AIతో సినిమాల్లో ముందుగా ఎవరి ఉద్యోగాలకి ముప్పు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
సినిమా మొదలైంది…
థియేటర్లో లైట్లు ఆరిపోయాయి.
తెరపై డ్రాగన్ ఎగురుతోంది.
సముద్రం ఉప్పొంగుతోంది.
ఒక కల్పిత ప్రపంచం ప్రేక్షకుడి కళ్ల ముందుకు వస్తోంది. జనం నిశ్శబ్దంగా చూస్తున్నారు. కానీ ఈ నిశ్శబ్దం వెనుక వారికి వినపడని ఓ పెద్ద శబ్దం మొదలైంది.
ఇలాంటి రెండు గంటల మ్యాజిక్ వెనుక… వందల మంది యానిమేటర్లు…VFX నిపుణులు…కంప్యూటర్ గ్రాఫిక్స్ డిజైనర్లు…నెలలు… కొన్నిసార్లు ఏళ్ల తరబడి పనిచేస్తారు.అదే వారి జీవనాధారం. దాన్నే నమ్ముకుని ఉన్నారు. కానీ ఇప్పుడు అదే ప్రపంచాన్ని చాలా చిన్న టీమ్‌తోనే నిర్మించవచ్చని హాలీవుడ్లో కొందరు నిర్మాతలు,స్టూడియో అధినేతలు తేల్చి చెబుతున్నారు.
అంతేకాదు… AI టూల్స్‌తో యానిమేషన్ సినిమా నిర్మాణ ఖర్చు 30% నుంచి 90% వరకు తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలు ఇంకా మొత్తం పరిశ్రమలో రుజువు కాకపోయినా చాలా మందిలో గుబులు మొదలైంది.
ఒకవేళ అవి నిజమైతే? సినిమాలు మాత్రమే కాదు… సినిమా తీసే విధానం కూడా మారిపోవచ్చు.
AI వల్ల ముందుగా ప్రభావం పడే ఉద్యోగాలు ఇవే:
1. జూనియర్ VFX & రోటోస్కోపింగ్ ఆర్టిస్టులు (Rotosocoping & Matchmove)
ఒక సీన్లో గ్రీన్ స్క్రీన్‌ను తీసేయాలన్నా, బ్యాక్‌గ్రౌండ్ మార్చాలన్నా ఇప్పటివరకు వందలాది మంది ఆర్టిస్టులు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేత్తో కట్ చేసేవారు (Rotoscopy). ఇప్పుడు AI టూల్స్ ఈ పనిని కేవలం కొన్ని సెకన్లలో, పర్ఫెక్ట్గా చేసేస్తున్నాయి. కాబట్టి ఎంట్రీ లెవెల్ VFX ఉద్యోగాలకు భారీగా కోత పడే ప్రమాదం ఉంది.
2. 3D మోడలర్స్ & క్యారెక్టర్ డిజైనర్లు (Character & Environment Designers)
ఒక యానిమేషన్ సినిమాకు లేదా గ్రాఫిక్స్ సినిమాకు కావలసిన క్యారెక్టర్లు, బిల్డింగులు, బ్యాక్‌గ్రౌండ్ వాతావరణాన్ని స్క్రాచ్ నుండి డిజైన్ చేయడానికి నెలల సమయం పడుతుంది. కానీ ‘మిడ్‌జర్నీ’ (Midjourney), ‘స్టేబుల్ డిఫ్యూజన్’ లాంటి AI టూల్స్ కేవలం మనం ఇచ్చే కమాండ్స్ (Prompts) బేస్ చేసుకుని అద్భుతమైన డిజైన్లను నిమిషాల్లో ఇస్తున్నాయి. దీనివల్ల బేసిక్ లెవెల్ డిజైనర్ల అవసరం తగ్గుతుంది.
3. రెండరింగ్ & క్లీనప్ టీమ్స్ (Junior Animators)
యానిమేషన్లో క్యారెక్టర్ మూవ్మెంట్స్ అయ్యాక, దానికి లైటింగ్, షేడింగ్ ఇచ్చి ఫైనల్ అవుట్‌పుట్ తీయడాన్ని (Rendering) AI చాలా ఈజీ చేస్తోంది. వందల మంది జూనియర్ యానిమేటర్లు చేసే వర్క్‌ను AI అసిస్టెన్స్‌తో ఒక చిన్న టీమ్ మేనేజ్ చేసే పరిస్థితి వస్తోంది (300 మంది చేసే పని 40 మందితో అవ్వడం అంటే ఇదే).
