ఆస్కార్ విజేత కీరవాణి సంగీత విభావరి.. పాటలతో మంత్రముగ్ధులైన ఎన్నారైలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2026 ముగింపు వేడుకల్లో భాగంగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ అద్భుతంగా సాగింది. ఈ వేడుకలో కీరవాణి తన సంగీత ప్రయాణంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పాటలను ఆలపించి, ప్రవాస తెలుగువారిని మంత్రముగ్ధులను చేశారు. కన్వెన్షన్‌కు హాజరైన వేల సంఖ్యలో ప్రేక్షకులు ఈ సంగీత విభావరిని ఎంతగానో ఆస్వాదించారు.
ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర గేయం ‘జయ జయహే తెలంగాణ’తో ఘనంగా ప్రారంభమైంది. ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘కొమురం భీముడో’ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలను కీరవాణి గారు తనదైన శైలిలో అందించారు. ఆయన కంపోజ్ చేసిన ఈ పాటలు, ప్రవాస తెలుగువారిలో స్ఫూర్తిని, భాషాభిమానాన్ని రగిలించాయి. ఈ సంగీత విభావరిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కీరవాణి సంగీతానికి దాసోహమయ్యారు.
ఈ మ్యూజికల్ కాన్సర్ట్‌లో కీరవాణి బృందం అందించిన అద్భుతమైన మ్యూజిక్ , లైటింగ్ ఎఫెక్ట్స్, కార్యక్రమానికి మరింత కళను తీసుకువచ్చాయి. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ, ఈ వేడుకను ఒక పండుగలా జరుపుకున్నారు. టీటీఏ మెగా కన్వెన్షన్లొ ఈ సంగీత విభావరి ఒక హైలైట్‌గా నిలిచింది. తెలుగు సినిమా సంగీత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన కీరవాణికి, ప్రవాస తెలుగువారు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలా 3 రోజులపాటు జరిగిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 వేడుకలు ఘనంగా ముగిశాయి.








