1842లో రాసిన నవల.. 2026లో సినిమాగా! ఏం మార్చారంటే?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
కొన్ని కథలు రాసిన కాలం మారినా.. వాటిలోని ఆలోచనలు ఏ మాత్రం పాతబడవు. అంత మాత్రాన ఆ కథలను కొత్త తరానికి అదే రూపంలో చెప్పలేం. కాలానికి,ఇప్పటి తరం ఆలోచనలకు,స్పీడుకు తగ్గట్టు వాటిని మార్చాలి.. అదే సమయంలో అసలు ఆత్మను కాపాడాలి.
దాదాపు 185 ఏళ్ల క్రితం ప్రఖ్యాత రష్యన్ రచయిత నికోలాయ్ గోగోల్ రాసిన అద్బుతమైన నవల ‘Dead Souls’ ను దర్శకుడు Alex Cox ఇప్పుడు అమెరికన్ వెస్ట్రన్‌గా మార్చారు. ఆ సినిమా రీసెంట్ గా రిలీజైంది. మరి ఈ పాత కథలో ఆయన ఏం కొత్త మార్పులు చేసారు. ఆ మార్పులు నేటి ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యాయా?
https://www.youtube.com/watch?v=kwaLlz9TLMo
గోగోల్ ‘Dead Souls’లో అసలు కథేంటి?
1842లో వచ్చిన ‘Dead Souls’లో హీరో Pavel Ivanovich Chichikov. రష్యన్ సామ్రాజ్యంలో పెద్దగా ఆస్తిపాస్తులు లేని ఈ వ్యక్తికి మాత్రం ఒక పెద్ద ఆశ ఉంటుంది. సమాజంలో తాను సంపన్నుడిగా, గౌరవనీయుడిగా కనిపించాలి. అందుకోసం సాధారణ మార్గంలో డబ్బు సంపాదించడం కంటే వ్యవస్థలో ఉన్న ఓ లొసుగును ఉపయోగించుకోవాలని చూస్తాడు.
ఆ కాలంలో రష్యాలో భూస్వాముల దగ్గర పనిచేసే బానిసలను ప్రభుత్వ జనాభా లెక్కల్లో ‘souls’గా పరిగణించేవారు. జనాభా లెక్కలు కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగేవి. ఆ మధ్యలో ఒక బానిస చనిపోయినా, తదుపరి census వరకు అతని పేరు అధికారిక రికార్డులో కొనసాగేది. భూస్వామి మాత్రం ఆ పేరుపై పన్ను చెల్లించాల్సి వచ్చేది. చిచికోవ్ ఇక్కడే ఒక అవకాశం చూస్తాడు.
అతను గ్రామాల వెంట తిరుగుతూ భూస్వాములను కలుస్తాడు. చనిపోయిన బానిసల పేర్లను తనకు ఇవ్వమని అడుగుతాడు. భూస్వాములకు కూడా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇక లేని మనుషులపై పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు.చిచికోవ్కు కావాల్సింది ఆ మనుషులు కాదు, ఆ మనుషుల పేర్లు! ఆ ‘Dead Souls’ ఆధారంగా తన దగ్గర పెద్ద ఆస్తి ఉన్నట్టు చూపించి, బ్యాంకుల నుంచి రుణాలు పొంది హోదా సంపాదించాలనుకుంటాడు.
ఇక్కడే గోగోల్ కథ ఒక సాధారణ మోసం కథ నుంచి సామాజిక వ్యంగ్యంగా మారుతుంది. చిచికోవ్ ఒక్కరే దురాశపరుడు కాదు. అతను కలిసే భూస్వాములు, అధికారులు, వ్యాపారులు, సామాజిక వర్గాలు కూడా తమ తమ స్వార్థాలతో నిండిపోయి ఉంటారు.
అందుకే ‘Dead Souls’లోని ‘dead’ అనే పదం కేవలం చనిపోయిన బానిసలను మాత్రమే సూచించదు. డబ్బు, హోదా, స్వార్థం కోసం నైతికతను కోల్పోయిన మనుషుల్ని కూడా సూచిస్తుంది.
మరి ఈ కథను అమెరికాకు ఎందుకు తీసుకొచ్చారు?
ఇక్కడ Alex Cox గొప్ప ఆలోచన చేసారు. గోగోల్ కథలో Chichikov ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తాడు. చిన్న పట్టణాల్లోకి వెళ్తాడు. అక్కడి విచిత్రమైన వ్యక్తులను కలుస్తాడు. ఒక్కొక్కరితో మాట్లాడి తన పని కోసం వాళ్లను ఒప్పిస్తాడు.
