విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ మూవీ రివ్యూ – ఒక ఒంటరి తల్లి ఆత్మగౌరవ పోరాటం!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5
వాసవి(స్వాసిక) జీవితంలో దుఃఖం ఒక్కసారిగా రాలేదు. వర్షం కురిసినట్టు కాదు. చెట్టు వేర్లను మెల్లగా తినేసే చెదలాగా వచ్చింది. భర్త చనిపోయిన తర్వాత ఇంట్లో నిశ్శబ్దం పెరిగింది. ఆ నిశ్శబ్దంలో ఇద్దరు పిల్లల ఆకలి శబ్దం మాత్రమే వినిపించేది. భాస్కర్, వివేక్ అనే ఇద్దరు కొడుకుల కోసం వాసవి బతికింది. బతకాలని కాదు… బతకక తప్పలేదు. ఉదయం పనికి వెళ్లే ముందు పిల్లల ముఖాలు చూసేది. సాయంత్రం తిరిగొచ్చాక కూడా వాళ్ల ముఖాలే చూసేది. తన జీవితమంతా వాళ్ల చుట్టూనే తిరుగుతుండేది. తన కోరికలు, తన ఆశలు, తన వయసు… అన్నీ ఎప్పుడో వెనక్కి మిగిలిపోయాయి.
కానీ ఊరు మాత్రం ఆమెను వదల్లేదు.
భర్త లేని ఆడదానికి ఈ సమాజం ఎప్పుడూ ఒక స్థానం ఇస్తుంది. అది గౌరవం కాదు. అనుమానం. ఎవరైనా ఇంటి ముందు ఆగితే కథలు పుడతాయి. రాత్రి లైట్ వెలిగితే మాటలు పుడతాయి. ఆమె ఒంటరిగా నవ్వినా అర్థాలు వెతుకుతారు. ఏడ్చినా కారణాలు కల్పిస్తారు.
వాసవి మొదట్లో బాధపడింది. తర్వాత భరించింది. ఆ తర్వాత అలవాటు పడింది. కానీ మనిషి అలవాటు పడేది నొప్పికి మాత్రమే. అవమానానికి కాదు. ఒక రోజు ఆమె మనసులో ఓ ఆలోచన మెదిలింది. తనకు కూడా ఒక తోడు ఉంటే? ఈ జీవితంలో మిగిలిన రోజులు ఎవరో ఒకరితో మాట్లాడుకుంటూ గడిపితే? ఆ ఆలోచనే మళ్లీ పెళ్లి వైపు తీసుకెళ్లింది.
కానీ ఆ విషయం తెలిసిన భాస్కర్‌కు అది పిడుగులా తగిలింది. తల్లి అంటే తనకు తల్లే. ఆమె కూడా ఒక స్త్రీ అని అంగీకరించే వయసు అతనికి ఇంకా రాలేదు. వివేక్ కూడా అన్నతోనే నిలబడ్డాడు. వాసవి మౌనంగా ఉండిపోయింది. ఆమె జీవితమంతా మౌనమే కాబట్టి.
అయితే కాలం పిల్లలకు కూడా పాఠాలు చెబుతుంది. తల్లి ముఖంలో కనిపించే అలసటను, రాత్రిళ్లు కళ్లలో మిగిలే ఒంటరితనాన్ని, అందరి మధ్య ఉన్నా ఒంటరిగా ఉండే ఆమెను వాళ్లు చూడటం మొదలుపెడతారు. అప్పుడు వాళ్లకు అర్థమవుతుంది. తల్లి అనేది ఒక సంబంధం మాత్రమే కాదు. ఒక మనిషి కూడా.
ఆమెకు కూడా తోడు కావాలి. ఆమెకు కూడా జీవితం ఉంది. అప్పటివరకు తల్లి పెళ్లిని వ్యతిరేకించిన అదే కొడుకులు, ఇప్పుడు ఆమె పెళ్లి కోసం తిరగడం మొదలుపెడతారు. విచిత్రంగా ఈసారి వాసవే వెనక్కి తగ్గుతుంది. ఎందుకంటే తన కోసం పిల్లలు ప్రపంచంతో పోరాడటం ఆమెకు ఇష్టం ఉండదు. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి వస్తాడు ఏడుకొండలు (విజయ్ ఆంటోనీ).
