ఆపరేషన్: సీక్రెట్ చిప్..! అమెరికా ప్లాన్‌కు చైనా మాస్టర్ స్ట్రోక్?
–సూర్య ప్రకాష్ జోశ్యుల
“ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధాలకు శబ్దం ఉండదు…”
బాంబులు పేలవు.
క్షిపణులు ఎగరవు.
సైన్యాలు సరిహద్దులు దాటవు.
టీవీ ఛానళ్లలో ‘బ్రేకింగ్ న్యూస్’ కూడా రాదు.
అయినా… కొన్ని యుద్ధాలు ప్రపంచ పటాన్ని మార్చేస్తాయి. ఇది అలాంటి యుద్ధం.
మొదటి కదలిక… అమెరికా
ఒక చిన్న చిప్. దాని పరిమాణం వేళ్ల గోరు కంటే చిన్నది. కానీ అదే…AIని నడిపిస్తుంది. సూపర్ కంప్యూటర్లను నడిపిస్తుంది. మిలిటరీ వ్యవస్థలను నడిపిస్తుంది. భవిష్యత్తును నడిపిస్తుంది. అమెరికాకు ఇది చాలా ముందే అర్థమైంది. అందుకే ఒక నిర్ణయం తీసుకుంది.
“చైనా ఈ స్థాయికి రావద్దు.”
కొత్త చిప్ తయారీ యంత్రాలు? చెయ్యినివ్వకూడదు.
అత్యాధునిక టెక్నాలజీ? అందనివ్వకూడదు.
కీలక సాఫ్ట్వేర్? అందకూడదు.
అలా ప్రపంచంలో ఉన్న ప్రతి తలుపునూ ఒక్కొక్కటిగా మూసేయడం మొదలైంది.
అమెరికా లెక్క చాలా సింపుల్. చిప్‌లు లేకపోతే AI ఉండదు. AI లేకపోతే చైనా భవిష్యత్తు కూడా ఉండదు.
కాగితంపై ఈ ప్లాన్ దాదాపు పరిపూర్ణంగా కనిపించింది. కానీ… ఒక విషయం వాళ్లు మర్చిపోయారు. ప్రతి తలుపు మూసేస్తే… కొందరు కొత్త తలుపు నిర్మిస్తారు. అదే జరిగింది.
కొన్ని సంవత్సరాల తర్వాత…
మార్కెట్లో ఒక విచిత్రమైన విషయం కనిపించింది. చైనాలోని ఒక కంపెనీ… నిశ్శబ్దంగా…చాలా వేగంగా…
ఎదుగుతోంది. ఆదాయం ఏడు రెట్లు పెరిగింది. ఉత్పత్తి పెరిగింది. ఉద్యోగులు వేలల్లో పెరిగారు. చూస్తూండగానే ప్రపంచ దిగ్గజాల మధ్యకి వచ్చేసింది. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే… వాళ్ల దగ్గర కొత్త యంత్రాలు లేవు. ఆంక్షలు ఇంకా అమల్లోనే ఉన్నాయి. అయితే ఈ ఎదుగుదల ఎలా? ఇదే ప్రశ్న ప్రపంచ విశ్లేషకులను వెంటాడింది. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రారంభించగానే…
ఈ కథ థ్రిల్లర్‌గా మారింది.
క్లూ నంబర్ – 1
IPO పత్రాల్లో కనిపించని పేర్లు. సాధారణంగా కంపెనీలు IPOకి వెళ్తే… తమ బలాన్ని చూపిస్తాయి. CXMT మాత్రం… కొన్ని విషయాలను చూపించలేదు. రిపోర్ట్స్ ప్రకారం… కొన్ని అనుబంధ సంస్థల వివరాలు పూర్తిగా వెల్లడించకుండా సంక్షిప్త గుర్తులతో మాత్రమే నమోదు చేశారని టెక్ వర్గాలు గమనించాయి.మొదట అది పెద్ద విషయంగా అనిపించలేదు. కానీ… అక్కడి నుంచే మొదలైంది అసలు దర్యాప్తు. కొద్ది రోజుల తర్వాత మూడు పేర్లు వినిపించాయి.
Jixin Tuofang.
TSFC Semiconductors.
Xyxtech.
వీటిలో ఒకటి డిజైన్.
మరొకటి తయారీ.
ఇంకొకటి టెస్టింగ్.
అంటే…ఒక కంపెనీలా కనిపిస్తున్న వ్యవస్థ…నిజానికి అనేక పొరలతో నిర్మించబడిందా? ఈ ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరక లేదు. కానీ ప్రపంచం దానిని గమనించడం మాత్రం మొదలుపెట్టింది.
క్లూ నంబర్ – 2
కొత్త యంత్రాలు లేవు… అయినా ఫ్యాక్టరీలు ఆగలేదు. ఇదే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం.
అసలు అమెరికా ఎందుకు యంత్రాలను ఆపింది?
ఎందుకంటే…అత్యాధునిక యంత్రాలు లేకపోతే…అత్యాధునిక చిప్‌లు తయారు చేయడం చాలా కష్టం. కానీ.. అసాధ్యం కాదు.నివేదికల ప్రకారం… CXMT పాత తరానికి చెందిన ASML యంత్రాలను ఉపయోగిస్తూ, తయారీ ప్రక్రియలో కొత్త మార్గాలను అన్వేషించింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.వాళ్లు రూల్స్ ని బ్రేక్ చేసారని కాదు. రూల్స్ మధ్య ఉన్న ఖాళీలను వెతికారని పరిశ్రమలో చర్చ జరిగింది. అదే తేడా.
క్లూ నంబర్ – 3
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన మెదళ్లు
ఫ్యాక్టరీలు డబ్బుతో కడతారు. పరిశ్రమలు… మనుషులతో నిర్మిస్తారు. చైనాకు అది తెలుసు.అందుకే మరో వేట మొదలైంది. అమెరికా. తైవాన్. జపాన్. సింగపూర్. చిప్ పరిశ్రమలో అనుభవం ఉన్న ఇంజినీర్లకు భారీ వేతనాల ఆఫర్లు వెళ్లాయి. ఒకరొచ్చాడు. మరొకరొచ్చాడు. నెమ్మదిగా… ఎక్సపీరియన్స్ కూడా చైనాలోకి చేరడం ప్రారంభమైంది. చిప్‌లు తయారు చేసే ముందు…చిప్‌లు తయారు చేయగలిగే మెదళ్లను సేకరించారు.
క్లూ నంబర్ – 4
ఈ కథ… ఇరవై ఏళ్ల క్రితమే మొదలైంది. ప్రతి పెద్ద సామ్రాజ్యం ముందు…ఒక చిన్న ఆలోచన ఉంటుంది. CXMT వెనుక ఉన్న ఆ ఆలోచన పేరు జు యిమింగ్. చాలామందికి చైనా మెమరీ చిప్‌ల గురించి మాట్లాడటమే అతిశయోక్తిలా అనిపించిన కాలం. కానీ ఆయన మాత్రం… ఈ పరిశ్రమ ఒక రోజు చైనాకు వస్తుందని నమ్మారు.
గ్యారేజ్ నుండి గ్లోబల్ ఎంపైర్
ప్రతి ఇంపాజిబుల్ సక్సెస్ వెనుక ఒక పట్టుదల గల వ్యక్తి ఉంటాడు. CXMT వెనుక ఉన్న ఆ మైండ్… జు యిమింగ్ (Zhu Yiming). 2004లోనే ఆయన చైనాలోని ఒక ఇన్వెస్టర్‌కు ఈమెయిల్ రాస్తూ.. “చిప్ మార్కెట్ అమెరికా, జపాన్ నుండి చైనాకు మారే రోజు వస్తుంది, నేనే చైనాలోనే అతిపెద్ద మెమరీ మేకర్ని అవుతా” అని రాశారు.
