‘హృదయం మురళి’ ఓటిటి మూవీ రివ్యూ!
Rating:2.5
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ప్రేమలో పడటానికి పెద్దగా ప్రయత్నాలు అక్కర్లేదు. కాస్త ఖాళీ ఉంటే చాలు. సెల్ ఫోన్ ప్రక్కన పెట్టి కాసేపు రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలని గమనిస్తే చాలు. వాళ్ళలో ఎవరైనా నచ్చచ్చు.ఏదో ఒక క్వాలిటీ నచ్చేయచ్చు.ఆ విషయం మనం అర్దం చేసుకునే సిగ్నల్స్ కూడా శరీరం ఏర్పాటు చేస్తుంది. గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. మెదడు కొంచెం తక్కువగా పనిచేస్తుంది. అంతే… ప్రేమ మొదలవుతుంది. అయితే ప్రేమలో పడినంత ఈజీ కాదు..అవతలి వాళ్లను ప్రేమలో పడేయటం. అంతకన్నా ముందు వాళ్ల దగ్గర ప్రేమ విషయం ఎక్సప్రెస్ చేయటం.ప్రస్తుతం హృదయ (అధర్వ) పరిస్ధితి అదే.
హృదయ అదే పనిగా అమ్మాయిలను వరసపెట్టి ప్రేమించగల సత్తా ఉన్నవాడే. సమస్య ఏంటంటే… అతను ప్రేమించే అమ్మాయికి తప్ప అందరికీ ఆ విషయం తెలుస్తుంది.అలాగే అతను పైన చెప్పుకున్నట్లు సదరు అమ్మాయికి ఎదురుపడి..హౌడుయు డు అన్నట్లుగా నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పలేని బెరుకుతనంతో బాధపడుతూంటాడు. అందులో రీజన్ కూడా ఉంది. చిన్నప్పుడే అమ్మా,నాన్న దూరం అవ్వటంతో హృదయను మేనమామ (నట్టి సుబ్రమణ్యం) పెంచి పెద్ద చేస్తాడు. ఆ లోటు అతనిలో ఒక రకమైన భయాన్ని పెంచుతుంది. ఎవరినైనా దగ్గర చేసుకోవడం కంటే, వాళ్లు దూరమైపోతారేమోనని ముందే భయపడటం అతని స్వభావంగా మారుతుంది.
అందుకే స్కూల్లో టీచర్ గీతపై క్రష్ వచ్చినా అది క్రష్‌గానే మిగిలిపోతుంది. ఆ తర్వాత కాలేజ్‌లో సమంత (ప్రీతి ముకుందన్)వస్తుంది. ఆమె గురించి ఆలోచిస్తాడు. ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమిస్తున్నాడని ఫ్రెండ్స్‌కి చెబుతాడు. ఒక్క సమంతకి మాత్రం చెప్పడు.దాంతో ఆమె మిస్.