ఆ మనిషి వచ్చిన తర్వాత వాసవి జీవితంలో ఎన్నాళ్లుగానో కనిపించని ప్రశాంతత కనిపిస్తుంది. కానీ ప్రశాంతతను ఈ సమాజం ఎక్కువసేపు సహించదు. ఊరు అడ్డుపడుతుంది. బంధువులు అడ్డుపడతారు. సొంత రక్తమే ఎదురుగా నిలబడుతుంది. ఒక విధవరాలు మళ్లీ నవ్వాలనుకోవడం ఇంత పెద్ద నేరమా అన్న ప్రశ్న కథంతా వెంటాడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ సాగేది వాసవి ప్రయాణం.
ఇంతకీ ఏడుకొండలు ఎవరు? వాసవి జీవితానికి ఎలా దగ్గరయ్యాడు? వారి పెళ్లికి ఊరి పెద్దలు, బంధువులు ఎందుకు అడ్డుపడ్డారు? సొంత తల్లి, సొంత అన్నయ్య కూడా వాసవికి ఎందుకు శత్రువులయ్యారు? చివరకు భాస్కర్, వివేక్‌లు ఏడుకొండలను తమ తండ్రిగా అంగీకరించారా? వాసవి తన జీవితాన్ని మరోసారి మొదలుపెట్టగలిగిందా?
చివరికి ఆమె పెళ్లి జరిగిందా లేదా అన్నదానికంటే… తన జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు దక్కిందా లేదా అన్నదే ఈ కథలో అసలు విషయం. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
నలుగురి కోసం బతుకుతూ తన కోసం బతకడం మరిచిపోయిన ఒక మహిళ కథ గా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఆమె కన్నీళ్ల గురించి కాదు… ఆమె మౌనం గురించి చెప్పే కథ. ఆమె ఓటముల గురించి కాదు… మళ్లీ జీవించాలనుకున్న ధైర్యం గురించి చెప్పే కథగా మలచాలనుకున్నాడు. అయితే ఒకప్పుడు దాసరి గారు, విసు లాంటి దర్శకులు ఇలాంటి కథలను ఎంతో ఆర్తితో చెప్పేవారు. దర్శకుడు శశి కూడా అలాగే చెప్పే ప్రయత్నం చేసారు.
కానీ కథాంశం గతంలో మన తెలుగులో వచ్చిన మా నాన్నకు పెళ్లి, అంతకు ముందు క్రాంతికుమార్ గారు చేసిన స్వాతి, వంటి కథాంశాలను గుర్తు చేయటం కాస్త ఇబ్బంది.ఒకసారి దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ, “ప్రేక్షకుడికి కొత్త కథలు అవసరం లేదు. పాత భావోద్వేగాలను కొత్త కోణంలో చెప్పినా చాలు” అన్నాడు. శశి కూడా ఇక్కడ అదే చేశాడు. రెండో పెళ్లి అనే పాత అంశాన్ని “అమ్మ” కోణంలో చెప్పడానికి ప్రయత్నించాడు.
వాస్తవానికి ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు కథ కంటే ముందుగా దాని కథలోని సెంట్రల్ ఆలోచన గురించి మాట్లాడాలి. ఎందుకంటే “వంద దేవుళ్లు” అనేది ఒక మహిళ రెండో పెళ్లి కథ కాదు. ఒక తల్లి జీవితాన్ని ఆమె పిల్లలు, కుటుంబం, సమాజం ఎలా స్వంతం చేసుకుంటాయో ప్రశ్నించే కథ.
సాధారణంగా ఇలాంటి కథల్లో ప్రధాన పాత్ర కోరిక స్పష్టంగా ఉంటుంది. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సమాజం అడ్డుకుంటుంది. చివరకు ఆమె గెలుస్తుంది. ఇది చాలా సింపుల్ డ్రామాటిక్ లైన్. కానీ ఇక్కడ రచయిత మొదటి కాంప్లిక్ట్( సంఘర్షణ)ను సమాజంలో కాకుండా ఇంట్లో పెట్టాడు.
వాసవి జీవితంలో విలన్ ఊరు కాదు. మొదట తన కొడుకులే. అదే స్క్రిప్టులో పనిచేసిన మొదటి తెలివైన అంశం. ఎందుకంటే ప్రతి ప్రేక్షకుడూ కొడుకుల కోణాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాడు. తమ కోసం జీవితమంతా త్యాగం చేసిన తల్లి ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే అంగీకరించలేకపోవడం వాళ్ల స్వార్థం మాత్రమే కాదు. వాళ్లు పెరిగిన సామాజిక నిర్మాణం ప్రభావం కూడా. అందుకే ఫస్ట్ హాఫ్‌లో ప్రేక్షకుడు పూర్తిగా వాసవి వైపు నిలబడడు. పూర్తిగా కొడుకుల వైపూ నిలబడడు. రెండు వైపులా భావోద్వేగాలు కనిపిస్తాయి. స్క్రీన్‌రైటింగ్‌లో దీనినే “Moral Conflict” అంటారు.అదే ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసారు.
