ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం.. పరవశింపజేసిన కల్యాణ మహోత్సవం!
అమెరికా మిస్సోరి రాష్ట్రంలోని ‘ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్’ వేదికగా ఆరు రోజుల పాటు నిర్వహించిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం దివ్యమైన పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. లోక కల్యాణం, విశ్వశాంతి, సనాతన ధర్మ పరిరక్షణ, ప్రజల ఆయురారోగ్యాలు , సిరిసంపదల అభివృద్ధే ధ్యేయంగా ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాలుపంచుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతిరోజు ఉదయం గోపూజతో మొదలయ్యే వైదిక క్రతువులు.. మహాన్యాస పారాయణం, చండీ హోమం, రుద్రహోమం, వారాహి, అరుణ అలాగే రాజశ్యామల హోమాలతో యాగశాల మొత్తం దివ్య తేజంతో ప్రకాశించింది. ముఖ్యంగా రెండో రోజు ఏర్పాటు చేసిన దశసహస్ర మోదక హోమం అందరి దృష్టిని ఆకర్షించింది. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పది వేల మోదకాలను ఆలయ స్వచ్ఛంద సేవాకులు ఎంతో భక్తిభావంతో స్వయంగా రూపొందించడం ఈ యాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మహా రుద్రాభిషేకం…
యాగానికి ముగింపు పలికే ఆఖరి రోజు అత్యంత పవిత్ర వాతావరణంలో, భావోద్వేగాల నడుమ సాగింది. సంకల్పకర్తలు , స్పాన్సర్ల ఆధ్వర్యంలో పవిత్ర కలశాలతో యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఆ మంత్రోచ్ఛారణలతో కూడిన జలాలతో శివుడికి వైభవంగా మహా రుద్రాభిషేకం చేపట్టారు. అనంతరం దీక్షాధరులైన భక్తులకు శాస్త్రోక్త పద్ధతిలో అవభృత స్నానం పూర్తి చేయించారు. శివారాధన, అర్చన, వేద పఠనం, మంత్రపుష్పం జరిపిన సమయానికి పూర్ణాహుతి వేళ వర్షం కురవడం అక్కడివారందరిని ఆశ్చర్యపరిచింది. దీనిని దైవానుగ్రహంగా, యాగ పరిపూర్ణతకు శుభ సూచకంగా పండితులు అభివర్ణించారు.
ఈ సందర్భంగా వారు అందించిన అమూల్యమైన ప్రవచనాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచాయి. ఇక సాయంత్రం వేళ ఆలయ ధ్వజస్తంభం వద్ద నిర్మించిన సుమారు 90 అడుగుల విశాలమైన ప్రత్యేక వేదికపై అద్భుతమైన షట్ కల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. ఒకే ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణులు, శ్రీ సీతారామచంద్రులు, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ శివపార్వతులు, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అలాగే శ్రీ వేంకటేశ్వర స్వామివార్ల కల్యాణాలను ఒకేసారీ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ అరుదైన కనువిందు దృశ్యాన్ని వీక్షించేందుకు వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ దివ్య ఘట్టం ఆలయ చరిత్రలో నిలిచిపోయింది. తరువాత వేద పండితులు ఈ కల్యాణాల విశిష్టతను వివరించి అందరికీ ఆశీస్సులు అందజేశారు.
ఆలయ నిర్వాహకులకు సత్కారం…
ఈ బృహత్తర యజ్ఞం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వేద పండితులను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఆరు రోజుల పాటు నిరంతరం శ్రమించిన కమిటీ సభ్యులు, వాలంటీర్ల సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. యాగ కమిటీ చైర్మన్ గంగవరపు రజనీకాంత్ మాట్లాడుతూ.. భక్తుల తోడ్పాటు, వాలంటీర్ల నిస్వార్థ త్యాగం, దాతల ఉదార స్వభావం, పండితుల వేదోచ్చారణలే ఈ కార్యక్రమం అపూర్వ విజయం సాధించడానికి మూలమని వెల్లడించారు.
వైస్ చైర్మన్ విజయ్ కె. సాక్షి, కార్యదర్శి జంగా కిషోర్, కోశాధికారి మురళీకృష్ణ పుట్టగుంట, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బైరపునేని సురేంద్రనాథ్, మీడియా కోఆర్డినేటర్ రాజా సూరపనేని తదితరులు ఈ యాగ నిర్వహణలో కీలక పాత్ర పోషించి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆహార కమిటీ చైర్మన్లు రాజేష్ ఎవూరి, సతీష్ లంకల నేతృత్వంలో వందలాది మంది వాలంటీర్లు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకున్నారు. యాగం జరిగే ఆరు రోజుల్లో దాదాపు 25 వేలకుపైగా భక్తులకు క్రమపద్ధతిలో, ఎంతో భక్తిశ్రద్ధలతో మహాప్రసాద వితరణ చేయడం ఈ వేడుకల్లో మరో మైలురాయిగా నిలిచింది. ఇటువంటి బృహత్తర యజ్ఞాలు మన సనాతన ధర్మ వైభవాన్ని, సంస్కృతిని భావితరాలకు సముచితంగా అందిస్తాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
చివరగా భక్తులందరికీ తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం అందజేయగా, వారంతా అంతులేని దైవిక అనుభూతితో తిరుగు పయనమయ్యారు. ఆరు రోజుల పాటు నిత్య వేద మంత్రాలు, హోమగుండాల జ్వాలలు, దేవీదేవతల నామస్మరణలు, సామూహిక ప్రార్థనలతో ఈ నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం ఉత్తర అమెరికా గడ్డపై అత్యంత వైభవోపేతంగా ముగిసింది. భక్తిభావం, సేవానిరతి, ఐక్యత , సంప్రదాయాల కలయికగా సాగిన ఈ మహాయజ్ఞం ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరకాలం నిలిచిపోయే అపురూప జ్ఞాపకంగా మిగిలింది.








