ఏలూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి, సీఎం చంద్రబాబు బిజీ బిజీ..!
ఏలూరు జిల్లా ముసునూరులో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణ చోటుచేసుకుంది. జిల్లా పర్యటనకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) కలిసి ముసునూరు వేదికగా నూతన పాప్‌కార్న్ సీడ్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి ‘నాన్-GMO (జెనెటికల్లీ మోడిఫైడ్ కాని) మొక్కజొన్న హైబ్రిడ్’ విత్తనంగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అత్యంత తక్కువ వ్యవధిలోనే ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేవలం 11 ఏళ్ల స్వల్ప కాలంలోనే ఈ సంస్థ దేశంలోని 8 రాష్ట్రాలకు విస్తరించడమే కాకుండా, మార్కెట్లో ఏకంగా 69 శాతం వాటాను కైవసం చేసుకోవడం ఒక గొప్ప విషయమని కొనియాడారు. సాంకేతికతను వ్యవసాయానికి జోడిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఈ ఆవిష్కరణ నిరూపించిందని ఆయన స్పష్టం చేశారు.
ముసునూరులో ఉన్న ఈ ప్లాంట్ రోజుకు 29 టన్నుల భారీ సామర్థ్యంతో రన్ అవుతోందని, ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలిచిందని సీఎం చంద్రబాబు సగర్వంగా ప్రకటించారు. మన రాష్ట్రంలో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి ప్రాసెసింగ్ కేంద్రం ఉండటం ఏపీ గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్‌తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








