గంభీర్ నన్ను ‘దేశద్రోహి’ అన్నాడు: శ్రీశాంత్..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gambhir), మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్(Sreeshanth) మధ్య గతంలో జరిగిన వివాదం మళ్లీ సంచలనంగా మారింది. 2023 డిసెంబర్లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య మైదానంలో పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో గంభీర్ నన్ను ‘ఫిక్సర్’ అని దూషించాడని శ్రీశాంత్ ఆరోపించగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ గొడవకు సంబంధించిన మరికొన్ని సంచలన నిజాలను ఆయన బయటపెట్టాడు. ఆ సమయంలో గంభీర్ తనను ‘దేశద్రోహి’ అని కూడా పిలిచాడని శ్రీశాంత్ ఆరోపించాడు.
ఆ మ్యాచ్‌లో గంభీర్ క్రీజ్ వదిలి ముందుకు వచ్చి తొలి బంతికే ఫోర్ కొట్టాడని, దానికి సమాధానంగా తాను తర్వాతి బంతిని బౌన్సర్‌గా వేశానని శ్రీశాంత్ వివరించాడు. ఆ బౌన్సర్ వేసిన వెంటనే గంభీర్ తన వైపు చూస్తూ.. ‘ఐ ఓన్ యూ’ (I own you) అంటూ అసభ్య పదజాలంతో దూషించాడని పేర్కొన్నాడు. తాను ముందుకు వెళ్లగా.. గంభీర్ నిరంతరాయంగా ఎఫ్-వర్డ్స్ (F-words) వాడుతూ, మళ్లీ మళ్లీ ‘ఫిక్సర్’, ‘దేశద్రోహి’ అంటూ తీవ్రంగా అవమానించాడని శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో విధించిన బ్యాన్‌ను ఆధారంగా చేసుకుని గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ఇద్దరూ టీమిండియా గెలిచిన 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ జట్లలో సభ్యులుగా ఉన్నారు. దేశానికి కలిసి ట్రోఫీలు అందించిన ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య రిలేషన్ ఇలా బూతుల పురాణం దాకా వెళ్లడం క్రికెట్ ప్రేమికులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఒకవైపు శ్రీశాంత్ తనపై చేసిన ఫిక్సింగ్ ఆరోపణల నిషేధాన్ని ముగించుకుని 2020లో మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టగా.. గంభీర్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రీశాంత్ చేసిన ఈ తాజా ఆరోపణలపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంకా ఎలాంటి అధికారిక స్పందన తెలియజేయలేదు.








