బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం పోతే..? నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? కోర్టు క్లారిటీ!
రాత్రికి రాత్రే బ్యాంకులో దొంగలు పడ్డారు. లాకర్లు తెరిచారు. కోట్ల రూపాయల విలువైన బంగారం మాయమైంది.
ఆ బంగారంలో మీది కూడా ఉంది. కొన్ని నెలల క్రితం అత్యవసర పరిస్థితిలో డబ్బు కోసం మీ బంగారు గొలుసు, గాజులు, ఉంగరాలు బ్యాంకులో తాకట్టు పెట్టారు. బ్యాంకు వాటిని భద్రంగా దాచుకుంది. ఇప్పుడు అవే ఆభరణాలు దొంగల చేతికి వెళ్లిపోయాయి.
మీరు బ్యాంకుకు వెళ్లి అడిగితే…
“మీ బంగారం పోయింది… కానీ మేం నికర బంగారం విలువ మాత్రమే ఇస్తాం” అంటే?
మీరు కొనేటప్పుడు చెల్లించిన మజూరీ సంగతేంటి? ఆభరణాల్లో ఉన్న రాళ్ల విలువ సంగతేంటి? అంతేకాదు… బ్యాంకు కస్టడీలో ఉన్న బంగారం పోయినప్పుడు ఆ నష్టాన్ని నిజంగా భరించాల్సింది ఎవరు?
ఈ ప్రశ్నకు కర్ణాటక వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు ఒక కీలక సమాధానం ఇచ్చింది. అది గోల్డ్ లోన్ తీసుకునే ప్రతి కస్టమర్ తెలుసుకోవాల్సిన విషయం.
అసలేం జరిగింది?
ఈ కేసు కర్ణాటకలోని తుమకూరుకు చెందిన ఓ వ్యక్తిది. 2017 ఆగస్టులో ఆయన కెనరా బ్యాంకు శాఖలో రెండు గోల్డ్ లోన్ ఖాతాలు తెరిచారు. ఒక ఖాతా కోసం 120.80 గ్రాముల బరువున్న రెండు ఆభరణాలను, మరో ఖాతా కోసం 133 గ్రాముల బరువున్న మరో రెండు ఆభరణాలను తాకట్టు పెట్టారు. రెండు ఖాతాలపై రూ.1.50 లక్షల చొప్పున మొత్తం రూ.3 లక్షల రుణం తీసుకున్నారు. అప్పటికి ఇది సాధారణ గోల్డ్ లోన్ . కానీ కొంతకాలానికి బ్యాంకు శాఖలో భారీ దోపిడీ జరిగింది.
లాకర్లలో భద్రపరిచిన బంగారం దొంగల పాలైంది. అందులో ఈ కస్టమర్ తాకట్టు పెట్టిన ఆభరణాలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. దొంగతనం జరిగిన తర్వాత బ్యాంకు కస్టమర్‌కు లేఖ రాసింది. బ్యాంకు లెక్క ప్రకారం తాకట్టు పెట్టిన ఆభరణాల్లోని నికర బంగారం బరువును తీసుకుని, అప్పటి మార్కెట్ ధర ఆధారంగా పరిహారం చెల్లిస్తామని తెలిపింది.
మొదటి ఖాతాకు రూ.1,56,033, రెండో ఖాతాకు రూ.2,12,500 చెల్లిస్తామని బ్యాంకు ఆఫర్ చేసింది.
కానీ కస్టమర్ మాత్రం ఆ మొత్తంతో సంతృప్తి చెందలేదు. ఎందుకంటే ఆయన మాటల్లో చెప్పాలంటే, బ్యాంకులో తాకట్టు పెట్టింది బంగారం ముక్కలు కాదు.. ఆభరణాలు.
కోర్టుకు కేసు
ఆభరణాలు కొనేటప్పుడు బంగారం ధరతో పాటు తయారీ ఛార్జీలు చెల్లిస్తారు. కొన్ని ఆభరణాల్లో రాళ్లు ఉంటాయి. కాబట్టి కేవలం నికర బంగారం ధరను లెక్కించి పరిహారం ఇవ్వడం వల్ల తనకు జరిగిన పూర్తి నష్టం భర్తీ కాదని ఆయన వాదించారు.
