గాన కోకిల ఎస్. జానకి కన్నుమూత
తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు కోట్ల మంది ప్రేక్షకులను మైమరపించిన లెజెండరీ సింగర్, గానకోకిల ఎస్. జానకి(S. Janaki) ఇకలేరు. ఈ విషయాన్ని జానకి మనవరాలు అప్సర వైద్యుల సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ‘నా ప్రియమైన అమ్మమ్మ, లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్. జానకి గారు కన్నుమూశారని తీవ్ర విచారంతో పంచుకుంటున్నాను. కుటుంబ సభ్యుల ప్రేమ మధ్య ఆమె ప్రశాంతంగా చివరి శ్వాస విడిచారు. తీవ్ర బాధలో ఉన్న ఈ కష్టసమయంలో మా కుటుంబానికి కావలసిన ప్రైవసీని గౌరవించాలని అందరినీ కోరుతున్నాను. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకుని, నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. 1957లో తమిళ చిత్రం ‘విధియిన్ విలయాత్తు’ ద్వారా నేపథ్య గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది ‘ఎమ్మెల్యే’ చిత్రంలో ‘నీతియే జయమౌనురా’ అనే పాట పాడారు. చిన్న పిల్లల గొంతు నుండి ముసలివారి వరకు ఏ వయసు పాత్రకైనా సరిపోయేలా తన స్వరంలో మార్పులు చేయడం ఆమె ప్రత్యేకత. లెజండరీ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళ గీతాలు భారతీయ సంగీత చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. దక్షిణ భారత గానకోకిలగా పేరుగాంచిన ఆమె అన్ని భాషల్లో కలిపి ఆమె సుమారు 50 వేలకు పైగా పాటలను పాడారు.








