గాలే టెస్టులో టీమిండియా వ్యూహం ఫ్లాప్..?
శ్రీలంకతో(Ind vs SL) జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న ఒక విచిత్రమైన నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 460 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. పిచ్ పరిస్థితుల దృష్ట్యా, మూడో రోజు ఉదయం లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు టీమిండియా ఓవర్‌నైట్ స్కోరు వద్దే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తుందని అంతా భావించారు. అయితే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill), కోచ్ గౌతమ్ గంభీర్ ద్వయం మాత్రం ఇన్నింగ్స్ డిక్లేర్ చేయకుండా, క్రీజులో ఉన్న టెయిల్ ఎండర్లు కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణలను మూడో రోజు ఉదయం మళ్లీ బ్యాటింగ్‌కు పంపారు.
భారత మేనేజ్మెంట్ ఆశించినట్లుగా ఈ డిఫెన్సివ్ వ్యూహం ఏమాత్రం ఫలించలేదు. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే అదనంగా కేవలం రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ 462 పరుగులకు ఆలౌట్ అయింది. అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో ప్రసీద్ కృష్ణ చివరి వికెట్‌గా వెనుతిరిగాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లతో అదరగొట్టాడు. అంతకుముందు దేవదత్ పడిక్కల్ సాధించిన అద్భుతమైన 167 పరుగుల సాయంతోనే భారత్ ఈ భారీ స్కోరును నమోదు చేయగలిగింది.
ఉదయం పూట లంక జట్టుపై ఒత్తిడి తెచ్చే సువర్ణావకాశాన్ని వదులుకుని, కేవలం రెండు పరుగుల కోసం టెయిల్ ఎండర్లను బ్యాటింగ్‌కు పంపడంపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. మాజీ భారత ఆటగాడు దొడ్డ గణేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “ఇద్దరు టెయిల్ ఎండర్లను పెట్టుకుని మూడో రోజు ఉదయం ఇంకా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?” అంటూ గిల్, గంభీర్ వ్యూహాలను తీవ్రంగా తప్పుపట్టారు. చేతిలో భారీ ఆధిక్యం ఉన్నప్పటికీ భారత్ అనవసరంగా రక్షణాత్మక ధోరణిని అవలంబించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.








