హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ :ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్
నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం,
రవిశంకర్, పృథ్వి, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, ప్రీతి సుందర్, శరత్ లోహితశ్వ,
జెమినీ సురేష్, దిల్ రమేష్, మధు నంబియార్, సత్తెన్న, విజయభాస్కర్, అనిల్ రాజ్, శ్రీహర్ష, దేవేందర్, పుష్పారామ్, డీఎస్పీ తదితరులు.
సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో
సినిమాటోగ్రఫీ : ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప, ఎడిటింగ్: అనుగోజు రేణుకా బాబు
సాహిత్యం: సాగర్ నారాయణ, సంజీవ్, చింతల ప్రసన్న రాములు, సుధాకర్ మారియో
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, రవితేజ, కొరియోగ్రఫీ: పైడి రాజు, సన్ రేస్, మెహర్ బాబా
ఆర్ట్ డైరెక్టర్: కె.వి. రమణ, ప్రొడక్షన్ డిజైనర్: కొండపనేని మురళీధర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్
నిర్మాత: బాలకృష్ణ మహారాణా
దర్శకత్వం: సంజీవ్ మేగోటి
విడుదల తేది 12.06.2026
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్, (Varalaxmi Sharath Kumar)నవీన్ చంద్ర,(Naveen Chandra) కృష్ణసాయి, రాగిణి ద్వివేది తదితరులు ప్రధాన పాత్రలో ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ (‘)మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
గర్భిణి మహిళ హత్యతో ప్రారంభమయ్యే ఈ కథ ప్రేక్షకులను మొదటి సన్నివేశం నుంచే ఉత్కంఠలోకి నెడుతుంది. క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ హత్య కేసు సంవత్సరాల పాటు మూలన పడిపోతుంది. డాడీ కావాలంటూ చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతోనే అసలు కథ మొదలవుతుంది. పాప తాను డాడీ అని పిలిచిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతారు. ఒక నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి(వరలక్ష్మి శరత్‌కుమార్) ఈ కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో అసలు కథ మొదలవుతుంది. పోలీస్ అధికారి భర్త డాక్టర్ రామ్ ( నవీన్ చంద్ర ) అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు పోలీస్ అధికారిణి ఏ నిర్ణయం తీసుకుంది. వరుస హత్యల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? వారిని ఎవరు చంపేస్తారు? ఎందుకు చంపేస్తారు? ఈ మరణాల వెనుక నిజంగా అతీంద్రియ శక్తులున్నాయా? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. విచారణలో మూఢనమ్మకాలు, అవినీతి, దాచిపెట్టిన నేరాలు, కర్మ సిద్ధాంతం వంటి అంశాలు బయటపడతాయి. చివరికి నిజం ఏంటన్నది థ్రిల్లింగ్ క్లైమాక్స్‌లో వెల్లడవుతుంది.
నటీనటుల హవబవాలు :
నవీన్ చంద్ర తన పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్యాప్తు అధికారిగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ కథకు బలం చేకూర్చింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. కృష్ణసాయి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతంలో ఆయన ప్రదర్శన అభిమానులను అలరిస్తుంది. రాగిణి ద్వివేది గ్లామర్‌తో పాటు కథకు అవసరమైన ప్రాధాన్యతను తీసుకొచ్చారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి నటులు కామెడీ ద్వారా మంచి రిలీఫ్ అందించారు. వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు పోలీసు పాత్రల్లో నటించిన నటులు జెమిని సురేష్, విజయభాస్కర్ సరదాగా, సీరియస్ గా సాగే పాత్రాల్లో చాలా బాగా నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి సీన్లు, హారర్ ఎపిసోడ్స్‌ను విజువల్‌గా బాగా తీర్చిదిద్దారు. సంగీత దర్శకులు ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన నేపథ్య సంగీతం హారర్ వాతావరణాన్ని మరింత ఎలివేట్ చేసింది. కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం అభిమానులకు మంచి ట్రీట్‌గా నిలుస్తుంది. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్ కథనాన్ని గ్రిప్పింగ్ గా సాగేలా సహాయపడింది. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్ కూడా థ్రిల్లర్ అనుభూతిని పెంచాయి.
విశ్లేషణ:
క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ” అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను హారర్ థ్రిల్లర్ రూపంలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కథలో హారర్, మిస్టరీ, యాక్షన్ అంశాలను సమతుల్యంగా మేళవించడంలో ఆయన విజయం సాధించారు. సినిమా మొదటి భాగం మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగుతుంది, ఇంటర్వెల్ తర్వాత కథ వేగం పెరుగుతుంది. కేసు దర్యాప్తులో బయటపడే రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు కుర్చీలో కట్టిపడేస్తాయి. ముఖ్యంగా హారర్ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కథకు బలంగా నిలుస్తాయి. హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పోలీస్ కంప్లైంట్’ మంచి థియేట్రికల్ అనుభూతిని అందించే చిత్రం. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథతో చెప్పే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.








