ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ మరో గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్(Ap Government) ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రికార్డుల నిర్వహణలో కూటమి ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఏళ్ల తరబడి సాంప్రదాయ పద్ధతిలో సాగుతున్న ఫిజికల్ సర్వీస్ రికార్డుల స్థానంలో, ఇకపై పూర్తిగా డిజిటల్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ నిర్వహణ కోసం అత్యంత అధునాతనమైన ‘E-SR 2.0’ అప్లికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమల్లోకి తెచ్చింది. ఈ నూతన విధానం ద్వారా ఉద్యోగుల నియామకం, ప్రమోషన్లు, బదిలీలు, సెలవులు, ఇంక్రిమెంట్లు, మరియు రిటైర్మెంట్ ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి సమాచారం డిజిటల్ రూపంలో భద్రంగా ఉంటుంది.
దీనివల్ల కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, పారదర్శకంగా, వేగంగా సేవలందే అవకాశం ఉంటుంది. ఈ ‘E-SR 2.0’ అప్లికేషన్లో ఉద్యోగుల వివరాల నమోదు ప్రక్రియను ప్రభుత్వం దశలవారీగా చేపట్టనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయంతో పాటు అన్ని శాఖల అధిపతుల (HOD) కార్యాలయాల్లో ఈ దరఖాస్తుల నమోదు ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుంది. సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగస్టు 1వ తేదీ నుంచి ఉద్యోగుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఈ డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నాటికి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కచ్చితంగా ‘E-SR’ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని, దీనిని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్లవాత్మక మార్పుతో ఉద్యోగుల సర్వీస్ రికార్డులు పోతాయనే భయం గానీ, వివరాల నమోదులో ఆలస్యం గానీ ఉండే అవకాశం ఉండదని అధికారులు చెప్తున్నారు.








