్లైమాక్స్ వస్తుంది?” అని. అలాగే వందేళ్లు గడిచిపోయినా కథలో నిధి ఎలాగైతే అక్కడే ఉండిపోతుందో.. కథ చెప్పే విధానం కూడా అక్కడే ఆ కాలం లోనే ఆగిపోయి ఉంటుంది.
చూడచ్చా
ఫస్టాఫ్ లో కాసేపు నవ్వుకుంటే సరిపోతుంది అనుకుంటే ఈ సినిమాని నిరభ్యంతరంగా చూడవచ్చు.
ఫైనల్ థాట్
‘ధమాల్ 4’లో చివరికి నిధి ఎవరికొచ్చిందో క్లైమాక్స్ చెబుతుంది. కానీ సినిమాలో సరైన కామెడీ ఎక్కడ దాక్కుందో మాత్రం మొత్తం వెతికినా చూసేవాడికి దొరకదు. కాబట్టి ఈ కామెడీ హంట్ కు క్లైమాక్స్ లేదు.








