శంకర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) ఒకప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో భారీ విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. జెంటిల్మెన్(Gentleman), ఒకే ఒక్కడు(Oke Okkadu), రోబో(Rob0), ఇండియన్(Indian) వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శంకర్, గత కొన్నేళ్లుగా మాత్రం వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయన్నుంచి రీసెంట్ గా రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో నిర్మాతలు భారీ నష్టాలను చవిచూశారు. ప్రస్తుతం ఇండియన్3(Indian3) భవితవ్యంపై కూడా ఇండస్ట్రీలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శంకర్ తదుపరి అడుగు ఏంటి అన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఎప్పటి నుంచో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న వేల్పారి(Velpari) సినిమాను తెరకెక్కించాలని శంకర్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందాల్సిన ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ సినిమాకు నిర్మాత దొరకడం కష్టంగా మారిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టేందుకు నిర్మాతలు వెనుకంజ వేయడం, గత సినిమాల ఫలితాలు ప్రభావం చూపడం వల్ల వేల్పారి ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో ముందుగా తక్కువ టైమ్ లో పూర్తయ్యే యాక్షన్ థ్రిల్లర్ కథను శంకర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సరైన నటీనటులతో పాటు నిర్మాత కోసం కూడా ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. ముఖ్యంగా లైకా ప్రొడక్షన్స్(Lyca Productions)తో ఉన్న విభేదాలు, వరుస డిజాస్టర్ల ప్రభావం కారణంగా ప్రముఖ తమిళ నిర్మాతలు శంకర్‌తో వెంటనే పని చేయడానికి ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ అడ్డంకులను అధిగమించి శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి.







