ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
విదేశాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరులు, ప్రవాసాంధ్రుల (NRIs) సమస్యల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే వారి ఇబ్బందులను, అలాగే అక్కడ నివసిస్తున్న తెలుగు వారి సమస్యలను నేరుగా జిల్లా స్థాయిలోనే పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో ‘మైగ్రేషన్ మేనేజ్మెంట్ కేంద్రాలను’ (Migration Management Centres) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి జిల్లా కలెక్టరేట్లోనూ ఒక ప్రత్యేక సెల్ రూపుదిద్దుకోనుంది. ఈ కేంద్రాల పర్యవేక్షణ మరియు సమన్వయ బాధ్యతలను ఒక ఎమ్మార్వో (MRO/Tahsildar) స్థాయి అధికారికి అప్పగించనున్నారు. విదేశాలలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం, గల్ఫ్ దేశాలు లేదా ఇతర దేశాలలో ఉద్యోగ, ఉపాధి పరంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులు, విద్యార్థుల సమస్యలను నేరుగా జిల్లా స్థాయిలోనే స్వీకరించి పరిష్కరించడానికి ఈ ప్రత్యేక సెల్ నిరంతరం అందుబాటులో ఉండనుంది.
జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటయ్యే ఈ మైగ్రేషన్ మేనేజ్మెంట్ కేంద్రాలు నేరుగా ‘ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ’ (APNRTS) తో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తాయి. విదేశాల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సాయం కావాలన్నా, భద్రతా పరమైన సమస్యలు తలెత్తినా, లేదా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను స్వగ్రామాలకు రప్పించాలన్నా.. ఈ జిల్లా స్థాయి సెల్స్ తక్షణమే స్పందించి ఏపీఎన్ఆర్టీ సాయంతో అవసరమైన చట్టపరమైన, దౌత్యపరమైన చర్యలు చేపడతాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రవాసాంధ్రులు మరియు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







