నోలన్ ‘ఒడిస్సీ’కి AI కౌంటర్? ఒకే కథతో హాలీవుడ్లో సంచలనం!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
“ఒడిస్సీ”…
వేల ఏళ్ల క్రితం హోమర్ రాసిన గ్రీకు ఇతిహాసం.
ఇప్పుడు…
అదే ఇతిహాసంతో ఇద్దరు దర్శకులు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఒకరు… ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూసే దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్.
మరొకరు… AI సహాయంతో సినిమా తీసిన దర్శకుడు యాష్ కూషా.
ఒకటి ₹2,100 కోట్ల భారీ సినిమా… మరొకటి నలభై లక్షలతో AI సినిమా
నోలన్ తెరకెక్కించిన The Odyssey నిర్మాణ వ్యయం సుమారు 250 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు ₹2,100 కోట్లకు పైగా.
అదే సమయంలో AI సంస్థ Fountain O రూపొందించిన Odysseus: The Fall బడ్జెట్‌ను నిర్మాతలు “mid-five figures” గా పేర్కొన్నారు. అంటే దాదాపు 30 వేల నుంచి 70 వేల డాలర్ల మధ్య. భారత కరెన్సీలో ఇది సుమారు ₹25 లక్షల నుంచి ₹60 లక్షల పరిధిలో ఉండొచ్చని అంచనా. అంటే… ఒక సినిమా ఖర్చుతో వందలాది AI సినిమాలు తీయగలిగేంత తేడా.
ఇద్దరూ ఒకే ఇతిహాసాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
ఈ ప్రశ్నే ఇప్పుడు ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. AI చిత్రం దర్శకుడు యాష్ కూషా దీనిపై స్పష్టంగా స్పందించారు.
“మేము నోలన్ సినిమాకు వ్యతిరేకంగా రావడం లేదు. ఆయన సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. కానీ ఒకే గ్రీకు ఇతిహాసాన్ని భారీ హాలీవుడ్ నిర్మాణం ఎలా చెబుతుందో, ఒక వ్యక్తి AI సహాయంతో ఎలా చెబుతాడో ప్రేక్షకులు పోల్చి చూడాలని అనుకున్నాం.” అని చెప్పారు.
అంటే…ఇది బాక్సాఫీస్ పోటీ కంటే టెక్నాలజీ సామర్థ్యాన్ని చూపించే ప్రయోగం అని ఆయన అభిప్రాయం.
కెమెరా లేదు… నటులు లేరు
Odysseus: The Fallలో సంప్రదాయ అర్థంలో షూటింగ్ జరగలేదు. నటుల స్థానంలో AI మోడల్స్. కెమెరాతో షూటింగ్ లేదు. భౌతిక సెట్లు లేవు. ప్రతి సీన్ AIతో రూపొందించబడింది
ఈ చిత్రం కోసం Kling AIతో విజువల్స్ రూపొందించగా, Google Nanobananaతో కీలక ఫ్రేమ్‌లు తయారు చేశారు. Claude AI భాషా ఎడిటింగ్‌లో, Google Gemini రీసెర్చ్‌లో ఉపయోగించారు. అయితే కథ, స్క్రిప్ట్, పాత్రల రూపకల్పన వంటి సృజనాత్మక నిర్ణయాలు మాత్రం దర్శకుడే తీసుకున్నట్లు టీమ్ తెలిపింది.
“AI కథ చెప్పదు… కథ చెప్పేది మనిషే”
AI వల్ల దర్శకులు, రచయితలు అవసరం తగ్గిపోతుందా? అనే ప్రశ్నకు యాష్ కూషా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “AI అనేది ఒక టూల్ మాత్రమే. అది కథను సృష్టించదు. చెప్పాలనే ఆలోచన, భావోద్వేగం, ఉద్దేశం మనిషి నుంచే వస్తాయి. మంచి సినిమా విలువను నిర్ణయించేది ఎప్పటికీ కథే.” అని ఆయన చెప్పారు.
AI సినిమా ఎప్పుడు విడుదల?
నోలన్ తెరకెక్కించిన The Odyssey జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. మరోవైపు Odysseus: The Fallను ఈ వేసవి చివర్లో (later this summer) విడుదల చేయనున్నట్లు Fountain O ప్రకటించింది. ఖచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించలేదు.
ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా Fountain O అధికారిక వెబ్సైట్ ద్వారా $9.99 అద్దె (రెంటల్) విధానంలో ప్రేక్షకులకు అందించనున్నారు. అలాగే యాష్ కూషా గత AI చిత్రం Dreams of Violets జూలై 17 నుంచి అదే వెబ్సైట్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది.
ఇది టాలీవుడ్‌కు కూడా ఒక సంకేతమా?
AI ఇప్పటివరకు పోస్టర్లు, టీజర్లు, షార్ట్ వీడియోల వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడు పూర్తి నిడివి సినిమా కూడా రూపొందించగల స్థాయికి చేరిందని ఈ ప్రయోగం చెబుతోంది. భారీ బడ్జెట్లతో సినిమాలు తీసే పద్ధతి ఒక వైపు ఉంటే… తక్కువ ఖర్చుతో కొత్త ఆలోచనలను తెరపైకి తీసుకురావాలనుకునే స్వతంత్ర దర్శకులకు AI మరో మార్గం చూపుతుందా? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.
కంక్లూజన్
నోలన్ సినిమా హిట్ అవుతుందా.. AI సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా… అనేది తర్వాత విషయం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది.
AI ఇక సినిమా గురించి మాట్లాడటం లేదు… సినిమా భాషలోనే మాట్లాడటం ప్రారంభించింది.
‘ఒడిస్సీ’ కేవలం ఒక సినిమా కాదు. సంప్రదాయ ఫిల్మ్‌మేకింగ్, AI ఆధారిత ఫిల్మ్‌మేకింగ్ మధ్య మొదలైన కొత్త అధ్యాయానికి ఒక ప్రతీకగా మారింది.