4. డబ్బింగ్ ఆర్టిస్టులు & వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు
ఇది ఇప్పటికే టాలీవుడ్లో కూడా హాట్ టాపిక్ అయింది. ఒక భాషలోని హీరో వాయిస్‌ను, ఆయన ఒరిజినల్ బేస్ (Voice Texture) మరియు ఎమోషన్ మిస్సవ్వకుండా వేరే ఏ భాషలోకైనా మార్చేసే టెక్నాలజీ (AI Voice Cloning) వచ్చేసింది. దీనివల్ల చిన్న చిన్న క్యారెక్టర్లకు చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టుల, ట్రాన్స్లేటర్ల అవకాశాలు తగ్గొచ్చు.
5. జూనియర్ ఆర్టిస్టులు (Crowd Generation)
భారీ సినిమాల్లో వేలాది మంది జనం ఉండే సీన్స్ (ఉదాహరణకు యుద్ధాలు లేదా సభలు) తీయాలంటే వందల మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి. కానీ ఇప్పుడు AI సహాయంతో కేవలం 50 మందితో సీన్ తీసి, డిజిటల్‌గా వేలాది మంది క్రౌడ్‌ను నిమిషాల్లో సృష్టించేస్తున్నారు.
ఆ ఒక్క సినిమా… హాలీవుడ్ మొత్తాన్ని ఎందుకు ఆలోచనలో పడేసింది?
ఈ చర్చకు కారణం… “స్పేస్ యూనికార్న్” అనే యానిమేషన్ ప్రాజెక్ట్. ఈ సినిమా టీమ్ వేసిన అంచనాలే ఇప్పుడు హాలీవుడ్లో చర్చగా మారాయి.
సాధారణంగా ఒక భారీ యానిమేషన్ సినిమాకు 100 నుంచి 200 మిలియన్ డాలర్లు వరకు ఖర్చవుతుందని పరిశ్రమ అంచనా.అంటే… దాదాపు ₹850 కోట్ల నుంచి ₹1,700 కోట్ల వరకు. కానీ…ఈ ప్రాజెక్ట్‌ను…15 మిలియన్ డాలర్లతో… సుమారు 40 మంది టీమ్‌తో…రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వారి మాటల్లో…
“ఐదేళ్ల క్రితం ఇది అసాధ్యం. ఇప్పుడు AI వల్ల ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది.” అని. ఇది ఒక ప్రాజెక్ట్ లక్ష్యం మాత్రమే. కానీ… ఈ లక్ష్యం నిజమైతే …సినిమా పరిశ్రమలో ఒక పెద్ద మార్పుకు నాంది కావచ్చని చర్చ మొదలైంది.
అసలు భయం AI కాదు… కనిపించని వేలాది ఉద్యోగాలు
AI గురించి మాట్లాడితే…మనం కొత్త టూల్స్ గురించి ఆలోచిస్తాం.కానీ హాలీవుడ్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ మాత్రం…వేలాది VFX, యానిమేషన్ నిపుణుల భవిష్యత్తు గురించి.
ఈ రోజు హైదరాబాద్‌లోని VFX, యానిమేషన్ స్టూడియోల్లో వేలాది మంది పనిచేస్తున్నారు. హాలీవుడ్లో మొదలైన ఈ ప్రయోగాలు…రేపు టాలీవుడ్లో కూడా వేగం అందుకుంటే…
పని చేసే విధానం మారుతుందా?
టీమ్‌లు చిన్నవుతాయా?
లేక కొత్త రకాల ఉద్యోగాలు పుడతాయా?
ఇప్పుడే ఎవరి దగ్గరా సమాధానం లేదు.
కానీ…ఈ ప్రశ్నను మాత్రం ఎవరూ విస్మరించలేరు. అయితే… ఇది భయపడాల్సిన కథ మాత్రమే కాదు ఈ కథకు మరో వైపు కూడా ఉంది.
