ఐపీఎల్ విండో మారబోతోందా..? భారీ ప్లానింగ్ తో బీసీసీఐ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ అభిమానులకు సరికొత్త షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వచ్చే మండుటెండల్లో ఐపీఎల్ మ్యాచ్లు చూడటం మనకు అలవాటు. కానీ, భవిష్యత్తులో ఈ షెడ్యూల్ పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ టోర్నమెంట్ను మార్చి-మే విండో నుండి సెప్టెంబర్-అక్టోబర్ విండోకు మార్చే యోచనలో బీసీసీఐ (BCCI) ఉన్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఒక ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి వేసవి కాలంలోనే ఈ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో మే నెలలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండటం ఆటగాళ్లకు, ప్రేక్షకులకు పెద్ద శాపంగా మారింది. మైదానంలో విపరీతమైన వేడి, ఉక్కపోత వల్ల ఆటగాళ్లు తీవ్ర అలసటకు లోనవుతున్నారు. దీనికి తోడు భవిష్యత్తులో అంటే.. 2028 తర్వాత ఐపీఎల్లో జట్లను, మ్యాచ్ల సంఖ్యను మరింత పెంచాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతమున్న 10 జట్లతోనే 74 మ్యాచ్లు నిర్వహించడానికి రెండు నెలల సమయం పడుతోంది.
రాబోయే రోజుల్లో మ్యాచ్ల సంఖ్య 94 కి పెరిగితే, మండుటెండల్లో ఇన్ని మ్యాచ్లు నిర్వహించడం అసాధ్యమని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ విండోను సెప్టెంబర్-అక్టోబర్ నెలకు మార్చడం వెనుక పక్కా కమర్షియల్ ప్లాన్ కూడా ఉంది. భారతదేశంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలు పండుగ వాతావరణాన్ని.. అంటే దసరా, దీపావళి సీజన్ మోసుకొస్తాయి. ఈ పండుగ సీజన్లో కంపెనీలు తమ బ్రాండ్ల ప్రకటనల కోసం భారీగా ఖర్చు పెడతాయి. కాబట్టి ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే అడ్వర్టైజర్లు, బ్రాడ్కాస్టర్లు మరియు బీసీసీఐకి మునుపెన్నడూ లేని స్థాయిలో అదనపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. బ్రాడ్కాస్టింగ్ టెండర్లను మళ్లీ సమీక్షించేటప్పుడు ఈ కొత్త విండో మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటామని ధుమాల్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి







