తాళిబొట్లు తెంచారు.. టీడీపీ మహిళా ఎమ్మెల్యే సంచలనం..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp) మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కారుమూరి అరెస్టు కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఆమె గట్టిగా తిప్పికొట్టారు. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) జరిపిన ఈ అరెస్ట్ వెనుక ఎలాంటి రాజకీయ ప్రతీకారాలు లేవని, ఇది కేవలం వారు గతంలో చేసిన పాపాల ఫలితమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాసుల కక్కుర్తి కోసం, అవినీతి సంపాదన కోసం కారుమూరి నాగేశ్వరరావు మరియు ఆయన అనుచరులు ఏకంగా 30 వేల మంది పేద మహిళల తాళిబొట్లు తెంచేలా ప్రవర్తించారని ఆరోపించారు. అంతమంది మహిళల కన్నీళ్లకు, శాపనార్ధాలకే ఇప్పుడు వారు అనుభవిస్తున్న పరిస్థితులు కారణమని మండిపడ్డారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ నిష్పక్షపాతంగా తన పని తాను చేసుకుపోతుంటే.. దానికి కులం రంగు, రాజకీయ కక్షసాధింపు రంగు పులమడం తగదని గళ్లా మాధవి హితవు పలికారు. తప్పు చేసిన ప్రతిసారీ చట్టం నుంచి తప్పించుకోవడానికి వైసీపీ నేతలు ఇలాంటి సాకులు వెతకడం అలవాటుగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. దర్యాప్తు సంస్థల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే, తాము వెనుకబడిన వర్గాలమంటూ లేదా రాజకీయ వేధింపులంటూ సరికొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. చట్టం ముందు ఎవరైనా ఒకటేనని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని గళ్లా మాధవి స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ఎన్ని అబద్ధాలు చెప్పినా, విచారణను పక్కదారి పట్టించాలని చూసినా ప్రజలు ఇప్పుడు ఆ విషయాలను నమ్మే పరిస్థితిలో లేరని ఆమె తేల్చి చెప్పారు.