ఫస్ట్ హాఫ్ ఎందుకు నెమ్మదిగా అనిపిస్తుంది?
స్క్రిప్టు నిర్మాణాన్ని గమనిస్తే మొదటి గంట మొత్తం వాసవి బాధలను స్థాపించడానికే వెచ్చించారు. భర్త మరణం…కూలీ పని…సమాజం అవమానాలు…ఊరి అనుమానాలు…ఒంటరితనం… ఇవి అన్నీ కథకు అవసరమైన అంశాలే.కానీ సమస్య ఏమిటంటే ఇవి చాలా సందర్భాల్లో కొత్త సమాచారం ఇవ్వకుండా అదే భావాన్ని మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తాయి.
ప్రఖ్యాత స్క్రీన్‌రైటర్ విలియం గోల్డ్‌మన్ ఒకసారి ఇలా అన్నాడు: “A scene must either move the story forward or deepen character. Ideally both.”
“వంద దేవుళ్లు”లో కొన్ని సన్నివేశాలు వాసవి బాధను మరింతగా చెప్పడానికి మాత్రమే ఉంటాయి. కానీ కథను ముందుకు తీసుకెళ్లవు.దాంతో ప్రేక్షకుడు కథలోకి వెళ్లకుండా, కథ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తాడు. ఇక్కడ రచయిత మరింత కఠినంగా ఎడిట్ చేసుకుని ఉంటే ఫస్ట్ హాఫ్ చాలా బలంగా ఉండేది.
అసలు సినిమా ఎక్కడ మొదలవుతుంది?
స్క్రీన్‌ప్లే పరంగా చూస్తే సినిమా అసలు ప్రారంభం వాసవి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న దగ్గర కాదు. కొడుకులు ఆమె పెళ్లిని వ్యతిరేకించిన దగ్గర. ఎందుకంటే అక్కడే కథకు స్పష్టమైన డ్రామాటిక్ ప్రశ్న ఏర్పడుతుంది. “తమ తల్లి రెండో పెళ్లిని కొడుకులు అంగీకరిస్తారా?” ఈ ప్రశ్నే ప్రేక్షకుడిని ముందుకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత రచయిత చేసిన మంచి పని ఏమిటంటే… కొడుకుల మార్పును ఒక్కసారిగా చూపించలేదు. తల్లి ఒంటరితనం, ఆమె బాధ, ఆమె మౌనం క్రమంగా వాళ్లపై ప్రభావం చూపిస్తుంది. ఈ ట్రాన్సిషన్ వల్లే కథ ఎమోషనల్‌గా పనిచేస్తుంది.
ఏడుకొండలు పాత్ర వర్కవుట్ అయ్యిందా?
విజయ్ ఆంటోనీ పాత్రను రచయిత చాలా తెలివిగా ఉపయోగించాడు. సాధారణ కమర్షియల్ సినిమా అయితే హీరో ఎంట్రీతో కథ మొత్తం అతడి చేతుల్లోకి వెళ్లేది. కానీ ఇక్కడ ఏడుకొండలు సమస్యకు పరిష్కారం కాదు. అతడు ఒక అవకాశమే. ఈ తేడా చాలా ముఖ్యం. వాసవి జీవితాన్ని కాపాడటానికి వచ్చిన మేసయ్యా కాదు అతను. ఆమెకు మరో అవకాశం ఇవ్వగలిగే మనిషి. అందుకే పాత్ర సహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వాసవి-ఏడుకొండలు మధ్య సన్నివేశాలు పెద్ద డైలాగులతో కాకుండా చిన్న చిన్న మానవీయ క్షణాలతో రాసుకోవడం బాగుంది.
సెకండాఫ్ బాగుందా?
ద్వితీయార్థంలో జరిగేదంతా ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. ఊరు అడ్డుకుంటుంది. బంధువులు అడ్డుకుంటారు. తల్లి అవమానాలు ఎదుర్కొంటుంది. చివరికి పెళ్లి జరుగుతుంది. ఇందులో కొత్తదేమీ లేదు. కానీ రచయిత ప్రతి అడ్డంకిని పాత్రల భావోద్వేగాలతో ముడిపెట్టాడు.అందుకే ఆసక్తి కొనసాగుతుంది.
