కోల్ కతాలో జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో మంత్రి లోకేష్
బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి
స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలు
దేశ మేధో, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా కోల్‌కతా
బలమైన బెంగాల్ అంటే బలమైన భారతదేశం
సంస్కరణల అమలులో ఏపీ ముందంజలో ఉంది
ఏపీ అభివృద్ధి ప్రయాణంలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలి
కోల్ కతా: బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయని, స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలని, ఏపీ అభివృద్ధి ప్రయాణంలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కోల్ కతా లోని ఐటీసీ సోనార్ హోటల్ జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ICC) ప్లీనరీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు’ అనే అంశంపై జరిగిన ప్లీనర్ సెషన్ లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మేధావులు, సంపద సృష్టికర్తలు, దేశ నిర్మాణకర్తల సమక్షంలో ఉండడం గౌరవంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన ఒక మాట ఉంది. ఈ రోజు బెంగాల్ ఏం ఆలోచిస్తుందో.. రేపు భారత్ అది ఆలోచిస్తుంది. అందుకే మళ్లీ కోల్‌కతాకు వచ్చి.. మీ అందరి మధ్య ఉండడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా అనిపిస్తోంది. భారతదేశ మేధో, సాంస్కృతిక, ఆర్థిక ప్రయాణానికి కోల్‌కతానే రాజధానిగా నేను భావిస్తాను. బలమైన బెంగాల్ అంటే బలమైన భారతదేశం అని నేను గట్టిగా నమ్ముతున్నాను.
రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే అభివృద్ధి సాధ్యం
గురువారం సాయంత్రం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం నాకు లభించింది. అభివృద్ధి పట్ల వారి అంకితభావం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే భారతదేశం గెలుస్తుందని నేను విశ్వసిస్తాను. పోటీ ఉత్తమ ఫలితాలను తీసుకొస్తుంది. అదే సమయంలో రాష్ట్రాలు కలిసి పనిచేసి.. తమ బలాలను పెంచుకోవాలి. తద్వారా మరింత శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించగలం. ఉద్యోగాల కల్పన విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి గారి సంకల్పం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తున్నారని ఆయన నన్ను నేరుగా అడిగారు. మీరు అనుసరిస్తున్న విధానం ఏమిటని ప్రశ్నించారు. భూమి అనేది ప్రతి భారతీయుడికి భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ రైతులకు వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు ఉద్యోగాల కల్పనతో ముడిపడి ఉందని, మేం వారిని ఒప్పగించగలిగామని చెప్పాను. ప్రస్తుతం భారతదేశం కీలక మలుపులో ఉంది. పశ్చిమ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. తూర్పు దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. మన జనాభా ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకునే సమయం ఇది.
సంస్కరణల అమలులో ఏపీ ముందంజలో ఉంది
మనకు అద్భుతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. మన పొరుగు దేశాల్లో అనిశ్చితి, తరచూ ప్రధానమంత్రులు మారుతున్న పరిస్థితుల్లో.. మన దేశానికి స్థిరత్వాన్ని తీసుకొచ్చిన నాయకత్వం ఆయనది. జాతీయ స్థాయిలో సంస్కరణలను అమలు చేస్తున్న ఆయన.. వాటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్రాలపై విశ్వాసం ఉంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కరణల అమలులో ముందంజలో ఉంది. భారతదేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25శాతం ఏపీకి వస్తున్నాయి.
స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకత
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రత్యేకతలు ఏంటని చాలా మంది నన్ను అడుగుతారు. అందుకు మూడు ‘ఎస్’ లు కారణాలుగా చెబుతాను. మొదటి ‘ఎస్’.. స్పీడ్. పెట్టుబడిదారులు ప్రభుత్వాలను హామీల ఆధారంగా కాదు.. నిర్ణయాలు ఎంత వేగంగా అమలవుతున్నాయనే దాని ఆధారంగా అంచనా వేస్తారు. మేం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దశను దాటి.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అమలుచేస్తున్నాం. ఎందుకంటే పోటీ ప్రపంచంలో వేగమే కొత్త ప్రోత్సాహకం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, వాటిని మరింత వేగంగా అమలు చేయడం అనే సంస్కృతిని మేం నిర్మించాం. 13 నెలల్లోనే భారతదేశ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ ను ఏపీకి తీసుకువచ్చాం. ఒక్క జూమ్ కాల్ ద్వారా ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్ట్ సాధించగలిగాం. పుట్టిపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్ కోసం 600 ఎకరాలు సేకరించి 37 రోజుల్లోనే శంకుస్థాపన చేయగలిగాం.
