అదిరిపోయేలా ‘మాటా’ మహాసభల తొలిరోజు వేడుకలు
అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజాన్ని ఒకే తాటిపైకి తెస్తూ ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెండో కన్వెన్షన్ మహాసభలు-2026 అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో జూన్ 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ మైలురాయి లాంటి వేడుకలకు సర్వం సిద్ధం చేయగా, తొలిరోజైన జూన్ 19న వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని తెలుగు సంస్కృతిని, ఐక్యతను చాటిచెప్పేలా సాగిన ఈ మొదటి రోజు కార్యక్రమాల్లో వేలాది మంది భారతీయ అమెరికన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మాటా సంస్థ సేవ, సంస్కృతి, సమానత్వం అనే పునాదిపై పనిచేస్తుండగా, అందుకు తగ్గట్టుగానే ఈ మహాసభలు ఆ విలువలనే ప్రతిబింబించేలా విభిన్న కార్యక్రమాలతో రూపుదిద్దుకున్నాయి. మన భావి తరాలు తెలుగు గొప్ప సంస్కృతీ సంప్రదాయాలను గర్వంగా ముందుకు తీసుకెళ్లేలా ఈ వేడుకలు స్ఫూర్తిని నింపుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
సినీ ప్రముఖుల హంగామా..
ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద హాజరై ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది ప్రముఖ సినీ, టెలివిజన్ తారలు ఈ వేదికపై సందడి చేస్తున్నారు. యాంకర్ సుమ కనకాల, నటి ఐశ్వర్య రాజేష్, స్వాతి రెడ్డి , అలీ తదితరులు పాల్గొన్నారు. వినోద కార్యక్రమాలలో భాగంగా సింగర్ రామ్ మిరియాల ప్రత్యేక సంగీత విభావరితో ప్రేక్షకులను అలరించారు. సింగర్లు సమీరా భారద్వాజ్, రీటా , రామచారి తదితరులు తమ గళంతో ఈ వేదికపై జోష్ నింపారు.








