అమరావతి రైతుకు ఏపీసీఆర్డీఏ ఘన సత్కారం..!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదని ఏపీసీఆర్డీఏ (APCRDA) స్పష్టం చేసింది అంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. రాజధాని స్థాపన కోసం తమ వంతుగా ఏకంగా 16.70 ఎకరాల వ్యవసాయ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అందజేసిన అసాధారణ రైతు చింతల శ్రీరామమూర్తిని ఏపీసీఆర్డీఏ కమిషనర్ అధికారికంగా ఘనంగా సత్కరించారు.
భూసమీకరణ (Land Pooling) నిబంధనల ప్రకారం.. భూములు ఇచ్చిన రైతులకు తిరిగి కేటాయించే ప్లాట్ల ప్రక్రియలో భాగంగా చింతల శ్రీరామమూర్తికి ఈ-లాటరీ (E-Lottery) పద్ధతి ద్వారా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా 11 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించింది. దీనికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికెట్లను (Provisional Certificates) కమిషనర్ విజయరామరాజు స్వయంగా సదరు రైతుకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామమూర్తిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించి అధికారులు తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఏపీసీఆర్డీఏ వర్గాలు అమరావతి రైతులపై ప్రశంసల జల్లు కురిపించాయి. ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాబోయే తరాల ప్రగతి కోసం తమ గుండెకాయ లాంటి భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించిన అమరావతి రైతుల త్యాగం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అధికారులు కొనియాడారు. రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు, రైతులకు చెందాల్సిన అన్ని రకాల ప్లాట్ల కేటాయింపులు మరియు మౌలిక వసతుల కల్పనను సకాలంలో పూర్తి చేయడానికి ఏపీసీఆర్డీఏ నిరంతరం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి







