Lenin Review: అఖిల్ అక్కినేని వన్ మాన్ షో ‘లెనిన్’
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థలు : మనం ఎంటర్ప్రైజెస్ LLP, సితార ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు : అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, రమేష్ ఇందిరా, సునీల్, శివాజీ, బ్రహ్మాజీ, ప్రమోద్,
ఈశ్వరీ రావు, రంగస్థలం మహేష్, శరణ్య ప్రదీప్ తదితరులు నటించారు.
సంగీతం : థమన్ ఎస్, ఎడిటర్ :నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ :లియోన్ బ్రిట్టో, ప్రొడక్షన్ డిజైనర్ :అవినాష్ కొల్లా
స్టంట్స్: దిలీప్ సుబ్భారాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :ఆనంద్ రెడ్డి కర్నాటి
సమర్పణ : అన్నపూర్ణ స్టూడియోస్
నిర్మాతలు : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
రచన & దర్శకత్వం : మురళి కిషోర్ అబ్బూరు
విడుదల తేది :10.07.2026
నిడివి : 2 ఘంటల 39 నిముషాలు
హీరోగా ఇప్పటివరకు మోడ్రన్ కథలతోనే సినిమాలు చేసి వరుస పరాజయాలు చవిచూస్తున్న అఖిల్ అక్కినేని,(Akkineni Akhil) ఫస్ట్ టైమ్ లెనిన్ (Lenin) కథతో రూరల్ జానర్‌ను టచ్ చేశాడు. మురళీ కిషోర్ అబ్బూరు(Murali Kishore Abburu) దర్శకత్వం లో భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) హీరోయిన్ గా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, (Akkineni Nagarjuna) సూర్యదేవర నాగ వంశీ(Suryadevara Naga Vamsi) నిర్మించిన చిత్రం ‘లెనిన్’.ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన లెనిన్ ఎలా ఉంది? ఈ సినిమాతో అఖిల్‌కు ఈ సారైనా హిట్టు దక్కిందా? లేదా సమీక్షలు చూద్దాం.
కథ :
కథా విషయానికొస్తే..సినిమా 50 ఏళ్ళ క్రితం మొదలై 2001 లోకి వచ్చి, మళ్ళీ వెనక్కు వెళ్ళి 1989 ఫ్లాష్ బ్యాక్ లో కథ నడుస్తుంది. శ్రీరామపురంలో భారతం మిట్ట జాతరను పద్దెనిమిది రోజుల పాటు జరుపుతుంటారు. వందో భారతం మిట్ట జాతర నిర్వహించే విషయంలో జయమ్మ (ఈశ్వరీ రావు) కుటుంబానిదే ఆధిపత్యం కొనసాగుతుంది. ఆ జాతర జరిగే ప్రాంతంలో ఒక్క రక్తపు బొట్టు నేల రాలకూడదన్నది ఆచారం. ఆ జాతరను చాలా ఏళ్లుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తుంటాడు లెనిన్ (అఖిల్ అక్కినేని). అనాథ అయిన లెనిన్‌ను ఊరి పెద్ద జయంతి సొంత కొడుకులా చేరదీస్తుంది. జయమ్మ, ఆమె కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు) లెనిన్‌ను కుటుంబ సభ్యుడిగా చేసుకొంటారు. వసంత్ అంటే లెనిన్‌కు ప్రాణస్నేహితుడిగా మారుతాడు. ఆ జాతరలోనే లెనిన్‌కు భారతితో (భాగ్యశ్రీ బోర్సే) ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని అనుకుంటారు. కానీ.. పెద్దలు మాత్రం జయంతి కొడుకు వసంత్‌తో (ప్రమోద్ పంజు) భారతి పెళ్లిని నిశ్చయిస్తారు. ఆ తర్వాత ఏమైంది? ఆప్తుడిగా నమ్మిన స్నేహితుడు వసంత్ ….లెనిన్‌కు ఎలాంటి ద్రోహం తలపెట్టాడు? జాతరలో ఎవరిని హత్య చేసి లెనిన్ జైలు పాలయ్యాడు? వసంత్ కుటుంబంపై యతిరాజు (శివాజీ) పగతో రగిలిపోవడానికి కారణమేమిటి? లెనిన్ కారణంగా ఎమ్మెల్యే రాఘవరెడ్డి, దామోదర కు(బ్రహ్మాజీ) ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి? లెనిన్‌ను ప్రాణంగా ప్రేమించిన భారతీ అతడికి ఎలా దూరమైంది? భారతం మిట్ట గ్రామంపై మహాభారతం ప్రభావం ఎలా ఉంటుంది? భారతీతో వసంత్ పెళ్లి జరిగిందా? లెనిన్‌కు జైలు శిక్ష ఎందుకు పడింది? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లెనిన్ ఎవరిపై పగ ప్రతీకారం తీర్చుకొన్నాడు? అన్నదే ఈ మూవీ కథ.
