శరీరంలోనే ఇన్‌బిల్ట్ ‘హీటర్’.. ఐస్ ఏజ్ నాటి షాకింగ్ సీక్రెట్ ఇదే!
సంవత్సరం: 20,000 BC.
చుట్టూ ఎక్కడ చూసినా మంచే. ఉష్ణోగ్రత మైనస్‌లోకి పడిపోయింది. గాలి ఎముకల్ని కోసేంత చల్లగా ఉంది. బయట ఒక్క నిమిషం నిలబడినా శరీరం వణికిపోతోంది. ఆహారం దొరకడం కష్టం. మంట ఆరిపోతే.. ప్రాణం పోయినట్టే.
ఒక గుహలో ఓ మనిషి కూర్చున్నాడు. అతని దగ్గర హీటర్ లేదు. ఎదురుగా మంటలేదు. థర్మల్ జాకెట్ లేదు. మందులు లేవు. అదే సమయంలో అతనికి చలీ లేదు. మంచు అతని శరీరాన్ని ఏమీ చెయ్యటం లేదు. మంచు యుగంలో మనిషి ఎలా బ్రతికి బట్టకట్టాడు అనే విషయమై రీసెర్చ్ చేస్తున్న సైంటిస్ట్ లకు ఆ కాలం నాటి మానవుడు శరీరంలో ఉన్న హీటర్ గురించి బయిటపడింది. అవును మీరు చదివింది కరెక్టే..అతని శరీరంలోనే హీటర్ ఉండేది. అదెలా సాధ్యం అంటారా?
హీటర్ మేటరేంటి?
వేల సంవత్సరాల క్రితం భూమిని కప్పేసిన చివరి హిమయుగంలో.. మన పూర్వీకుల శరీరం చలిని ఎదుర్కొనేందుకు నెమ్మదిగా మారిపోయింది. వారి DNAలో కొన్ని మార్పులు.. శరీరంలోని కొవ్వును కాల్చి వేడిని తయారు చేసే సహజ ‘హీటర్’ను రెడీ చేసాయి.
జపాన్‌లో వేల ఏళ్ల క్రితం జీవించిన జోమోన్ ప్రజల DNA ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన క్లూ ఇస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన పరిశోధకులు 42 మంది జోమోన్ వేటగాళ్లు జన్యు సమాచారాన్ని సేకరించి పరిశీలించారు. ఆ DNAలో కనిపించిన కొన్ని జన్యు సంకేతాలు.. వారి చాలా ఆశ్చర్యపరిచాయి. పురాతన పూర్వీకులు ఎదుర్కొన్న తీవ్రమైన చలిని ఎలా ఎదుర్కోగలిగారో తెలుసుకోగలిగారు.
అంటే ఐస్ ఏజ్ మనిషిని మార్చింది. అది కేవలం అతని జీవనశైలిని మార్చలేదు. అతని ఆహారాన్ని మార్చింది. అతని శరీరం కొవ్వును ఉపయోగించే విధానాన్ని మార్చింది. చివరికి.. అతని DNAలోనే కొన్ని మార్పులకు దారి తీసింది.
మన శరీరంలో దాగి ఉన్న ‘హీటర్’
మనకు చలి వేసినప్పుడు శరీరం వణుకుతుంది. అది కండరాల కదలికల ద్వారా వేడిని ఉత్పత్తి చేసే సహజ రక్షణ వ్యవస్థ. కానీ మన శరీరానికి మరో మార్గం కూడా ఉంది. దాన్ని Non-shivering thermogenesis అంటారు. ఇందులో ‘Brown Fat’ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రత్యేకమైన కొవ్వు.. అవసరమైనప్పుడు శక్తిని కాల్చి వేడిని తయారు చేయగలదు.
జోమోన్ ప్రజల DNAలో ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న కొన్ని జన్యు వేరియంట్లు అసాధారణంగా ఎక్కువగా కనిపించాయి. ఒక ముఖ్యమైన వేరియంట్ జోమోన్ ప్రజల్లో సుమారు 73 శాతం స్థాయిలో కనిపించింది. అంటే.. వేల సంవత్సరాల క్రితం తీవ్రమైన చలిలో జీవించిన వారి శరీరాలు బ్రతకటం కోసం లోపల కొన్ని లక్షణాలను బలంగా ప్రోత్సహించి ఉండొచ్చు.
అలాగే కొవ్వును ఎలా నిల్వ చేసుకోవాలి? ఎప్పుడు దాన్ని ఇంధనంగా ఉపయోగించాలి? అనే విషయంలో కూడా కొన్ని జన్యు మార్పులు చోటుచేసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది నిజంగా ప్రకృతి చేసిన అద్భుతమైన ఇంజినీరింగ్లా కనిపిస్తుంది.
చలిలో శరీరానికి శక్తి కావాలి. శక్తి కోసం కొవ్వు కావాలి. అదే కొవ్వును కాల్చితే.. వేడి వస్తుంది. అంటే.. శరీరం ఒకేసారి బ్యాటరీగా కూడా, హీటర్‌గా కూడా పనిచేసేలా మారిపోయిందన్నమాట.
అయితే ప్రకృతి ఒక్క రాత్రిలో మనిషిని మార్చలేదు. వేల సంవత్సరాల పాటు.. ప్రతి తరంలో చిన్న చిన్న మార్పులు చేస్తూ.. ఒక కొత్త ‘మానవ వెర్షన్’ను తయారు చేసింది. ఈరోజు మనం ఆ పరిణామం యొక్క ఫలితాన్ని మాత్రమే చూస్తున్నాం.
కానీ ఆ ప్రయోగం మొదలైనప్పుడు.. మనిషి ముందు ఒకే ప్రశ్న ఉంది. “ఈ మంచులో ఎలా బతకాలి?” ప్రకృతి ఇచ్చిన సమాధానం మాత్రం.. “నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చలేకపోతే.. నీ శరీరాన్నే మార్చుకో.” అదే మానవ పరిణామం యొక్క అసలు సీక్రెట్ అయ్యిండవచ్చు.
ఇప్పుడీ రీసెర్చ్ ఎలా పనిచేయచ్చు
ఆ మంచుతో నిండిన గుహలో కూర్చున్న ఆ మనిషికి తన శరీరంలో ఏం జరుగుతుందో తెలియదు. అతనికి Brown Fat గురించి తెలియదు. Non-shivering thermogenesis అనే పదం తెలియదు.తన DNAలో ఏదో మార్పు జరుగుతోందన్న విషయం అసలు తెలియదు. అతనికి తెలిసింది ఒక్కటే. బయట మంచు చంపేస్తోంది. కానీ తాను మాత్రం బతికే ఉన్నాడు.
20,000 సంవత్సరాల క్రితం ఆ మంచు గుహలో మొదలైన ఆ కథకు ఈరోజు కూడా ఒక ఎండ్ క్రెడిట్ పడలేదు. ఒకప్పుడు మనిషిని బతికించిన అదే పరిణామ శక్తి.. రేపటి ప్రపంచంలో ఏం చేయబోతోంది?. అప్పుడు సమస్య చలి. ఇప్పుడు భూమి ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఒకటి అతివేడి. మన భవిష్యత్తుకి తగినట్లుగా మనిషి శరీరంలో ఇప్పుడు ఏ మార్పులు మొదలయ్యాయి? అది తేల్చి చూడాల్సిన విషయం.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