ఇది Coxకు ఒక వెస్ట్రన్ కథలా కనిపించింది. అందుకే ఆయన కథను 1890ల అమెరికన్ Southwestకు మార్చారు. రష్యన్ గ్రామాల స్థానంలో అరిజోనా సరిహద్దు పట్టణం వచ్చింది. చిచికోవ్ స్థానంలో Strindler వచ్చాడు. బానిసల స్థానంలో చనిపోయిన మెక్సికన్ కార్మికులు వచ్చారు. భూస్వాముల స్థానంలో స్థానిక యజమానులు, మేయర్, షెరీఫ్, వ్యాపారులు వచ్చారు.
అంటే కథను యథాతథంగా తీసుకోలేదు. గోగోల్ కథలోని ఆలోచనను తీసుకుని, దానికి అమెరికన్ చరిత్ర అనే కొత్త శరీరం ఇచ్చారు.
సినిమాలో ఏం మార్చారు?
నేరేషన్ మార్చారు. ఈ కాలానికి తగినట్లు , ప్రేక్షకుడి అభిరుచికి తగినట్లు మార్పులు చేసారు. సినిమాలో Strindler అనే రహస్య వ్యక్తి అరిజోనా సరిహద్దు పట్టణానికి వస్తాడు. వచ్చిన వెంటనే అతను అక్కడి అధికారులను, వ్యాపారులను, యజమానులను కలుస్తాడు. తన దగ్గర ఒక విచిత్రమైన ప్రతిపాదన ఉంటుంది. వాళ్ల దగ్గర పనిచేసి చనిపోయిన మెక్సికన్ కార్మికుల పేర్లు, పుట్టిన తేదీలు, ఇతర వివరాలు ఉంటే వాటిని తనకు ఇవ్వాలని, అందుకు డబ్బులు ఇస్తానని చెబుతాడు.
ఇక్కడ గోగోల్ కథలోని ‘dead souls’ ఆలోచనకు కొత్త రాజకీయ, సామాజిక నేపథ్యం వస్తుంది. రష్యాలో బానిస ఒక భూస్వామి ఆస్తి.అమెరికన్ వెస్ట్రన్‌లో మెక్సికన్ కార్మికుడు చౌకైన శ్రమకు ప్రతీక.రెండు కాలాల్లోనూ ఒక సామాన్యత ఉంది. వ్యవస్థ మనిషిని మనిషిగా చూడదు. అతని నుంచి వచ్చే ఆర్థిక విలువను మాత్రమే చూస్తుంది.
అదే ఆలోచనను Cox తన సినిమాకు కేంద్రంగా పెట్టాడు. అయితే Strindler కూడా గోగోల్ చిచికోవ్లా ఒకే రకమైన మోసగాడు కాదు. అతను ఎవరో స్పష్టంగా చెప్పడు. ఒక్కొక్కరికి ఒక్కో కథ చెబుతాడు. ఎక్కడో ప్రభుత్వ ఉద్యోగినని చెబుతాడు. ఇంకెక్కడో census అధికారిలా కనిపిస్తాడు. మరో సందర్భంలో మతపరమైన వ్యక్తిలా ప్రవర్తిస్తాడు.అసలు విషయం చెప్పకుండా సినిమాలో మిస్టరీని మరింత పెంచారు. ప్రేక్షకుడు కూడా ఆ పట్టణంలోని ప్రజలతో కలిసి Strindlerను అనుమానించాల్సి వస్తుంది.
జానర్ కూడా మారింది
కథను మాత్రమే కాదు.. జానర్‌ను కూడా మార్చారు ఇక్కడే సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒకవేళ Cox ‘Dead Souls’ను కేవలం పీరియడ్ డ్రామాగా తీసి ఉంటే అది పాత నవలకు కొత్త సినిమా రూపం మాత్రమే అయ్యేది. కానీ ఆయన వెస్ట్రన్‌ను కూడా తనకు నచ్చినట్టు ఆడుకున్నాడు. సలూన్లు ఉన్నాయి. గుర్రాలు ఉన్నాయి. తుపాకులు ఉన్నాయి. ఎడారి ఉంది. గన్ఫైట్లు ఉన్నాయి. కానీ వాటి మధ్యలోనే ఊహించని మ్యూజికల్ సీక్వెన్స్‌లు, జాంబీ ఎలిమెంట్స్, stop-motion, surreal ప్రయోగాలు కూడా వస్తాయి.
Cox స్వయంగా చెప్పిన ప్రకారం, సినిమా మొదట్లో చాలా సంప్రదాయ వెస్ట్రన్లా అనిపించడంతో, షూటింగ్ సమయంలోనే మరిన్ని అసాధారణ అంశాలను జోడించాడు. తన సినిమా మరో సాధారణ వెస్ట్రన్లా కనిపించకూడదనేది అతని ఆలోచన. అంటే నేటి ప్రేక్షకుడిని ఆకట్టుకోవడానికి ఆయన వేగంగా కట్లు, భారీ VFX లేదా ఆధునిక యాక్షన్‌ను ఆశ్రయించలేదు. కథ చెప్పే విధానాన్నే విచిత్రంగా మార్చాడు.
