నో డౌట్! ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బెస్ట్ మూవీ…
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5
నిర్మాణ సంస్థలు : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్,
నటీ నటులు : సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు
సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్, సినిమాటోగ్రఫి: నిమిష్ రవి,
ఎడిటర్: నవీన్ నూలీ, ప్రొడక్షన్ డిజైన్: బంగ్లాన్,
ఆర్ట్స్ డైరెక్టర్స్: శివ కామేశ్, జితూ సెబాస్టియన్,
ఫైట్స్: వీ వెంకట్, కొరియోగ్రఫి: విజయ్ బిన్నీ, శేఖర్ మాస్టర్
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: వెంకీ అట్లూరి
విడుదల తేది : 14.08.2026
నిడివి :2ఘంటల 41నిముషాలు
హీరో సూర్య,(Surya) మమితా బైజు (Mamitha Baiju)జంటగా నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్'(Viswanath & Sons). సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా నిన్న (ఆగస్టు 14న) తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి విశేష స్పందన లబించింది. మరి రివ్యూ ఎలా వుందో చూద్దామా?
కథ :
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒలంపిక్‌లో షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్, సంపన్న కుటుంబానికి చెందిన పారిశ్రామికవేత్త. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోతాడు. అయితే కుటుంబానికి వారసుడు లేడని తల్లి నిర్మలమ్మ(రాధిక శరత్ కుమార్) పెళ్లి చేసుకోమని బలంవంతం చేస్తూ ఉంటుంది. ఆమె ఆవేదనను అర్ధం చేసుకొని సరొగసి ద్వారా కొడుకును కంటాడు. కానీ కొడుకు అభయ్‌కి బోన్ మ్యారో రిప్లేస్మెంట్ సర్జరీ అవసరం కావడంతో సరోగసి తల్లి మ్యాడీ (మమితా బైజు)ను సంజయ్ కలుస్తాడు. బోన్ మ్యారో డోనర్‌గా మ్యాడీ ఇండియాకు వస్తుంది. అయితే ఈ క్రమంలో సంజయ్ ప్రవర్తన, మంచితనం చూసి ప్రేమలో పడుతుంది. కానీ ఏజ్ గ్యాప్ అనే ఒకే కారణంగా మ్యాడీ లవ్ ప్రపొజల్‌ను సంజయ్ రిజెక్ట్ చేస్తాడు. సంజయ్ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోవడానికి కారణం ఏమిటి? తండ్రి విశ్వనాథ్ తీసుకొన్న నిర్ణయం సంజయ్ జీవితంపై ఎలాంటి ప్రభావం పడింది? తల్లి నిర్మల కోసం సంజయ్ తన జీవితాన్ని ఎలా త్యాగం చేశాడు? సరోగసి ద్వారా వారసుడిని కన్న సంజయ్‌కు ఎదురైన సమస్య ఏమిటి? సరోగసి మదర్ మ్యాడీతో సంజయ్ రిలేషన్ ఎలా కొనసాగింది? సంజయ్ తన ప్రేమను రిజెక్ట్ చేస్తే మ్యాడీ తీసుకొన్న నిర్ణయం ఏమిటి? తన కుటుంబంలో చెల్లెలి పెళ్లి విషయంలో ఎదురైన సమస్యను సంజయ్ ఎలా పరిష్కరించాడు తన కుటుంబంలో ఉన్న విభేదాలను సంజయ్ ఎలా పరిష్కరించాడు? చివరకు సంజయ్‌తో మ్యాడీ పెళ్లి జరిగిందా? మ్యాడీ లవ్, మ్యారేజ్ ప్రపోజల్‌ను సంజయ్ అంగీకరించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కథ.
నటీ నటుల హవబవాలు :
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ స్టొరీ కాబట్టి సూర్య చాలా సెటిల్డ్ గా తన నటనను కనపర్చాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూర్య మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. సూర్య నటించిన విధానం బాగా ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని మూమెంట్స్ తోనూ సూర్య సినిమాకే హైలైట్ గా నిలిచాడు. రాధిక శరత్‌కుమార్ పాత్ర చనిపోయాక వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అండ్ రవీనా టాండన్ పాత్రతో సాగే సీన్ లోనూ సూర్య నటన అధ్బుతంగా వుండి. హీరోయిన్ గా మమితా బైజు ఇక ఈ సినిమాను పూర్తిగా తనవైపుకు తిప్పుకొన్న వారిలో ఆమెకు ప్రథమ స్థానం లభిస్తుంది. సూర్యతో పోటి పడుతూ సినిమాకు బ్యాక్ బోన్‌గా మారింది. చిలిపిగా, ఎమోషనల్‌గా, రొమాంటిక్‌గా మమితా మరో జోన్లో నటనను ప్రదర్శించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన రాధిక శరత్‌కుమార్, మరో పాత్రలో నటించిన రవీనా టాండన్ టాప్ పెర్ఫార్మెన్స్తో సినిమాకు బలంగా మారారు. సుధ, సర్వదమన్ బెనర్జీ, హర్ష చెముడు, మాథ్యూ వర్గీస్, రఘుబాబు, అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు :
ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఆర్ట్, ఎడిటింగ్ విభాగం పనితీరు చక్కటి సమన్వయంతో బ్రహ్మండంగా పనిచేశాయి. ప్రతీ విభాగం నుంచి దర్శకుడు వెంకీ అట్లూరి రాబట్టుకొన్న అవుట్‌పుల్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సీన్లలో డైలాగ్స్ హృదయాన్ని టచ్ చేయడమే కాకుండా ఎమోషనల్‌గా మారుస్తాయి. కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని స్లో సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
విశ్లేషణ :
ఒలంపిక్ గేమ్స్ లో షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా దర్శకుడు వెంకీ అట్లూరి కథను హై నోట్లో స్టార్ట్ చేశాడు. ఒక్కసారి కథ టేకాఫ్ అందుకొన్న తర్వాత ఏ ఒక్క క్షణంలో కూడా ల్యాండింగ్ అయ్యే ఛాన్సే రాకుండా సినిమాను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఫస్టాఫ్‌లో పూర్తిగా వినోదం, ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసి సినిమాను మంచి ఎంటర్టైనర్గా మార్చాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. సూర్య నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు అలాగే సూర్య పాత్ర తాలూకు ఎమోషన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రం స్లోగా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో సూర్య నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా కుటుంబసమేతంగా చూడతగ్గ చిత్రంగా నిలిస్తుంది. నో డౌట్!








