రిషభ్ పంత్ సరికొత్త చరిత్ర.. ఎంఎస్‌ధోనీ ఆల్-టైమ్ రికార్డు బద్దలు..!
భారత క్రికెట్ జట్టు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishab Pant) టెస్ట్ క్రికెట్లో సంచలన రికార్డు నమోదు చేశాడు. స్వదేశంలోనే కాకుండా విదేశీ గడ్డపై కూడా తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన రికార్డును పంత్ తిరగరాశాడు. శ్రీలంక(Ind vs srilanka) పర్యటనలో భాగంగా కొలంబోలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. విదేశాల్లో లేదా న్యూట్రల్ వేదికలపై జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో వికెట్ కీపర్‌గా అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా రిషభ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ విదేశీ వేదికలపై 2,496 పరుగులు చేయగా.. తాజా ఇన్నింగ్స్ ద్వారా పంత్ 41.68 సగటుతో 2,501 పరుగులు పూర్తి చేసి ధోనీని వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో ఫరూక్ ఇంజనీర్ (1,209), సయ్యద్ కిర్మాణి (1,109), కిరణ్ మోరే (901) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. నిజానికి ఈ మ్యాచ్ మొదటి రోజు ఆటలో లంక పేసర్ లాహిరు కుమార వేసిన షార్ట్ పిచ్ డెలివరీ పంత్ ఎడమ చేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన పంత్, కేవలం 3 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు.
అయితే, రెండో రోజు లంక బౌలర్ అసిథ ఫెర్నాండో దాటికి భారత్ ఆరో వికెట్ కోల్పోయిన తరుణంలో పంత్ పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ బ్యాటింగ్‌కు దిగాడు. మైదానంలోకి వచ్చిన తర్వాత కూడా శ్రీలంక పేసర్లు పంత్‌ను షార్ట్ పిచ్ బంతులతో పరీక్షించారు. భుజాలపై కొన్ని దెబ్బలు తగిలినా పట్టుదల వీడకుండా నిలబడ్డాడు. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. గాయంతో బాధపడుతూనే పంత్ చూపించిన ఈ తెగువ, సాధించిన చారిత్రాత్మక రికార్డుపై క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది.








