దేశీయంగానే ఎల్పీజీ ఉత్పత్తి.. రిలయన్స్ కి బాధ్యత
పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో.. దేశీయంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తి పెంపునకు కేంద్ర ప్రభుత్వం కీలక వ్యూహాన్ని రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 21 ఆయిల్ రిఫైనరీ కంపెనీలు, చమురు/గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ఎల్పీజీ ఉత్పత్తి పరంగా మొదటిసారి లక్ష్యాలను విధించింది. ఇకపై అవి రోజువారీ 63,180 టన్నులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది ఇంతకుముందు రోజువారీ ఉత్పత్తితో పోల్చితే రెట్టింపు కావడం గమనార్హం.
ఇది 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఉత్పత్తి అయిన ఎల్పీజీ కంటే రెట్టింపు కంటే ఎక్కువ. దేశం మొత్తం రోజువారీ వినియోగంలో సుమారు 70 శాతానికి సమానం. సరఫరా కొరత ఏర్పడినప్పుడల్లా ఉత్పత్తి పరిమితులు అమలులోకి వస్తాయని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తిలో అత్యధిక వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ పాత రిఫైనరీకి కేటాయించారు. ఇది రోజుకు 18 వేల టన్నుల వరకు ఎల్పీజీని ఉత్పత్తి చేయాల్సి వుంటుంది.
2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ 33.2 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగించింది. సుమారు రోజుకు 91 వేల టన్నులు. దీనిలో సంవత్సరానికి 13.1 మిలియన్ టన్నులు అంటే సుమారు రోజుకు 35,900 టన్నులు స్థానికంగా ఉత్పత్తి అయ్యింది. మిగిలిన 21.3 మిలియన్ టన్నులు అంటే రోజుకు సుమారు 58,400 టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకున్నారు. సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి భారత్ 90 శాతం ఎల్పీజీని దిగుమతులను హార్మూజ్ జల సంధి ద్వారానే చేసుకుంటోంది.
ఉత్పత్తి షెడ్యూల్ ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యమైన చోట నాఫ్తాను ఎల్పీజీగా మార్చడం, ఫ్లూయిడ్ కాటలిటిక్ క్రాకింగ్ యూనిట్లను అప్ గ్రేడ్ చేయడం వంటి చర్యలను కూడా ప్రభుత్వం పేర్కొంది.