కానీ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఒక చిన్న గ్యారేజ్‌లో ఆయన మొదలుపెట్టిన స్టార్టప్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. ఆ సమయంలో చైనాకు తిరిగి వచ్చేస్తేనే పెట్టుబడి పెడతామని ఒక ఇంక్యుబేటర్ కండిషన్ పెట్టడంతో.. కేవలం 1 మిలియన్ డాలర్లతో చైనాకు తిరిగొచ్చారు. ఆ పట్టుదలే నేడు 19,000 మంది ఉద్యోగులు, రూ. 36,000 కోట్ల ఐపీఓ (IPO), మొదటి ఆరు నెలల్లోనే 7 రెట్ల వృద్ధి సాధించే స్థాయికి ఆయన్ని చేర్చింది. మీడియాకు పూర్తి దూరంగా ఉండే ఈ రహస్య ఎగ్జిక్యూటివ్, ఇప్పుడు ప్రపంచ టెక్ దిగ్గజాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
సిలికాన్ వ్యాలీలో చిన్న ప్రారంభం. ఆర్థిక ఇబ్బందులు. చైనాకు తిరిగి రావడం. కొద్దిపాటి పెట్టుబడితో మళ్లీ మొదలుపెట్టడం. ఈరోజు… 19 వేలకుపైగా ఉద్యోగులు. బిలియన్ల డాలర్ల IPO. ప్రపంచ మార్కెట్లో నాలుగో స్థానం.
కొన్ని విజయాలు… ఒక్క నిర్ణయంతో రావు. ఇరవై ఏళ్ల ఓర్పుతో వస్తాయి. అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతోంది…
ఈ కథలో హీరో ఎవరు?
చైనా?
అమెరికా?
CXMT?
కాదు.
హీరో…
సమయం.
ఎందుకంటే టెక్నాలజీ యుద్ధాల్లో గెలిచేది వేగంగా పరిగెత్తినవాడు కాదు. ఇరవై సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ముందే ఊహించినవాడు. అందుకే ఈ కథ ఒక కంపెనీ గురించికాదు. ఒక దేశం గురించికాదు. భవిష్యత్తును ముందుగానే నిర్మించాలనుకున్న వారి గురించి.
చివరి సీన్…
అమెరికా తలుపులు మూసేసింది. చైనా కిటికీలు వెతికింది.
కిటికీలు మూసేసినప్పుడు… గోడలో దారి వెతికింది.
ప్రపంచం ఆంక్షలను చూస్తోంది. చైనా మాత్రం…ఆ ఆంక్షల మధ్య ఉన్న ఖాళీలను చూస్తోంది.
కొన్నేళ్ల తర్వాత ప్రపంచం వెనక్కి తిరిగి చూసినప్పుడు… ఒక ప్రశ్న అడగొచ్చు.
అమెరికా చైనాను ఆపడానికి ఒక యుద్ధాన్ని ప్రారంభించిందా? లేక… ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థిని తయారు చేసిందా?
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా సమయం ఉంది.
ఎందుకంటే…
ఈ కథలో క్లైమాక్స్ ఇంకా రాలేదు.
CXMT అనేది ఒక కంపెనీ మాత్రమే కావచ్చు. కానీ అది సూచిస్తున్న మార్పు… చాలా పెద్దది.
ఒకప్పుడు ప్రపంచాన్ని మార్చింది చమురు.
ఈరోజు…ఒక చిన్న మెమరీ చిప్ అదే పని చేస్తోంది.
రేపు ప్రపంచాన్ని నడిపేది ఎవరు?
ఎక్కువ AI మోడళ్లను తయారు చేసిన దేశమా?
లేక… ఆ AIకి గుండె లాంటి చిప్‌లను తయారు చేయగలిగిన దేశమా?
ప్రపంచం ఇప్పటికీ AI గురించి మాట్లాడుతోంది.
కానీ…అసలు యుద్ధం AI మీద కాదు. దానికి ప్రాణం పోసే చిప్‌ల మీద.
అక్కడే…
ఈ కథ మొదలవుతోంది.








