IPhone: ఐఫోన్ 18 లాంచ్‌కు ముందు భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల కొరత!
టెక్ దిగ్గజం ‘యాపిల్’ (Apple) వార్షిక ఐఫోన్ (IPhone) లాంచ్ ఈవెంట్ సమీపిస్తున్న వేళ భారత మార్కెట్లో ఆసక్తికర, ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే పండగ సీజన్లో షాపింగ్ చేద్దామని సిద్ధమవుతున్న కస్టమర్లకు ఐఫోన్లు, మ్యాక్‌బుక్‌ల లభ్యత పడిపోవడం నిరాశ కలిగిస్తోంది. దేశీయ మార్కెట్లో వీటి సరఫరా భారీగా తగ్గిపోవడంతో, సాధారణంగా రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే డెలివరీలు ఇప్పుడు ఏకంగా వారానికి పైగా సమయం తీసుకుంటున్నాయి. దేశంలోని ఆరు అధికారిక యాపిల్ స్టోర్లలో స్టాక్ భర్తీ చేయడం తీవ్ర ఆలస్యం అవుతోంది. దీనికి తోడు ప్రధాన నగరాల్లోని రిటైలర్ల వద్ద కూడా ఐఫోన్ 15, 16, 17 సిరీస్ మోడళ్లు చాలావరకు స్టాక్ లేకపోవడం గమనార్హం.
విడిభాగాల కొరతే కారణమంటున్న యాపిల్
దేశంలో నెలకొన్న ఈ సరఫరా ఇబ్బందులను యాపిల్ వర్గాలు అంగీకరించాయి. అయితే ఇది కేవలం తమకు మాత్రమే వచ్చిన సమస్య కాదని కంపెనీ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా స్మార్ట్ఫోన్ల (IPhone) విడిభాగాల లభ్యత గణనీయంగా తగ్గడమే దీనికి ప్రధాన కారణమని, తమతో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కూడా ఇదే తరహా సరఫరా కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని యాపిల్ ప్రతినిధులు వెల్లడించారు.
కృత్రిమ కొరత సృష్టిస్తున్న రిటైలర్లు
అయితే మార్కెట్లో కనిపిస్తున్న ఈ ఫోన్ల కొరత వెనుక కేవలం తయారీ సమస్యలు మాత్రమే కాకుండా, వ్యాపారుల ‘లాభాల వ్యూహం’ కూడా దాగి ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా కొత్త ఐఫోన్ (IPhone) మోడల్ మార్కెట్లోకి రాగానే పాత ఫోన్ల ధరలు భారీగా తగ్గుతాయి. కానీ, రాబోయే ‘ఐఫోన్ 18’ మార్కెట్లోకి వచ్చినా ఈసారి పాత ఫోన్ల ధరలు తగ్గకపోవచ్చని, పైగా మార్కెట్లో ఫోన్లు సరిపడా లేకపోవడం వల్ల ఆ డిమాండ్‌తో వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రిటైలర్లు బలంగా భావిస్తున్నారు. అందుకే భవిష్యత్తులో మరింత ఎక్కువ లాభాలకు అమ్ముకోవచ్చనే ఆశతో, తమ వద్ద ఉన్న ఫోన్ల స్టాక్‌ను కస్టమర్లకు అమ్మకుండా దాచి ఉంచుతున్నట్లు (Hoarding) తెలుస్తోంది.
టాప్ సెల్లర్‌గా ఐఫోన్ 17
మార్కెట్ పరిశోధన సంస్థ ‘ఐడీసీ’ (IDC) తాజా గణాంకాల ప్రకారం.. 2026లో భారత మార్కెట్లో యాపిల్ వాటా కొద్దిగా తగ్గినట్లు నమోదైంది. అయినప్పటికీ, ఎన్ని కొరతలు, సరఫరా సమస్యలు ఎదురైనప్పటికీ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (ప్రథమార్థం) దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ‘ఐఫోన్ 17’ (IPhone) మొదటి స్థానంలో నిలవడం యాపిల్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.








