ఒకేరోజు 17మంది పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీలు
కోల్ కతాలో మంత్రి లోకేష్ పెట్టుబడుల వేట
కోల్ కతా: వెళ్ళేది ఏ కార్యక్రమమైనా ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేయడమే ఏకైక లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ పని చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ప్లీనరీ సెషన్ లో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ శుక్రవారం కోల్ కతా వెళ్లారు. ఆ కార్యక్రమంలో తమ ప్రసంగం పూర్తయిన వెంటనే పెట్టుబడుల వేట ప్రారంభించారు. మధ్యాహ్నం ప్లీనరీ సమావేశం తర్వాత కేవలం 5 గంటల వ్యవధిలో మంత్రి లోకేష్ 17 మంది పారిశ్రామికవేత్తలను కలిసి తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, అనుకూలతలను గురించి చెబుతూ లోకేష్ చేస్తున్న అభ్యర్థన పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది.








