డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, 3.5 గంటల పాటు భారీ ఆపరేషన్..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) ముంబైలో నిర్వహించిన కుడి భుజం శస్త్రచికిత్స విజయవంతం అయింది. గత కొంతకాలంగా తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన శనివారం ముంబైలోని(Mumbai) ఆసుపత్రిలో చేరారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని నిపుణులైన వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
వైద్య పరీక్షల్లో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ‘రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ’ (కండరాలు చిట్లడం) అయినట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. దీనితో పాటు అదే భుజానికి ‘అవల్షన్ ఫ్రాక్చర్’ కూడా ఉండటంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఈ రెండు తీవ్రమైన సమస్యల కారణంగానే వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి ఈ భారీ శస్త్రచికిత్సను నిర్వహించాల్సి వచ్చింది. సుదీర్ఘంగా సాగిన ఈ ఆపరేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రికవరీ రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, నిపుణులైన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి మరికొంత కాలం విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సక్సెస్ అయిందనే వార్త తెలియడంతో అటు జనసేన శ్రేణులు, మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ రాజకీయ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘గెట్ వెల్ సూన్’ అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.