అందుకే 20 శాతం తయారీ ఛార్జీలు, 3 శాతం రాళ్ల విలువ కలిపి మరో రూ.88,362 చెల్లించాలని బ్యాంకును కోరారు. బ్యాంకు మాత్రం అంగీకరించలేదు. దీంతో ఆయన వినియోగదారుల కమిషన్ తలుపు తట్టారు.
జిల్లా కమిషన్: కస్టమర్ వాదనలో బలం ఉంది
2020 జూలైలో జిల్లా వినియోగదారుల కమిషన్ ఈ కేసులో కస్టమర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వలం నికర బంగారం విలువ చెల్లించడం సరిపోదని పేర్కొంది. యారీ ఛార్జీలు, రాళ్ల విలువను కూడా పరిగణనలోకి తీసుకుని అదనంగా రూ.88,362 చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. దీంతో ఆదేశాలు ఆగలేదు.
ఆ అదనపు మొత్తంపై 2018 ఆగస్టు 29 నుంచి 9 శాతం వడ్డీ చెల్లించాలని చెప్పింది. కస్టమర్‌కు కలిగిన మానసిక క్షోభకు రూ.30,000, న్యాయపోరాట ఖర్చులకు మరో రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది.
అయితే బ్యాంకు ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు. ల్లా కమిషన్ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. రాష్ట్ర కమిషన్ కూడా బ్యాంకు వాదనను అంగీకరించలేదు రాష్ట్ర కమిషన్ ముందు బ్యాంకు అప్పీల్ వెళ్లింది. కానీ అక్కడ కూడా బ్యాంకుకు ఊరట లభించలేదు. రాష్ట్ర కమిషన్ జిల్లా కమిషన్ తీర్పును సమర్థించింది. అంతేకాదు, ఈ కేసులో భవిష్యత్తులో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్న ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది.
బ్యాంకు ఆధీనంలో ఉన్న ఆభరణాలు దోపిడీ లేదా దొంగతనం ద్వారా పోయినట్లయితే, వాటి పూర్తి విలువను కస్టమర్‌కు చెల్లించడం బ్యాంకు బాధ్యత అని కమిషన్ స్పష్టం చేసింది. అంటే, “బంగారం ఇన్ని గ్రాములు ఉంది.. గ్రాముకు ఇంత ధర” అంటూ నికర బంగారం విలువ మాత్రమే లెక్కించడం సరిపోదని కమిషన్ అభిప్రాయపడింది.
ఆభరణాల విలువను పరిగణనలోకి తీసుకునేటప్పుడు తయారీ ఛార్జీలు, రాళ్ల విలువ కూడా చూడాల్సి ఉంటుందని పేర్కొంది.
బిల్లు చూపించకపోయినా మజూరీ అడగొచ్చా?
ఈ తీర్పులో మరో ఆసక్తికరమైన అంశం ఇదే. బంగారు ఆభరణాలకు తయారీ ఛార్జీలు ఉంటాయనేది సాధారణంగా తెలిసిన విషయమేనని కమిషన్ పేర్కొంది. అందువల్ల వాటిని నిరూపించడానికి కస్టమర్ తప్పనిసరిగా పాత కొనుగోలు బిల్లులు లేదా ఇన్వాయిస్లు చూపించాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఇది కస్టమర్‌కు ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఆభరణాలకు సంబంధించిన బిల్లులు ప్రతి ఒక్కరి దగ్గర ఉండకపోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఆభరణాల విషయంలో అసలు బిల్లు ఉండకపోవచ్చు.
అలాంటి సందర్భాల్లో “బిల్లు లేదు కాబట్టి మజూరీ లేదు” అనే వాదనను మాత్రమే ఆధారంగా చేసుకుని పరిహారం తగ్గించడం సరైన విధానం కాదని ఈ కేసులో కమిషన్ స్పష్టం చేసింది.
గోల్డ్ లోన్ తీసుకునే వాళ్లు ఏం జాగ్రత్త పడాలి?
ఈ కేసు తర్వాత గోల్డ్ లోన్ తీసుకునే కస్టమర్లు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. తాకట్టు పెట్టే ప్రతి ఆభరణం బరువు, వివరణ, అంచనా విలువ వంటి వివరాలను సరిచూసుకోవాలి. బ్యాంకు ఇచ్చే రసీదు, అప్రైజల్ రిపోర్టు వంటి పత్రాలను భద్రపరచుకోవాలి.కొనుగోలు బిల్లులు ఉంటే వాటిని కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిదే.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








