ఐశ్వర్య రాజేశ్ ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ రివ్యూ
Rating: 2.75/5
—సూర్య ప్రకాష్ జోశ్యుల
1980-90ల నేపథ్యంలో సముద్ర తీరంలోని పోర్ట్ ఏరియాలో సాగే కథ ఇది. బతుకుదెరువు కోసం భార్య, కూతురుతో కలిసి ఇసకపట్నం పోర్ట్ ప్రాంతానికి వలస వస్తాడు నాయుడు (సముద్రఖని). సాధారణ కూలీగా జీవితం ప్రారంభించిన అతనిలో అధికార కాంక్ష,క్రూరత్వం అధికం. తన ఎదుగుదల కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం.
దాంతో ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది కాలానికే లోకల్ మత్స్యకారుల నాయుకుడు చిన్నారావు (రాజీవ్ కనకాల)ని హత్య చేసి పోర్ట్ ఏరియాను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటాడు. స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాలు, రౌడీయిజంతో ఎదురులేని శక్తిగా ఎదుగుతాడు.
ఇక నాయుడుకో కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్). తండ్రికి రివర్స్ ఆమె. చాలా మంచి అమ్మాయి. హింసకు దూరంగా ఒక ఎన్జీవో ద్వారా పేదలకు సాయం చేస్తూంటుంది. కారు డ్రైవర్ సూరి (సుదాకర్ కోమాకుల)ని ప్రేమిస్తూంటుంది. అయితే తండ్రి తన రాజకీయ సమస్యలు తొలిగించుకోవటానికి ప్రతాప్ వర్మ ( రవి వర్మ) కి తనను ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడని తెలుసుకుంటుంది.
అప్పుడు భారతి ఏం చేసింది. తండ్రి కు వ్యతిరేకంగా ఎలాంటి గేమ్ ఆడింది…నాయుడు అప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు. ఈ కథలో ‘పోతన’ (జ్వాలా కోటి) పాత్ర ఏమిటి.. పోలీసు అధికారి వర్మ (సునీల్), పెద్దన్న (నరేష్ అగస్త్య) పాత్రలు ఏమిటి? ఈ కథలో అసలు హీరో ఎవరు…చివరకు ఈ కథ ఎలా ముగిసింది అనేది తెలియాలంటే ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఈ కథలో హీరో భారతి. అయితే అది మనకు చివరి దాకా తెలియదు. భారతి…దర్శకుడు దాచిన ట్రంప్ కార్డ్ అని అర్దమయ్యే సరికే సీరిస్ పూర్తవుతుంది. ఇది ఎందుకు జరిగింది?
ఇసకపట్నంలో మొదటి నుంచి మనం ఎక్కువగా నాయుడు ప్రపంచాన్నే చూస్తాం. అతని ఎదుగుదల, అతని సామ్రాజ్యం, అతని నిర్ణయాలు… అన్నీ అతని కోణంలోనే జరుగుతాయి. భారతి మాత్రం ఎక్కువసేపు ఒక రహస్యమైన పాత్రగా మాత్రమే ఉంటుంది. ఆమె ఏమనుకుంటోంది? ఎందుకు మౌనంగా ఉంది? ఆమె అసలు లక్ష్యం ఏమిటి? ఇవన్నీ ప్రేక్షకుడికి తెలియవు.
దీని వల్ల ఒక పెద్ద సమస్య వస్తుంది. కథలో అసలు హీరో భారతి అయితే, స్క్రీన్‌ప్లేలో ప్రేక్షకుడు ఆమెతో కలిసి ప్రయాణించడు. ప్రేక్షకుడు ఆమెను observe చేస్తాడు. కానీ experience చేయడు. ఇదే తేడా. ట్విస్ట్ కోసం దాచిన పాత్ర… ఎమోషన్ ని అందుకోలేకపోయింది.
దర్శకుడు చివర్లో “భారతి అసలు మాస్టర్‌మైండ్” అనే ట్విస్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ప్రతి ట్విస్ట్‌కు ఒక రేటు ఉంటుంది. ఆ ధర ఇక్కడ Emotional Attachment. ప్రేక్షకుడు మొదటి నుంచే భారతి అంతర్గత సంఘర్షణను చూస్తూ వచ్చి ఉంటే… తండ్రిని ఎందుకు ద్వేషిస్తోంది? ఎందుకు ఎదురు తిరగడం లేదు? ఎందుకు ఎదురు చూస్తోంది? అనే విషయాలు తెలిసి ఉంటే, క్లైమాక్స్‌లో ఆమె విజయం వ్యక్తిగత విజయంలా అనిపించేది.
కానీ ఇప్పుడు క్లైమాక్స్‌లో ఒక్కసారిగా ఆమె మాస్టర్ మైండ్ బయటపడుతుంది. చూసే మనం ఆశ్చర్యపడతాం. కానీ అంతగా ఎమోషనల్‌గా కదలం. ఆమె క్లైమాక్స్‌లో హీరో అయినా, ప్రేక్షకుడి మనసులో ఆమె హీరోగా ఎదగడానికి కావాల్సిన ప్రయాణం కనిపించదు.
ఈ సిరీస్‌లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దర్శకుడు చాలా పాత్రలు రాశాడు. కానీ… అన్నింటికంటే సముద్రఖని వ్యక్తిత్వమే భారీగా కనిపిస్తుంది. మిగతా పాత్రలు ఆయన చుట్టూ తిరుగుతున్నట్లే అనిపిస్తాయి. ఓ రకంగా సముద్రఖని… మిగతా పాత్రలన్నింటినీ మింగేసాడు.
అలాగే “మొదటి మూడు ఎపిసోడ్లు స్లో అనిపిస్తుంది.” కానీ అసలు సమస్య అది కాదు. అవన్నీ Information Scenes కావటమే సమస్య. ఒక్కో పాత్రను జాగ్రత్తగా పరిచయం చేస్తూ వెళ్తాడు. ఈ పరిచయాలు కథను ముందుకు నడపవు. కేవలం ప్రపంచాన్ని మాత్రమే చూపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో ప్రేక్షకుడిని ముందుకు నడిపేది సమాచారం కాదు. కాంప్లిక్ట్.
ఫైనల్ ధాట్:
ఏవో కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ఫుల్ పెర్ఫార్మన్స్ కోసం ఇసకపట్నం వెబ్ సిరీస్ చూడవచ్చు.
ఎక్కడ చూడాలి?
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.
RUNTIME Runtime: 3h 40m (7 Episodes)








