ఇరాన్ కు స్వీట్ గ్యాస్.. ఇంధన భద్రత మరింత పటిష్టం..!
పశ్చిమాసియా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ కు.. ఊహించని విధంగా జాక్ పాట్ తగిలింది. అతిపెద్ద గ్యాస్ క్షేత్రాన్ని ఆదేశ చమురు శాఖ గుర్తించింది. దక్షిణ ఫార్స్ ప్రావిన్స్‌లో 7.5 ట్రిలియన్ ఘనపుటడుగులకు పైగా సహజవాయు నిల్వలను గుర్తించినట్లు ఆ దేశ చమురు శాఖ మంత్రి మొహ్సెన్ పక్నెజాద్ వెల్లడించారు. ఇందులో 72, 73 శాతం మేర గ్యాస్‌ను వెలికితీయవచ్చని అంచానా వేస్తున్నారు. అంటే దాదాపు 5.7 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.
స్వీట్ నేచురల్ గ్యాస్…
అదృష్టవశాత్తూ ఇరాన్ గుర్తించిన గ్యాస్ క్షేత్రంలో ఉన్నది స్వీట్ గ్యాస్(sweet natural gas) .ఇందులో హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి మలినాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో శుద్ధి, ఉత్పత్తి వ్యయాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇరాన్ ఇప్పటికే దాదాపు 34 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయు నిల్వలతో రష్యా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. తాజా ఆవిష్కరణతో ఆ దేశ ఇంధన సంపద మరింత పెరగనుంది. అయితే, కొత్త క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు భారీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. యుద్ధం, ఆంక్షలు, అమెరికా దిగ్బంధనం నేపథ్యంలో వాటిని సమకూర్చుకోవడం ఇరాన్‌కు సవాలుగా మారే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో ఈ గ్యాస్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభాలు గడించడం ఇరాన్‌కు అంత సులువు కాదు.
అయితే.. ఇరాన్‌కు ఈ కొత్త గ్యాస్ నిల్వల వల్ల తక్షణం కంటే దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఇంధన భద్రత పెరుగుతుంది. దేశీయ అవసరాలకు మరింత సహజవాయువు అందుబాటులోకి వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, గృహ అవసరాల్లో ఇరాన్ మరింత స్వయం సమృద్ధి సాధించగలదు. అదే సమయంలో.. విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల్లో గ్యాస్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే, కొంత చమురును ఎగుమతికి మళ్లించి విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించవచ్చు.
గ్యాస్ ఎగుమతుల సామర్థ్యం పెరుగుదల..
భవిష్యత్తులో మౌలిక వసతులు, పెట్టుబడులు సమకూరితే పొరుగు దేశాలకు పైప్‌లైన్ ద్వారా లేదా LNG రూపంలో ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది.ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత దేశీయ విక్రయాలు, ఎగుమతులు, పన్నులు, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయం ద్వారా అదనపు రాబడి రావచ్చు.
ఇరాన్ వద్ద ఉన్న ఇంధన వనరుల పరిమాణం పెరగడం వల్ల దీర్ఘకాలంలో అమెరికా ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కొంత పెరగవచ్చు.కొత్త భారీ నిల్వలు విదేశీ లేదా ఇతర భాగస్వామ్య పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగపడవచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం.. 7.5 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ దొరికిందంటే ఇరాన్‌కు వెంటనే అంత మొత్తంలో డబ్బు వచ్చేస్తుందని కాదు. ముందుగా క్షేత్రాన్ని అభివృద్ధి చేసి, ఉత్పత్తి ప్రారంభించి, అవసరమైన పైప్లైన్లు/ప్రాసెసింగ్ సదుపాయాలు నిర్మించాలి. ఆ తర్వాతే పెద్ద ఆర్థిక ప్రయోజనం కనిపిస్తుంది.








