కాంగ్రెస్ తో తాడోపేడో తేల్చుకునేందుకే కొండా సురేఖ మొగ్గు?
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సురేఖ, ఇప్పుడు సొంత పార్టీ అధిష్ఠానంతోనే తాడోపేడో తేల్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రి పదవిపై ఏమాత్రం బెరుకు లేకుండా, పార్టీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నోటీసులను సైతం తేలిగ్గా తీసుకుంటూ ఆమె ఇస్తున్న సంకేతాలు గాంధీభవన్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
ప్రస్తుతం తనకున్న మంత్రి పదవి కేవలం ‘పోలీస్ ఎస్కార్ట్’ కోసమే తప్ప, ఎలాంటి విస్తృత అధికారాలు లేకుండా నామమాత్రంగా మారిందన్న భావనలో సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది. తన శాఖల పరిధిలో ఇతరుల జోక్యం పెరిగిపోవడం ఆమె అసంతృప్తికి ప్రధాన కారణంగా మారింది. ముఖ్యంగా మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల వ్యవహారంలో విభేదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించడం సురేఖకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన శాఖలో ఇతర నాయకుల జోక్యంపై పార్టీలో ఎవరూ ప్రశ్నించకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
వివాదం మరింత ముదరడానికి పరకాల నియోజకవర్గ రాజకీయాలే కేంద్రబిందువుగా మారాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తన కుమార్తె కొండా సుస్మితను పరకాల నుంచి పోటీకి దించాలని సురేఖ గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే, ఇటీవల పరకాల పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ పరిణామం కొండా కుటుంబానికి మింగుడుపడలేదు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై కొండా సుస్మిత నేరుగా సంచలన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకుని సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేయడం పార్టీలో ప్రకంపనలు సృష్టించింది.
సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ కొండా సురేఖకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. సాధారణంగా ఇలాంటి నోటీసులకు పార్టీ నేతలు నష్టనివారణ చర్యల్లో భాగంగా సర్దుబాటు వివరణలు ఇస్తుంటారు. కానీ కొండా సురేఖ తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ‘సహజ న్యాయ సూత్రాల’ ప్రకారం ఆ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కమిటీనే డిమాండ్ చేయడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
మంత్రి పదవిని కాపాడుకోవడమే ప్రాధాన్యత అనుకుంటే సురేఖ వైఖరి ఇలా ఉండేది కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులే అంతర్గతంగా విశ్లేషిస్తున్నారు. ఏ పరిణామాలు ఎదురైనా, చివరకు మంత్రి పదవి పోయినా సరే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ నాయకత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికే ఆమె సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో పట్టు నిలుపుకోవడం, కుమార్తె రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడమే లక్ష్యంగా కొండా సురేఖ వేస్తున్న ఈ రాజకీయ ఎత్తుగడలు కాంగ్రెస్ హైకమాండ్‌కు పెద్ద సవాలుగా మారాయి. ఇరు వర్గాల్లో ఎవరు ముందుగా ఊహించని షాక్ ఇస్తారనే ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్‌లో పతాక స్థాయికి చేరింది.








