సెయింట్ లూయిస్‌లో భక్తి పారవశ్యం .. అంగరంగ వైభవంగా శతచండీ సహిత రుద్రయాగం!
అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం, సెయింట్ లూయిస్ హిందూ దేవాలయం వేదమంత్రాల ఘోషతో మార్మోగుతోంది. అక్కడ జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం’ ఐదో రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిసింది. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొని పునీతులయ్యారు.
యాగశాల విశేషాలు..
ఉదయం గోమాత పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు, మహాన్యాస పారాయణం, రుద్ర హోమం , నవగ్రహ హోమాలతో శాస్త్రోక్తంగా సాగాయి. మధ్యాహ్నం చండీ పారాయణం, చండీ హోమం నిర్వహించి, దుర్గాదేవి, సరస్వతీదేవి, గాయత్రీదేవి, మహాలక్ష్మీదేవికి వెయ్యి కమలాలతో అత్యంత వైభవంగా ‘సహస్ర కమలార్చన’ జరిపించారు.

సామూహిక రుద్రాభిషేకం..
ఈ ఐదో రోజు కార్యక్రమాల్లో వెయ్యి మంది భక్తులతో నిర్వహించిన ‘సామూహిక రుద్రాభిషేకం’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి భక్తుడికి మట్టి శివలింగాన్ని , ప్రత్యేక పూజా సామగ్రిని ఆలయ యాజమాన్యం అందించింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. ఉత్తర అమెరికాలో ఒకేసారి ఇంతమంది భక్తులు సామూహికంగా రుద్రాభిషేకంలో పాల్గొనడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్, ఉపాధ్యక్షుడు సాక్షి విజయ్, కార్యదర్శి జంగా కిషోర్, కోశాధికారి పుట్టగుంట మురళీ, మీడియా విభాగ సమన్వయకర్త రాజా సూరపనేని తదితరులు విజయవంతంగా పర్యవేక్షించారు.