ఎక్కడ బలహీనపడింది?
సినిమా ప్రధాన సమస్య ఏమిటంటే… దాని ఆలోచన రచన కంటే పెద్దది. స్క్రిప్టులో ఉన్న థీమ్ చాలా బలమైనది. కానీ దానికి సరిపడే స్థాయిలో ప్రతీ పాత్ర రాయబడలేదు. ప్రత్యేకంగా భాస్కర్, వివేక్ ప్రేమకథలు మరింత లోతుగా ఉండాల్సింది. ఎందుకంటే రచయిత వాటిని ప్రధాన థీమ్‌తో కలపాలని ప్రయత్నించాడు. ప్రేమించడానికి హక్కు యువతకే కాదు… అమ్మకూ ఉందని చెప్పాలనుకున్నాడు. కానీ ఆ ట్రాక్‌లు మరింత బలంగా ఉండి ఉంటే థీమ్ ఇంకా ప్రభావవంతంగా వచ్చేది.
టెక్నికల్ గా …
తెలుగు డబ్బింగ్ అయినా ఎక్కువ తమిళ నేటివిటీ కనిపిస్తుంది. బాలాజీ శ్రీరామ్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండిపోవు. సినిమాటోగ్రాఫర్ దర్శన్ కిర్లోస్ పల్లెటూరి వాతావరణాన్ని సహజంగా చిత్రీకరించారు. విజయ్ ఆంటోనీ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో, పరిమిత లొకేషన్లతో రూపొందించిన ఈ చిత్రం సింపుల్‌గా, నేల వాసనతో సాగుతుంది.
నటీనటుల్లో…
“వంద దేవుళ్లు” పూర్తిగా స్వాసిక భుజాలపై నడిచే సినిమా. వాసవి పాత్రలో ఆమె నటించలేదు, జీవించింది. ఒంటరి తల్లి బాధ, ఆత్మగౌరవం, భావోద్వేగాలను ఎంతో సహజంగా పలికించింది. విజయ్ ఆంటోనీ సెకండాఫ్‌లో కనిపించినా, తన పాత్రకు అవసరమైనంత మేర హుందాగా నటించారు. భాస్కర్ పాత్రలో అజయ్ దిషాన్ ఆకట్టుకోగా, శక్తి రాజ్, కావ్య అనిల్, లిజోమోల్ జోస్, కరుణాస్ తదితరులు తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.
ఫైనల్ థాట్…
అమ్మను దేవత అంటాం. కానీ దేవతగా చూస్తూ, ఆమెను మనిషిగా చూడటం మాత్రం మర్చిపోతాం. భర్త చనిపోయిన తర్వాత ఒక మగాడు మరో పెళ్లి చేసుకుంటే సహజంగా తీసుకునే సమాజం, అదే నిర్ణయం ఒక మహిళ తీసుకుంటే ఎందుకు ప్రశ్నిస్తుందనే విషయాన్ని “వంద దేవుళ్లు” సూటిగా అడుగుతుంది. కథనం పరంగా కొన్ని లోపాలు ఉన్నా, తల్లి కూడా తన పిల్లల్లాగే కలలు, కోరికలు, ఒంటరితనం ఉన్న మనిషేనని గుర్తు చేసే ప్రయత్నంలో సినిమా హృదయాన్ని తాకుతుంది. సినిమా ముగిసిన తర్వాత గుర్తుండేది విజయ్ ఆంటోనీ కాదు, కథ కూడా కాదు… తమ జీవితాన్ని కుటుంబం కోసం త్యాగం చేసి, చివరకు తమ కోసమే బతకడం మరిచిపోయిన ఎందరో అమ్మల ముఖాలు. అయితే అది గుర్తించటానికి చివరి దాకా చూడగలిగే ఓపిక ఉండాలి. ఎందుకంటే ఈ సినిమా కొన్ని సార్లు డాక్యుమెంటరీ అనిపిస్తుంది. మరికొన్ని సార్లు నెమ్మిదిగా నడుస్తూ సహనానికి కొంతవరకూ పరీక్ష పెడుతుంది.
తల్లి త్యాగాలను పొగడే సినిమాలు చాలా వచ్చాయి. కానీ తల్లి జీవితాన్ని కూడా ఆమెదే అని గుర్తు చేసే సినిమాలు చాలా అరుదు. ఆ అరుదైన ప్రయత్నాల్లో “వంద దేవుళ్లు”ని తప్పకుండా చేర్చొచ్చు.