కస్టమర్ ఈజ్ గాడ్
రెండో కారణం స్టెబిలిటీ. పరిశ్రమలకు అనువైన వాతావారణం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాయని.. విధానాల్లో స్థిరత్వాన్ని కొనసాగిస్తాయని పెట్టుబడిదారులు నమ్మాలి. ఆంధ్రప్రదేశ్ అలాంటి నమ్మకాన్ని అందిస్తోంది. మూడో కారణం సర్వీస్. సాంప్రదాయంగా ప్రభుత్వాలు తమను నియంత్రణ సంస్థలుగా భావిస్తాయి. కానీ మేం మమ్మల్ని సేవలందించే సంస్థలుగా భావిస్తున్నాం. మార్వాడీ సమాజంలో నాకు ఎప్పటినుంచో ఎంతో ఇష్టమైన ఒక భావన ఉంది. అదే ‘కస్టమర్ ఈజ్ గాడ్’. మీరు మా కస్టమర్లు. మీకు సేవ చేయడానికే నేను ఇక్కడ ఉన్నాను.
ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలి
తరతరాలుగా మీరు అద్భుతమైన వ్యాపారాలను నిర్మించారు. ఒక బ్రాండ్‌ను నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు. పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా నిలబెట్టడం ఎంత సవాలుతో కూడుకున్నదో కూడా నాకు తెలుసు. అందుకే మేం మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని, కలిసి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాం. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారికి ఇప్పటికే మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధి విశాఖ ఎకనామిక్ రీజియన్ 10 ఏళ్లలో సాధిస్తుంది. ఏపీలో ఇప్పటికే 24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. పెట్టుబడుల గ్రౌండింగ్ కు కృషిచేస్తున్నాం. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ ను నిర్మిస్తాం. ఆభరణాల తయారీకి సంబంధించి మొత్తం ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తాం. జులైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకోబోతున్నాం.
బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి
జోన్లు, క్లస్టర్ల విధానంలో ముందుకు వెళ్తున్నాం. పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ను నిర్మిస్తున్నాం. ఇప్పుడు మీరు నెలలు, సంవత్సరాలు ఎదురుచూడాల్సిన పనిలేదు. ఒక్కసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మా ప్రాజెక్ట్. ఏపీ శాసనసభ్యుల్లో 50శాతం మంది మొదటిసారి గెలిచిన వారు. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు. నేను చంద్రబాబు గారి కేబినెట్ లో సీనియర్ మంత్రిని. రాష్ట్ర అభివృద్ధికి మేం అంతా కసితో పనిచేస్తున్నాం. మా మధ్య ఎలాంటి ఈగోలు లేవు. ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మీకు కేవలం ఒక వాట్సాప్ దూరంలోనే ఉన్నాను. మనమంతా కలిసి పనిచేసి.. ఒక గొప్ప పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలి. బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి. మనమంతా కలిసి పనిచేసి.. భారతదేశాన్ని మరింత గర్వపడే స్థాయికి తీసుకెళ్లాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ICC) ప్రెసిడెంట్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ సీఎండీ బ్రిజ్ భూషణ్ అగర్వాల్, ఐసీసీ వైస్ ప్రెసిడెంట్, సెంచురీ ప్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశవ్ భజంక, సత్వ గ్రూప్ ఎండీ బిజయ్ అగర్వాల్, ఐసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అంబుజా నియోటియా గ్రూప్ ఈడీ పార్ధీవ్ విక్రమ్ నియోటియాతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.








