నార్త్ అమెరికాలో నంబర్ వన్ సంస్థ ‘టీటీఏ’.. సంస్థ విజయం వెనక 3 కారణాలను వివరించిన డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల!
చార్లెట్లో జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (TTA) మెగా కన్వెన్షన్ 2026 వేదికగా, డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల టీటీఏ విజయ ప్రస్థానాన్ని, దాని వెనుక ఉన్న కీలక వ్యక్తులను అభినందిస్తూ ప్రసంగించారు. నార్త్ అమెరికా తెలుగు సమాజంలో టీటీఏ ఒక బ్రాండ్ నేమ్‌గా ఎదిగిందని, నంబర్ వన్ ఆర్గనైజేషన్‌గా గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి మూడు ప్రధాన కారణాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
టీటీఏ విజయానికి పునాది సంస్థ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి అని, వారి ఆశీస్సులతోనే కేవలం 11 ఏళ్లలోనే ఈ సంస్థ ఇంతటి స్థాయికి ఎదిగిందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, గత ఐదారు సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేస్తూ సంస్థను ఈ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ విజయపాల్ రెడ్డి సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. వీరిద్దరి కృషితోనే సంస్థ అగ్రగామిగా నిలుస్తోందని ఆయన అన్నారు.
మూడవ ముఖ్యమైన కారణం సంస్థలో ఉన్న ‘యంగ్ లీడర్షిప్’ అని డాక్టర్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. డైనమిక్ ప్రెసిడెంట్ నవీన్ మలిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి, భరత్, ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఈసీ మెంబర్లు వంటి యువత వల్ల సంస్థకు ఎంతో శక్తి లభిస్తోందని ఆయన తెలిపారు. కేవలం అమెరికాలోనే కాకుండా, ఇండియాలో కూడా టీటీఏ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రి బెడ్లు సమకూర్చడం ద్వారా సుమారు 200 మంది ప్రాణాలను టీటీఏ కాపాడిందని, ఈ కృషిలో డాక్టర్ గురువా రెడ్డి సహకారం మరువలేనిదని ఆయన తెలియజేశారు.








