టీటీఏ కన్వెన్షన్ 2026లో ఘనంగా డాక్టర్ ఏ.వి. గురువారెడ్డికి సత్కారం..
అమెరికాలోని చార్లెట్లో జరిగిన టీటీఏ (TTA) కన్వెన్షన్ 2026లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఏ.వి.గురువారెడ్డికి ‘టీటీఏ ఎక్స్లెన్స్ ఇన్ మెడిసిన్ అవార్డు’ను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష కృషిని, ముఖ్యంగా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలలో ఆయన సాధించిన విజయాలను టీటీఏ నిర్వాహకులు కొనియాడారు.
80,000కు పైగా సర్జరీలు చేసిన అనుభవం ఉన్న డాక్టర్ గురువారెడ్డి, ప్రస్తుతం కిమ్స్-సన్షైన్ (KIMS-SUNSHINE) హాస్పిటల్స్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్గా సేవలందిస్తున్నారని వక్తలు గుర్తుచేశారు. డాక్టర్ గురువారెడ్డి కేవలం వైద్యుడిగానే కాకుండా, సాహిత్య ప్రియుడిగా, మంచి హాస్య చతురత కలవారని, కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన చేసిన మానవీయ సేవలను నిర్వాహకులు ప్రశంసించారు. ఈ గౌరవం పట్ల డాక్టర్ గురువారెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన చిన్నతనంలో తండ్రి తన ఆసక్తిని గమనించిన తీరును, తన వృత్తిపరమైన ప్రయాణాన్ని వివరిస్తూ, తెలుగు సమాజం తనకు అందిస్తున్న మద్దతుకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఈ సత్కార కార్యక్రమం చివరలో, టీటీఏ నిర్వాహకులు డాక్టర్ గురువారెడ్డితో ఆరోగ్యం , భవిష్యత్ చికిత్సా విధానాల గురించి సంభాషించారు.