ఇప్పటివరకు ప్రపంచ స్థాయి యానిమేషన్ సినిమా తీయాలంటే…Disney, Pixar, DreamWorks… లాంటి భారీ స్టూడియోలే ముందుండేవి. ఎందుకంటే భారీ బడ్జెట్, భారీ టీమ్, భారీ వనరులు వాళ్ల దగ్గరే ఉండేవి.
కానీ AI టూల్స్ నిజంగా ఆశించిన ఫలితాలు ఇస్తే…
ఒక చిన్న స్టూడియో…ఒక ఇండిపెండెంట్ దర్శకుడు…ఒక చిన్న క్రియేటివ్ టీమ్ కూడా…ప్రపంచ స్థాయి విజువల్స్‌తో సినిమా తీయగలదని భావిస్తున్నారు.
అంటే…
AI కొందరికి సవాల్ కావచ్చు.మరికొందరికి జీవితంలోనే అతిపెద్ద అవకాశం కూడా కావచ్చు. అందుకే ఇండస్ట్రీ రెండుగా విడిపోయింది
AIపై అందరి అభిప్రాయం ఒకేలా లేదు.Amazon ప్రకటించిన కొన్ని AI ఆధారిత యానిమేషన్ ప్రాజెక్టులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మనుషుల సృజనాత్మకతను తగ్గిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ వివాదాల మధ్య…ఒక దర్శకుడు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
మరోవైపు…
Pixarలో పనిచేసిన కొంతమంది అనుభవజ్ఞులు మాత్రం AIని శత్రువుగా కాదు…కొత్త పెయింట్ బ్రష్‌గా చూస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం AI మనిషిని పూర్తిగా భర్తీ చేయదు. మనిషి ఊహాశక్తిని మరింత వేగంగా, విస్తృతంగా ఉపయోగించుకునే అవకాశం ఇస్తుంది.
అసలు ప్రశ్న ఇప్పుడు మారిపోయింది. AI ఇప్పటికే…యానిమేషన్లో ఉంది. డబ్బింగ్లో ఉంది. సంగీతంలో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్‌లో ఉంది. అందుకే…ఇప్పటి ప్రశ్న…”AI ఏమి చేయగలదు?” కాదు. ఇప్పటివరకు మనుషులు చేసిన పనిలో ఎంత భాగాన్ని AI చేపడుతుంది?. “మనిషి సృజనాత్మకతకు ఎక్కడివరకు ప్రత్యామ్నాయం ఉంటుంది?” అనే ప్రశ్నలే.
కొత్త ఉద్యోగాలు వస్తాయి:
ఒకప్పుడు కంప్యూటర్లు వచ్చినప్పుడు టైపిస్టుల ఉద్యోగాలు పోయాయి కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనే కొత్త రంగం పుట్టుకొచ్చింది. అలాగే రేపు సినిమా ఇండస్ట్రీలో ‘AI ప్రాంప్ట్ ఇంజనీర్లు’, ‘AI కంటెంట్ క్యురేటర్లు’ లాంటి కొత్త ఉద్యోగాలు వస్తాయి.
చివరి సీన్…
ఒకప్పుడు కెమెరా సినిమా ప్రపంచాన్ని మార్చింది.
తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ మార్చాయి.
ఇప్పుడు AI కూడా మరో పెద్ద మలుపు కావచ్చని కొందరు భావిస్తున్నారు.
అది నిజమవుతుందా? లేక…అంచనాలకే పరిమితమవుతుందా? దానికి సమాధానం చెప్పడానికి ఇంకా సమయం ఉంది. కానీ…హాలీవుడ్లో మొదలైన ఈ చర్చ ఇప్పటికే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది.
రేపటి సినిమా కోసం పోటీ ఇక కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లలో మాత్రమే ఉండకపోవచ్చు. సినిమా వెనుక పనిచేసే మనిషి సృజనాత్మకతకు… AI సామర్థ్యానికి మధ్య కూడా ఉండొచ్చు.
ఆ కథకు మొదటి అధ్యాయం ఇప్పుడే ప్రారంభమైంది.
AI మీ ఉద్యోగాన్ని లాక్కోదు… కానీ AI వాడటం తెలిసిన మరో మనిషి మీ ఉద్యోగాన్ని లాక్కోవచ్చు