నటీనటుల హవబవాలు :
ఈ సినిమాను మొత్తం అఖిల్ తన భుజాలపై మోశాడు. గత సినిమాలతో పోలిస్తే అఖిల్ నటనలో మెచ్యూరిటీ కనిపించింది. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ మెరుగయ్యాయి. ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకున్నాడు. అఖిల్ సంభాషణలు చెప్పిన తీరు కొన్ని చోట్ల నాగార్జునను గుర్తుకుతెచ్చింది. నటుడిగా అఖిల్‌ను ఈ సినిమా మరో మెట్టు ఎక్కించింది. భాగ్యశ్రీ బోర్సే నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. డామినేషన్ నేచర్ కలిగిన అమ్మాయిగా ఆకట్టుకుంది. అఖిల్‌తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. మంచివాడిగా కనిపించే విలన్ పాత్రలో ప్రమోద్ పంజు చక్కటి వేరియేషన్స్ చూపించాడు. విలనిజం పండించే సీన్లలో అదరగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్‌లో శివాజీ చేసిన మంచి సినిమాల్లో లెనిన్ ఒకటిగా నిలుస్తుంది. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ క్యారెక్టర్లో అదరగొట్టాడు. హీరోకు ఎలివేషన్లు ఇవ్వడానికి సునీల్ పాత్రను డైరెక్టర్ వాడుకున్నాడు అంతే. ఈశ్వరీరావు నటన ఓకే. బ్రహ్మాజీకి ఇలాంటి పాత్రలు కొత్త కాదు. గెటప్ శీను, ప్రవీణ్‌తో పాటు సినిమాలో చాలా మందే కమెడియన్లు ఉన్నారు. వారందరూ వారి వారి పరిధుల మేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
మహాభారతాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో లెనిన్ కథను రాసుకున్నాడు డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరు. చిత్తూరు జిల్లాలో జరిగే జాతర ఎపిసోడ్‌తో కథ ఎమోషనల్‌గా మొదలుపెట్టడం ద్వారా సినిమాపై క్యూరియాసిటిని పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ఈ కథను కమర్షియల్ హంగులతో చెప్పడంలో వంద మార్కులు సాధించాడు. తమన్ మ్యూజిక్ బాగుంది. వారేవా సాంగ్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌లో బీజీఎమ్ గూస్బంప్స్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. లియాన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా సాగింది. జాతర ఎపిసోడ్స్‌ను నాచురల్‌గా చూపించారు. ఎడిటర్‌గా నవీన్ నూలీ తన రెగ్యులర్ ట్రాక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథను సాఫీగా కాకుండా జర్కీగా చూపించడం వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సూర్యదేవర నాగవంశీతో కలిసి హీరో నాగార్జున ఈ సినిమాను నిర్మించారు. కథకు ఎంత అవసరమో అంతే బడ్జెట్ పెట్టారు. వేస్టేజ్ అన్నది ఎక్కడ కనపడదు.
విశ్లేషణ :
ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు రాసుకున్న స్క్రీన్‌ప్లే . మొదటి భాగంలో కథను నెమ్మదిగా పరిచయం చేస్తూ, ఇంటర్వెల్ తర్వాత కథను వేగంగా ముందుకు తీసుకెళ్లిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా అఖిల్ఈ సినిమాలో తన గత చిత్రాలతో పోలిస్తే మరింత పరిణతి చెందిన నటనను కనబరిచినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు , యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన నటన సినిమాకు బలంగా నిలుస్తుంది. ఒకసారి గతంలోకి వెళ్లి కథ చెప్పడం ప్రారంభించిన తర్వాత ఫీల్ గుడ్ సీన్లు లేకపోవడం, భారతీ, లెనిన్ మధ్య లవ్ ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల కథ సాదాసీదా ఇంటర్వెల్ వరకు లాగించే ప్రయత్నం చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలా స్లోగా సాగే కథలో లెనిన్తో ఓ ట్విస్ట్ రివీల్ చేసిన పాయింట్ సినిమా రేంజ్‌ను పెంచేలా చేసింది. పాటలు, ఫైట్స్, ఎమోషనల్ సీన్లు, రూరల్ డ్రామా ఫస్టాఫ్‌కు పాజిటివ్‌గా మారాయి. ఇక సెకండాఫ్‌లో వసంత్, లెనిన్, భారతీ మధ్య జరిగే సన్నివేశాలు, ఇతర క్యారెక్టర్లు వేసే ఎత్తులు పై ఎత్తులు స్టోరీని గ్రిప్పింగ్‌గా మార్చడంతో సినిమా సరైన గాడిలో పడిందనే ఫీలింగ్ కలుగుతుంది. అప్పటి వరకు ఓ పాజిటివ్ నోట్ ఉన్న క్యారెక్టర్లు నెగిటివ్ జోన్లోకి తీసుకొచ్చిన తీరు కథకు బలంగా మారింది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు వచ్చే ట్విస్టులు ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తాయి. చివరి 20 నిమిషాలు లెనిన్ క్యారెక్టర్ బిహేవ్ చేసిన విధానం, ఆ పాత్ర కోసం అఖిల్ చేసిన పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా మారిందనే చెప్పాలి. అక్కినేని అభిమానులకు ఈ చిత్రం ఫుల్ మీల్స్, సాదారణ ప్రేక్షకుడికి ఓ కొత్త తరహ సినిమాగా ఆకట్టుకుతుంది.