మరి ఈ మార్పులు పనిచేశాయా?
ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. ఇది mainstream commercial western కాదు. కథనం నెమ్మదిగా సాగుతుంది. హాస్యం పొడిగా ఉంటుంది. కొన్ని పాత్రలు కావాలనే స్టేజ్ నాటకంలా కనిపిస్తాయి. సినిమా ఒక్కసారిగా surreal మలుపులు తీసుకోవడం కూడా సాధారణ ప్రేక్షకుడికి వింతగా అనిపించవచ్చు.
అయితే Alex Cox శైలిని ఇష్టపడేవారికి మాత్రం ఈ ప్రయోగాలే సినిమాకు బలం. ఆయన తీసిన ‘Repo Man’, ‘Straight to Hell’ లాంటి సినిమాల్లో కనిపించే counterculture, genre parody ఇక్కడ కూడా కనిపిస్తుంది. అందుకే ‘Dead Souls’ను చూసినప్పుడు “ఇది పాత నవల ఆధారంగా తీసిన సినిమా” అనే భావన కంటే, “పాత నవలలో ఐడియా తీసుకుని Alex Cox తన ప్రపంచంలోకి లాగేశాడు” అనే భావన ఎక్కువగా వస్తుంది.
ప్రేక్షకుల రిసెప్షన్ ఎలా ఉంది?
ఇది పెద్ద commercial release కాదు. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన independent సినిమా. Cox Kickstarter ద్వారా సుమారు $214,000 సమీకరించి సినిమాను రూపొందించాడు. అయినా festival ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా San Francisco IndieFestలో Best Narrative Feature Audience Award గెలుచుకుంది. అంటే ఇది అందరినీ ఆకట్టుకున్న mainstream hit అని చెప్పలేం. కానీ తన టార్గెట్ ఆడియన్స్ ని మాత్రం చేరుకుంది. అదే ఈ సినిమాకు సరైన విజయంగా చూడాలి.
ఇలాంటి పాత క్లాసిక్స్‌ను ఇప్పుడు మళ్లీ ఎందుకు చెప్పాలి?
ఒక క్లాసిక్‌ను మ్యూజియంలో పెట్టి ఉంచడం ఒక మార్గం. మరో మార్గం దాన్ని మళ్లీ చదవడం.
ఇంకో మార్గం దాని కథను తీసుకుని మన కాలానికి సరిపోయే ప్రశ్న అడగడం. Alex Cox మూడో మార్గాన్ని ఎంచుకున్నాడు. 1842లో గోగోల్ అడిగిన ప్రశ్నలు అప్పటి రష్యన్ సమాజానికి సంబంధించినవి. కానీ దురాశ, అవినీతి, అధికారాన్ని ఉపయోగించి లాభం పొందడం, మనిషిని ఒక సంఖ్యగా లేదా ఆస్తిగా చూడడం.. ఇవి ఒక్క కాలానికే పరిమితమైన సమస్యలు కావు. అందుకే ఈ కథను 2026లో మళ్లీ చెప్పడానికి అవకాశం ఉంది. ‘Dead Souls’ పాత కథ అయినా పూర్తిగా పాతబడిన కథ కాదు.
ఏదైమైనా
ఒక గొప్ప క్లాసిక్‌ను మళ్లీ సినిమా చేయడం అంటే పాత కథను కొత్త కెమెరాతో చిత్రీకరించడం కాదు. పాత కథలో దాగి ఉన్న ప్రశ్నను బయటకు తీసి, దాన్ని కొత్త తరానికి అర్థమయ్యే ప్రపంచంలో అడగడం. ‘Dead Souls’ విషయంలో Alex Cox అదే చేశాడు.
గోగోల్ రష్యన్ భూస్వామ్య వ్యవస్థలో చనిపోయిన బానిసల పేర్లను చూపెట్టి సెటైర్ వేసాడు. Cox అదే ఆలోచనను అమెరికన్ frontierలోకి తీసుకెళ్లి, కార్మిక దోపిడీ, భూమి, డబ్బు, అధికారం, వ్యవస్థల లొసుగులతో కలిపాడు. అందుకే ఇది గోగోల్ నవలకు కేవలం సినిమా రూపం కాదు. 1842లో మొదలైన ఒక ప్రశ్నకు 2026లో ఇచ్చిన మరో సమాధానం.