సర్లే ప్రపంచంలో ఒక్కరే అమ్మాయా..ఈ సారి ‘అముద’ (కయాదు లోహార్)అనే డాక్టర్ కనపడితే, ప్రేమలో అమాంతం పడిపోయి,ఆరాధిస్తూంటాడు. సర్లే ఈ సారి అయినా తన ప్రేమ విషయం చెప్తాడా అంటే..సేమ్ సీన్ రిపీట్. ఫ్రెండ్స్ పాపం తెగ బ్రతిమిలాడి అలిసిపోతారు కానీ ఫలితం లేదు. మనోడికి ప్రేమలు అచ్చొచ్చేలా లేవని వాళ్ల మేనమామ అర్దం చేసుకుని అదితి (మాళవిక మోహనన్)అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేస్తాడు. ఇక పెళ్లైపోతుందంటే పాతవన్నీ గుర్తు వస్తాయి. గుర్తు వస్తే ఫరవాలేదు..తన జీవితంలోకి వచ్చిన అమ్మాయిలు మళ్ళి కనపడితే…కుర్రాడు పెళ్లవుతుందా..ప్రేమ అవుతుందా..ఏమౌతుంది…తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
ఇలాంటి కథలు మనం గతంలో బోలెడు చూసాం, మన నిజ జీవితంలోనూ విన్నాం. అయినా లవ్ స్టోరీ లు గొప్పతనం ఏమిటీ అంటే ప్రతీసారీ అవి ప్రెష్ గానే ఉంటాయి. ఇందులో హీరో కూడా ఇలాంటి లవ్ స్టోరీలు గతంలో సినిమాల్లో చూసి ఉంటాడు. వాటినే ఫాలో అయ్యాడనిపిస్తుంది. ఎందుకంటే ఇది 90 ల నాటి సినిమాలను గుర్తు చేస్తుంది. అఫ్ కోర్స్ ఈ హీరో తండ్రి మురళి అప్పట్లో తమిళ హీరో ..ఆయన చేసిన హృదయం నే బేస్ చేసుకుని ఈ సినిమా చేసినట్లున్నారు. ఆ సినిమాలో ..హీరో మొదటి నుంచి చివరి దాకా తను ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్యూ చెప్పలేకపోతాడు. అది సూపర్ హిట్.
ఆ తర్వాత ఆ సినిమాలో డీఎన్ ఏ ని తీసుకుని అల్లిన కథలతో అద్బుతమైన తొలిప్రేమ లాంటి సినిమాలు వచ్చాయి. అయితే ఆ కాలం మారింది. ఇప్పుడు ప్రేమలు, ప్రేమికులు మారారు. డేటింగ్ రూల్స్ మారాయి. రాత్రి ప్రేమిస్తే తెల్లారిలోగా చెప్పాల్సిన అర్జెన్సీ వచ్చేసింది. వాయిదా వేస్తే మళ్లీ అవతలి వాళ్లు వేరే వాళ్లతో ముందుకు వెళ్లిపోయే ప్రమాదం ఉన్న రోజులవి. ఇప్పుడు ఇలాంటి కథలంటే కష్టమే. కానీ నోస్ట్రాలిజీ గొప్పది కాబట్టి కొంతవరకూ బాగుందనిపిస్తుంది. అయితే ఈ సినిమాతో సుఖం ఏమిటంటే…పెద్దగా ఆలోచించకక్కర్లేదు..పజిల్స్ ఉండవు. ఏం జరుగుతుంది.ఏం కొంపమునిగిపోతుందనే ఆలోచనలు ఉండవు…బ్రెయిన్ ప్రక్కన పెట్టేసి హ్యాపీగా చూసేయటమే.
ఇలాంటి సీన్స్ గతంలో చూసేసాం కదా అని గుర్తు చేస్తున్నా పట్టించుకోకపోవటమే ఈ సినిమా చూసేటప్పుడు పాటించాల్సిన మెయిన్ రూల్. అదొక్కటి గుర్తు పెట్టుకుని మిగతావన్నీ మర్చిపోతే ఈ సినిమా చూసేయచ్చు..తర్వాత మెల్లిగా మర్చిపోవచ్చు. అలాగని సినిమా మరీ తీసిపారేయక్కర్లేదు…కొన్ని చోట్ల బాగుంటుంది..కొందరికి నచ్చచ్చు. ఇంతకన్నా గొప్ప సినిమాలు మాత్రం ఏమి వస్తున్నాయనుకుంటే అసలు ఇబ్బందే లేదు.
నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో ఉందీ సినిమా.
ఈ సినిమా టైటిల్ చూసి ఏదో హృదయంలోంచి వచ్చింది అనుకోవద్దు.ఇది హృదయం అనే పాత సినిమాలోంచి వచ్చిందే. కాబట్టి ఈ సినిమా చూసాక…యూట్యూబ్ లో వెతుక్కుని హృదయం సినిమా చూస్తే అదో రిలీఫ్. మురళి, హీరాల ప్రేమ కథ మరికొన్ని రోజులు వెంటాడుతుంది.








