ఇరాన్ ఆటకట్టిస్తాం.. ఆర్థిక వినాశనం తప్పదన్న అమెరికా..!
ఇరాన్ పై యుద్ధం తుదిదశకు చేరిందని అమెరికా స్పష్టం చేసింది. ఆర్థికయుద్ధం ప్రారంభిస్తున్నామన్న అగ్రరాజ్యం.. ఈ క్రమంలో టెహ్రాన్ కు సాయం చేసే దేశాలు కఠిన ఆంక్షలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి అమెరికా మంత్రి స్కాట్ బెసెంట్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో ఆట (US-Iran War) చివరికొచ్చిందని, ఇక ఆ దేశానికి ఆర్థిక వినాశనమేనని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘‘ఇరాన్ (Iran) సైనిక సామర్థ్యాలను గట్టి దెబ్బకొట్టాం. ఆ దేశ సైనిక ఫ్యాక్టరీలను 100శాతం ధ్వంసం చేశాం. అణు కార్యక్రమాన్ని సమాధి చేశాం. ఇక ఆట చివరికొచ్చింది. ఏ శత్రువుపైనా ఇప్పటివరకు చేపట్టని అతిపెద్ద ఆర్థిక యుద్ధాన్ని (Economci War) ప్రారంభించబోతున్నాం. భద్రతా హామీల ముసుగులో ఇన్నాళ్లూ ఇరాన్ బెదిరింపులు చేస్తూ మనుగడ సాగించింది. అమెరికా తమనేమీ చేయలేదని భావించింది. కానీ, ఇప్పుడు ట్రంప్ (Donald Trump) హయాంలో ఆ శకం ముగిసింది. టెహ్రాన్‌ను ఒంటరి చేసేవరకు.. ఆ నిరంకుశ పాలనను నిలబెడుతున్న ప్రతి ఆర్థిక జీవనాధారాన్ని తెంచడమే మా లక్ష్యం’’ అని స్కాట్ బెసెంట్ (Scott Bessent) రాసుకొచ్చారు.
మరోవైపు, అమెరికా హెచ్చరికలపై ఇరాన్ దీటుగా స్పందించింది. అగ్రరాజ్య ఆర్థిక యుద్ధంలో గల్ఫ్ దేశాలు చేరితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ‘‘ఈ ఆర్థిక యుద్ధం మొదలైతే.. పర్షియన్ గల్ఫ్ నుంచి గానీ, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా గానీ ఒక్క చుక్క చమురు కూడా దాటదు. అమెరికా చేపట్టే ఈ ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా భాగస్వామి అయినా.. లేదా ఇరాన్ ప్రజలకు వ్యతిరేకంగా అగ్రరాజ్యానికి సహకరించినా.. వారిని మేం శత్రువులుగానే పరిగణించాల్సి వస్తుంది’’ అని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ మొహసెన్ రజాయ్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. హర్మూజ్‌లో ప్రస్తుతం నౌకలు రెండు మార్గాల్లో రాకపోకలు సాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా.. మరొకటి అమెరికా భద్రత కల్పిస్తోన్న ఒమన్ రూట్. ఈ మార్గాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న టెహ్రాన్.. తాజాగా నౌకలకు కీలక హెచ్చరికలు చేసింది. తమ ఆదేశాలు పట్టించుకోకుండా.. హర్మూజ్‌లో ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించే నౌకలను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. వీటికి సహకరించే నౌకలపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ పరిణామాలన్నింటితో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత కల్లోలంగా మారుతున్నాయి.








