మన ఫోటోలతోనే ₹300 కోట్ల ‘చీకటి’ వ్యాపారం… AI ‘న్యూడిఫై’ అసలు కథ!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
మీ జీవితంలో అత్యంత విలువైన ఫోటో ఏది?
మీ పెళ్లి ఫోటోనా?
మీ బిడ్డ పుట్టినరోజు ఫోటోనా?
లేక మీ అమ్మతో దిగిన చివరి ఫోటోనా?
మీకు అవి జ్ఞాపకాలు.
కానీ AIకి… అవి ప్రొడక్ట్స్.
మీరు ప్రేమతో సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఫోటో… ఎవరో మీ ఫర్మిషన్ లేకుండా తీసుకుని… నకిలీ అసభ్యకర చిత్రంగా మార్చి… దానితో డబ్బు సంపాదించే మార్కెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల వ్యాపారంగా మారిందని తాజా నివేదిక హెచ్చరిస్తోంది.
ఒక్క ఫోటో… ఒక్క క్లిక్…అవతలివాడికి డబ్బు…
ఇవతలివాడికి జీవితాంతం మానసిక వేదన.
ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న AI ‘న్యూడిఫై’ మార్కెట్ అసలు కథ.
₹100తో మొదలై… ₹300 కోట్ల వ్యాపారం
ఒక ఫోటోను AIతో నకిలీ అసభ్యకర చిత్రంగా మార్చడానికి కొన్ని వెబ్సైట్లు ఒక్క డాలర్ (సుమారు ₹80-₹100) మాత్రమే వసూలు చేస్తున్నాయి. తక్కువ ధర కావడంతో ఈ సేవలకు డిమాండ్ పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు.
దీని వెనుక ఉన్న వ్యాపారం ఎంత పెద్దదో మరో దర్యాప్తు చెబుతోంది. ప్రముఖ న్యూడిఫై ప్లాట్‌ఫారమ్‌లు కలిసి ఏడాదికి 36 మిలియన్ డాలర్ల వరకు (దాదాపు ₹300 కోట్లకు పైగా) ఆదాయం ఆర్జిస్తున్నాయని అంచనా. అంటే… మనుషుల ఫోటోలను దుర్వినియోగం చేసే టెక్నాలజీ చుట్టూ ఇప్పుడు కోట్ల రూపాయల డిజిటల్ పరిశ్రమ ఏర్పడిందన్న మాట.
ఈ మార్కెట్‌కు కస్టమర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు?
Institute for Strategic Dialogue (ISD) విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2025 డిసెంబర్ నుంచి 2026 మార్చి మధ్య కేవలం నాలుగు నెలల్లోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఈ న్యూడిఫై వెబ్సైట్లకు 5.7 మిలియన్లకు పైగా విజిట్స్ నమోదయ్యాయి.
నివేదికలో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, ఈ వెబ్సైట్లకు వెళ్లిన ట్రాఫిక్‌లో YouTube ఒక్కటే 18.2 లక్షల విజిట్స్ పంపించింది. ఈ టూల్స్‌ను సమీక్షించే వీడియోలు, వాటి కింద ఉన్న లింకుల ద్వారా యూజర్లు ఈ వెబ్సైట్లకు చేరినట్లు అధ్యయనం గుర్తించింది.
X (పాత Twitter) ద్వారా కూడా 13 లక్షలకుపైగా విజిట్స్ నమోదయ్యాయి.
ISD అభిప్రాయం ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్‌లు నేరుగా ఇలాంటి చిత్రాలను సృష్టించకపోయినా, యూజర్లు ఈ టూల్స్‌ను చేరుకునే మార్గాలుగా ఉపయోగించబడ్డాయి. YouTube విధానాలు ఇలాంటి కంటెంట్‌ను నిషేధిస్తున్నప్పటికీ, వాటి అమలు అన్ని సందర్భాల్లో సమర్థంగా జరగడం లేదని నివేదిక విమర్శించింది.
మన ఫోటోలు ఎలా ఈ మార్కెట్లోకి వెళ్తున్నాయి?
చాలామంది ఇలాంటి ఘటనలు జరగాలంటే ఫోన్ హ్యాక్ కావాలని అనుకుంటారు. కానీ నిపుణులు చెబుతున్నది వేరే విషయం. చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో పబ్లిక్‌గా కనిపించే ఫోటోలే దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
Facebook, Instagram, X, LinkedIn వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మనం పంచుకునే ఫోటోలు అందరికీ కనిపించేలా ఉంటే, వాటిని డౌన్లోడ్ చేయడం లేదా ఇతర మార్గాల్లో సేకరించడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత వాటిని AI టూల్స్‌తో అనుమతి లేకుండా మార్చి నకిలీ చిత్రాలుగా తయారు చేసే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేవలం అసభ్యకర చిత్రాల కోసమే కాదు…
ISD నివేదిక ప్రకారం, ఈ టూల్స్‌ను ఉపయోగించే ఉద్దేశాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుత లేదా మాజీ భాగస్వాములపై ప్రతీకారం తీర్చుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయడం, వ్యక్తిగత ప్రతిష్టను నాశనం చేయడం వంటి కారణాలతో కూడా ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది.
అంటే ఇది కేవలం అశ్లీల కంటెంట్ సమస్య మాత్రమే కాదు… వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యం, సామాజిక గౌరవంపై కూడా తీవ్ర ప్రభావం చూపే డిజిటల్ నేరంగా మారుతోంది.
మీ ఫోటోలను ఎలా కాపాడుకోవాలి?
✔ Facebook, Instagram వంటి ఖాతాలను Public కాకుండా Privateలో ఉంచండి.
✔ పిల్లల ఫోటోలను పబ్లిక్‌గా పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.
✔ తెలియని AI ఫోటో ఎడిటింగ్ యాప్‌లకు గ్యాలరీ యాక్సెస్ ఇవ్వకండి.
✔ వ్యక్తిగత వివరాలు కనిపించే ఫోటోలను అందరికీ కనిపించేలా షేర్ చేయకండి.
ముగింపు
ఈ కథలో అత్యంత విషాదకరమైన విషయం AI కాదు… మన జ్ఞాపకాలు ఎవరికో వ్యాపారంగా మారిపోవడమే.
అందుకే ఇకపై సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసే ముందు…
“ఈ ఫోటోకు ఎన్ని లైక్స్ వస్తాయి?” అని మాత్రమే కాదు…
“ఈ ఫోటో తప్పు చేతుల్లో పడితే?” అని కూడా ఒక్కసారి ఆలోచించండి.








