టీమిండియాకు మళ్లీ ‘స్వింగ్ కింగ్’ అవసరమా..?
ఇండియన్ క్రికెట్లో ప్రస్తుతం ఎంతో మంది యువ బౌలర్లు వస్తున్నప్పటికీ, పవర్ ప్లేలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ కుమార్(Bhuvaneswar Kumar) స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న భువీ.. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున పాత పదును చూపిస్తూ అద్భుతమైన విధ్వంసం సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో డెత్ ఓవర్లను అద్భుతంగా వేయగల సామర్థ్యం, పవర్ ప్లేలో వికెట్లు తీసే నైపుణ్యం ఇప్పటికీ అతని సొంతం.
ఈ లీగ్‌లో ఏకంగా 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ (Purple cap) రేసులో అగ్రస్థానంలో కొనసాగుతూ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయినా సరే సెలెక్టర్లు అతడిని పదే పదే విస్మరిస్తుండటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. యువ బౌలర్లు లైన్ అండ్ లెంత్ తప్పి భారీగా పరుగులు ఇస్తున్న ప్రస్తుత తరుణంలో, ప్రస్తుత ఐపీఎల్లో 15 మ్యాచ్‌ల్లోనే 26 వికెట్లు పడగొట్టి లీగ్ చరిత్రలోనే అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్ జట్టుకు ఎంతో అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం వయసును ప్రామాణికంగా తీసుకుని అతని ప్రతిభను పక్కన పెట్టడం కరెక్ట్ కాదని క్రీడా విశ్లేషకులు సైతం విమర్శిస్తున్నారు. జాతీయ జట్టుకు అవసరమైన అనుభవం, లీడర్షిప్ క్వాలిటీస్ భువీలో పుష్కలంగా ఉన్నాయి. రాబోయే అంతర్జాతీయ సిరీస్‌లలోనైనా ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ను చూసి ఈ స్వింగ్ మాంత్రికుడిని సెలెక్టర్లు గుర్తిస్తారా, లేక యువ రక్తం పేరుతో అతని అంతర్జాతీయ కెరీర్‌కు శాశ్వతంగా ముగింపు పలుకుతారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.







