ఏటా డీఎస్సీ నిర్వహణకు కట్టుబడి ఉన్నాం.. అసెంబ్లీలో మంత్రి లోకేష్ ప్రకటన
ఏటా డీఎస్సీ (DSC) నిర్వహణకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వెల్లడించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. మెగా డీఎస్సీ-2025పై అసెంబ్లీ (Assembly)లో లోకేష్ మాట్లాడారు. డీఎస్సీని చాలా బాధ్యతగా తీసుకుని నిర్వహించామన్నారు. ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని తెలిపారు. మొత్తం 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేశామన్నారు. విద్యా వ్యవస్థలో టిడిపి ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసిందన్నారు. టీచర్ల నియామకాలు, బదిలీలు పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు () భావించారని చెప్పారు.
టిడిపి ప్రభుత్వం ఇప్పటివరకూ 1.80 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేసిందన్నారు. తమ ప్రభుత్వం టీచర్లను సింగపూర్ (Singapore), ఫిన్లాండ్లకు పంపిందని, గతంలో వైసిపి ప్రభుత్వం టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టింది అని మంత్రి లోకేష్ విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది. వ్యవస్థను ఎవరైనా ప్రశ్నించవచ్చు. భిన్నాభిప్రాయాలు ఉన్నవారు కోర్టుల్లో 336 కేసులు దాఖలు చేశారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ అమలు అమలు చేయాలని కోర్టు స్పష్టంగా చేప్పింది. డీఎస్సీలో ఇలాంటి రిజర్వేషన్ అమలు దేశ చరిత్రలోనే తొలిసారి అని అన్నారు. అందుకే వేల మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందగా బయటకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలిచారు అని అన్నారు. డీఎస్పీపై జగన్ టీమ్ 11 అనవసర ఆరోపణలు చేస్తోంది. కులం, మతం పేరుతో వైసీపీ రాష్ట్రంలో చిచ్చు పెడుతోంది. జగన్ అసెంబ్లీకి వస్తే, చర్చించడానికి నేను సిద్ధం. ఎక్కడైనా చర్చకు సిద్ధం అని లోకేశ్ ప్రకటించారు.








