హైకోర్టులో వైకాపాకు మరో ఎదురుదెబ్బ..!
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి హైకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) ఉన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని, అందువల్ల ఈ అభ్యర్థుల ఎంపికను రద్దు చేయాలంటూ వైకాపా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
పిల్ నంబర్ 161/2026 పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. పిటిషనర్ లేవనెత్తిన వాదనలతో ఏకీభవించలేమని స్పష్టం చేస్తూ ఆ వ్యాజ్యాన్ని డిస్మిస్ చేసింది. ఈస్ట్ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గత కొంతకాలంగా మెగా డీఎస్సీ నిర్వహణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మెరిట్ జాబితాల మార్పులు, స్పోర్ట్స్ కోటా రూల్స్ ఉల్లంఘనలు, హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు తీరుపై ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు.
ఈ నియామకాల వల్ల లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఈ పిల్‌ను కొట్టివేయడంతో విద్యాశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లోనూ ఉన్న ఆందోళనలు తొలగిపోయాయి. మరోవైపు, హైకోర్టు నిర్ణయంపై వైకాపా లీగల్ సెల్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.








