హారర్ కామెడీ: ‘కరక్కం’ మూవీ రివ్యూ!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5
బేవార్స్ తనానికి బ్రాండ్ అంబాసిడర్స్ లాంటి ధనుష్ (శ్రీనాథ్ భాసి), ఖాజా (ప్రవీణ్)మంచి ఫ్రెండ్స్.అంబికా లాడ్జ్ వీళ్ల కేరాఫ్ ఎడ్రస్. ఓ న్యూ ఇయర్ రాత్రి,అదే లాడ్జ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి భారీగా పార్టీ చేసుకుంటారు. కానీ నిషా తలకెక్కాక..ఆ పార్టీ కాస్తా పెద్ద గొడవగా మారుతుంది. ఆ గొడవ నుంచి వీళ్లిద్దరూ తప్పించుకోవడానికి, పక్కనే ఉన్న ఒక పాత స్మశానంలోకి వెళ్తారు. అక్కడే పడుకుంటారు. కొద్దిసేపటికి మత్తు కాస్త దిగి తమ ఇళ్లకు బయిలుదేరుదామనుకుంటారు.
అప్పుడే వారికి అక్కడ ఉన్న ఐదు సమాధులు, వాటిపై మెరుస్తున్న ఇత్తడి శిలువలు కనిపిస్తాయి.ఇక్కడే మన హీరోల మెదడు పాదరసంలా పనిచేస్తుంది. వీటిని “స్క్రాప్‌లో అమ్మితే చాలా డబ్బులు వస్తాయి!” అనే అద్బుతమైన ఆలోచన వస్తుంది. అంతే అరక్షణం ఆలోచించకుండా ఆ శిలువలను బలవంతంగా పీకి తమ జేబుల్లో పెట్టేసుకుంటారు. ఆ కంగారులో ధనుష్ తన గది తాళం చెవిని (కీ) అక్కడే పారేసుకుంటాడు.
తర్వాత రోజు ఆ శిలువలను అమ్మి సొమ్ము చేసుకుందామని స్క్రాప్ బిజినెస్ చేసే వర్గీస్ దగ్గరికి వెళ్తారు. కానీ, సరిగ్గా అదే సమయానికి వర్గీస్ అకస్మాత్తుగా మరణిస్తాడు. దాంతో ఏం చేయాలో పాలుపోక ఆ శిలువలను తమతోనే ఉంచుకుంటారు. పోగొట్టుకున్న ‘కీ’ కోసం మళ్లీ స్మశానానికి వెళ్లిన వీరికి, అక్కడ పోలీసులు ఉండటం చూసి గుండె జారినంత పనవుతుంది.
ఇవి కూడా చదవండి
సైలెంట్ గా జారుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న ఫాదర్ ఒక భయంకరమైన నిజాన్ని చెబుతుంటారు. “ఈ సమాధుల మీది శిలువలను దొంగిలించిన వారిని, ఈ ఐదుగురి ఆత్మలు వదిలిపెట్టవు. పిచ్చివాళ్లను చేసి చంపేస్తాయి”. ఆ మాటలు విన్న ధనుష్, ఖాజాలకు వెన్నులో వణుకు మొదలవుతుంది.
ఇలాంటివి చాలా విన్నాములే అని లైట్ తీసుకుందామనుకునే సమయానికి ఆ దెయ్యాలు నిజంగానే వీళ్లకు కనపడటం మొదలెడతాయి. అప్పుడు ఏమైంది. ఈ కథలోకి పారా సైకాలజిస్ట్ ‘నకుల్’ఎలా వస్తాడు. చివరకు ఆ దెయ్యాలు..వీళ్లను ఏం చేసాయి..ఆ దెయ్యాల బారినుంచి వీళ్లు తప్పించుకున్నారా..ఆఖరకు ఈ కథ ఎటు టర్న్ తీసుకుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
హారర్-కామెడీ అనే ప్రమాదకరమైన జానర్ ..చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే…హారర్‌లో నవ్విస్తే భయం పోతుంది. భయపెడితే కామెడీ చనిపోతుంది. రెండూ ఒకేసారి పనిచేయాలంటే… రైటర్ ఒక తాడు మీద నడిచే కళాకారుడిలా బ్యాలెన్స్ చేయాలి. Karakkamలో…ఈ బ్యాలెన్స్ పూర్తిగా కుదరలేదు.దెయ్యాలు వచ్చినప్పుడు…భయపడాల్సినంత భయం లేదు. కామెడీ జరిగినప్పుడు… కడుపుబ్బా నవ్వే పరిస్థితి లేదు.
అయితే సినిమా ఎందుకు చివరి దాకా చూస్తాం? ఇదే ఇలాంటి కథల్లో మ్యాజిక్.ఈ సినిమా మనల్ని భయపెట్టకపోయినా, ఫుల్ గా నవ్వించకపోయినా Curiosity క్రియేట్ చేస్తుంది. రైటర్ ఒక ప్రశ్న వేసి…దానికి వెంటనే సమాధానం చెప్పడు. హీరోలు ఇద్దరు వెనకా పడే ఆ ఐదు దెయ్యాలు ఎవరు? ఎందుకు చనిపోయారు?ఏ చేస్తే వీళ్ల వెనకపడటం మానేస్తారు. ఈ ప్రశ్నలే సినిమా ఇంజిన్.
ఈ సినిమా ఫస్టాఫ్ సెటప్ స్లోగా మొదలయ్యి సోసో అనిపించినా సెకండాఫ్ బెటర్ అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ అనుకున్న స్దాయిలో పేలలేదు. దర్శకుడు సేఫ్ గేమ్ ఆడేశాడు. మొత్తం సినిమా ఒక కొత్త కాన్సెప్ట్‌తో నడిపించి.. చివరికి మళ్లీ మనం వందసార్లు చూసిన Revenge Flashback దగ్గరకు వచ్చేశాడు.ప్రేక్షకుడు అంటే మనం “ఇంకేదైనా ట్విస్ట్ ఉంటుందేమో…” అని ఎదురుచూస్తాం. కానీ మనకి తెలిసిన సమాధానమే వస్తుంది. అందుకే సినిమా చూడటం పూర్తయ్యాక “బాగుంది…” అనిపిస్తుంది. “వావ్!” అనిపించదు.
చూడచ్చా?
చూడచ్చు… కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని. భయంకరంగా భయపడాలని లేదా కడుపుబ్బా నవ్వాలని చూస్తే మాత్రం కొంచెం నిరాశపడే అవకాశం ఉంది.
ఫైనల్ థాట్ :
ఈ సినిమా చూస్తుంటే రైటర్లు ఐడియాను అనుకుని, సినిమాను మాత్రం దెయ్యాలు (ఘోస్ట్ లు) చేత రాయించారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అంటే ఐడియా కాదు. ఆ ఐడియాను రెండు గంటలు ప్రేక్షకుడిని కూర్చోబెట్టేలా పదునైన స్క్రీన్‌ప్లే తో చెప్పే పద్ధతే. అక్కడే కొంచెం తడబడుతుంది.
ఎక్కడ చూడాలి?
‘సోనీ లివ్’లో తెలుగులో ఉంది.
ఇవి కూడా చదవండి








