కశ్మీర్ స్మశానాల్లో ఉగ్రవాదుల మృతదేహాలు.. హిజ్బుల్ కమాండర్ సంచలన నిజాలు..!
కశ్మీర్ లో సీమాంతర ఉగ్రవాదులను పంపిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందన్న ఆరోపణలు మరోసారి నిజమయ్యాయి. పాక్ సాయంతోనే కశ్మీరంలో ఉగ్రభూతం రెక్కలు చాస్తోందని సాక్షాత్తూ హిజ్బుల్ కమాండర్ షంషేర్ ఖాన్ అంగీకరించారు. ఇటీవలే ఓ సభలో మాట్లాడిన షంషేర్ ఖాన్.. కశ్మీర్ లోయలోని శ్మశానవాటికలన్నీ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల శవాలతోనే నిండిపోయాయని బహిరంగంగా అంగీకరించాడు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ముజఫరాబాద్‌లో జులై 8న ఈ ఘటన చోటుచేసుకుంది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో షంషేర్ ఖాన్ మాట్లాడుతూ “లోలాబ్, కుప్వారా నుండి కథువా వరకు కశ్మీర్లో పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకుల (ఉగ్రవాదుల) సమాధులు లేని శ్మశానవాటిక ఏదీ లేదు” అని స్పష్టంగా పేర్కొన్నాడు. కశ్మీర్ కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పాక్ ఉగ్రవాదులను ‘రక్తసాక్షులు’గా కీర్తించాడు. వారి త్యాగాల వల్లే పాకిస్తాన్-కశ్మీర్ బంధం బలంగా ఉందని, దీన్ని ఎవరూ విడదీయలేరని వ్యాఖ్యానించాడు.
ఇదే సభలో ఆయన, పీవోకేలో ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జేఏఏసీ)పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ సంస్థ సభ్యులంతా దేశద్రోహులని, వారు భారతదేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించాడు. కశ్మీర్ ఐక్యత, పాకిస్తాన్ సిద్ధాంతాలపై రాజీ పడే ప్రసక్తే లేదని హెచ్చరించాడు.
ఈ వీడియో వెలుగులోకి రావడంతో, సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనడానికి బలమైన సాక్ష్యం లభించినట్టయిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న వాదనలకు ఈ వీడియో బలం చేకూరుస్తోందని, అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ను ఇది తీవ్రంగా ఇరుకునపెట్టే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.








